మెదక్, జూలై 14 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. రైతు కంట కన్నీళ్లు పెట్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్నదాతల ఉసురు తగులుతుందని విమర్శించారు. సోమవారం మెదక్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ రాహుల్‌రాజ్‌కు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డితోపాటు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాలుగు రోజుల్లో సింగూరు నుంచి ఘనపూర్ ప్రాజెక్టుకు సాగు నీటిని విడుదల చేయాలని, లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. సింగూరులో నీళ్లు ఉన్నా ఘనపూర్ ప్రాజెక్టుకు 0.4 టీఎంసీలు వాటాగా రావాల్సినవి విడుదల చేయడం లేదని విమర్శించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సమయానికి నీళ్లు వదిలితే రైతులు పంటలు సాగు చేసుకున్నారని గుర్తుచేశారు. గత పదేండ్లలో రైతులు ఏనాడూ రోడ్డెక్క లేదని గుర్తుచేశారు. సింగూరు, కాళేశ్వరం జలాలు, కొండపోచమ్మసాగర్ నుంచి హల్దీ ప్రాజెక్టుకు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 24 గంటల కరెంటుతోపాటు పుష్కలంగా సింగూరులో నీళ్లు ఉంటే ఘనపూర్ ప్రాజెక్టుకు వదలడంతో రైతులు పంటలను సాగు చేసుకున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. జీవో ప్రకారం 1.4 టీఎంసీల సింగూర్ నీటిని 7 విడతల్లో విడుదల చేయాల్సి ఉన్నదని తెలిపారు. సర్కార్ నీళ్లు ఇవ్వకపోవడంతో పాటు కరెంటు సక్రమంగా సరఫరా చేయకపోవడంతో రైతులు పంటలను పండించుకోలేకపోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సర్కార్‌కు రైతులపై ప్రేమ లేదనే విషయం తేలిపోయిందని అన్నారు. రేవంత్‌రెడ్డి ఒక సభలో మాట్లాడుతూ.. రైతు రాజ్యాన్ని తెచ్చినట్టు చెప్పారని, రైతు రాజ్యమంటే పంటలు ఎండగొట్టడమేనా? అని ప్రశ్నించారు. ప్రెస్‌క్లబ్‌కు రండి చర్చిద్దామని కేటీఆర్ అంటే రేవంత్‌రెడ్డి ఢిల్లీకి పారిపోయాడని ఎద్దేవా చేశారు. గత యాసంగిలో రైతులు పండించిన ధాన్యానికి ఇప్పటివరకు బోనస్ చెల్లించలేదని మండిపడ్డారు.
సింగూరు నుంచి ఘనపూర్ ప్రాజెక్టుకు వెంటనే నీటిని విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. సింగూరు నుంచి ఘనపూర్ ప్రాజెక్టుకు 2.5 టీఎంసీలు, నిజాంసాగర్‌కు 4 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉన్నదని గుర్తుచేశారు. గత ఆంధ్రా పాలకులు సింగూరును హైదరాబాద్ మెట్రోవాటర్ వర్క్‌కు అప్పగించారని శేరి సుభాష్‌రెడ్డి తెలిపారు. కానీ కేసీఆర్ హయాంలో సింగూరు నీటిని ఘనపూర్ ప్రాజెక్టుకు విడుదల చేసేలా చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. సాగు నీటిని విడుదల చేయకుండా సర్కార్ రైతులను విస్మరిస్తున్నదని మండిపడ్డారు.