తెలంగాణలో మద్యం ఏరులై పారుతున్న తీరుకు హైకోర్టు వ్యాఖ్యలే అద్దం పడుతున్నాయి. గడిచిన రెండేండ్లలో రాష్ర్టాన్ని మందులో ముంచుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. పెరిగిన లిక్కర్ దుకాణాలు.. విచ్చలవిడి అనుమతులు.. ఊరూరా బెల్ట్ షాపులు.. మద్యపుటేరులను పారిస్తున్నాయి. 723 రోజుల పాలనలో 724 లక్షల కేసుల మద్యం, 960 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయంటే, సుమారు 1.3 లక్షల కోట్ల రాబడి రాబట్టిందంటే కాంగ్రెస్ సర్కారు మద్యాదాయానికి ఎంతలా తహతహలాడుతున్నదో అర్థం చేసుకోవచ్చు. ఇంతా చేసి..ఆ ఆదాయంలో సగం కూడా సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చించకపోవడం మరో విషాదం.
హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో మద్యం దుకాణాలు, బార్ల సంఖ్య రోజురోజుకూ పెరగడంపై స్వయంగా హైకోర్టు ఆందోళన వ్యక్తం చేయడమేకాదు.. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రానికి కొత్త పేరు పెట్టాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతున్నదని, ప్రభుత్వం ప్రజలను మద్యం మత్తులో ముంచుతున్నదని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? అంతేకాదు, మాది ప్రజాప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్‌కు లిక్కర్‌పై ఉన్న శ్రద్ధ, సంక్షేమంపై లేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత రెండేండ్లలో జరిగిన మద్యం అమ్మకాల్లో కనీసం సగం కూడా సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం ఖర్చు చేయలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
మరోవైపు రాష్ట్రంలో సోమవారం నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలు కొత్త ఓనర్ల చేతికి వెళ్లాయి. వీటికితోడు ఈ ఏడాది కొత్తగా 40 వేల బెల్టు దుకాణాలు రాబోతున్నట్టు ఎక్సైజ్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇప్పటికే గ్రామాల్లో వీధివీధినా ఉన్న పాత బెల్టు దుకాణాలను కలిపితే 1.45 లక్షల బెల్టు దుకాణాలు అవుతాయని సమాచారం. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, ముఖ్యమంత్రి, మంత్రుల విమాన, హెలికాప్టర్ ఖర్చులు, ఇప్పటివరకు జరిగిన సమ్మిట్లకు అయిన ఖర్చులో ప్రతి రూపాయి బ్రాందీ బుడ్డీ నుంచే తీస్తున్నారని చర్చ జరుగుతున్నది.
‘మందు’ కిక్కు.. రూ.1.30 లక్షల కోట్లు
రాష్ట్ర బడ్జెట్లో 17 శాతం ఆదాయం ఎక్సైజ్ రాబడి ద్వారానే సమకూరుతున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2023 డిసెంబర్ 9 నుంచి 2025 నవంబర్ 2025 వరకు మద్యం వ్యాపారం ద్వారా రూ.1.30 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో రూ.73,538 కోట్లు ఎక్సైజ్ రెవెన్యూ ద్వారా ఆర్జించినట్టు ఎక్సైజ్ శాఖ చెప్తున్నది. ఏ4 మద్యం దుకాణాలు, బార్లు, మైక్రోబ్రూవరీలు, డిస్టిలరీలు, బ్రూవరీల లైసెన్స్ ఫీజులు, ఎక్సైజ్ డ్యూటీ కలిపి ఎక్సైజ్ రెవెన్యూగా పరిగణిస్తారు. మద్యం బ్రాండ్‌ను బట్టి ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది. లిక్కర్ బేసిక్ ధర మీద 70శాతం నుండి 120శాతం వరకు ఎక్సైజ్ డ్యూటీని తాగే వాళ్ల నుంచి వసూలు చేస్తారు. విదేశీ మద్యమైతే ఈ సుంకం 150శాతం, ఆపైకి కూడా వెళ్తుంది. ఇక మద్యం కంపెనీల నుంచి మద్యం సీసాలు తెలంగాణ బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్(టీజీబీసీఎల్) ఆధీనంలోకి వస్తాయి. టీజీబీసీఎల్ 80 శాతం వ్యాట్ టాక్స్ విధించి దుకాణాలు, బార్లకు విక్రయిస్తుంది. గత రెండేండ్లలో రూ.55,728 కోట్లు వ్యాట్ ద్వారా వచ్చాయని అధికారిక నివేదికలు చెప్తున్నాయి. ఎక్సైజ్ రెవెన్యూ, వ్యాట్ టాక్స్‌ను కలిపి మద్యం అమ్మకపు ఆదాయంగా పరిగణిస్తామని టీఎస్‌బీసీఎల్ అధికారులు చెప్తున్నారు. ఇలా మొత్తంగా రెండేండ్లలో రూ.1,29,266 కోట్ల ఆదాయం వచ్చినట్టు చెప్తున్నారు. గత నెలలో కొత్త మద్యం పాలసీలో భాగంగా అందిన దరఖాస్తుల ఫీజులు, లైసెన్స్ ఫీజుల రూపంలో రూ.3,180 కోట్లకుపైగా ఆదాయం వచ్చింది. ఇది కూడా కలుపుకుంటే మద్యం ద్వారా వచ్చిన ఆదాయం రూ.1,32,446 కోట్లకు చేరుతుంది.
సంక్షేమం ఖర్చు రూ.49 వేల కోట్లే
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 యాసంగిలో రైతు భరోసా కింద రూ.6,800 కోట్లు, 2024 యాసంగిలో రూ.3,600 కోట్లు, 2025 వానకాలంలో రూ.8,744 కోట్లు ఖర్చు చేసింది. ఇందిరమ్మ చేయూత కింద రెండేండ్లలో వృద్ధులకు ఇచ్చిన పింఛన్ సొమ్ము రూ.1744 కోట్లు. మహిళలకు ఉచిత బస్సు కోసం రూ.8 వేల కోట్లు ఖర్చు చేసినట్టు చెప్తున్నది. ఈ మధ్య ఇచ్చిన ఇందిరమ్మ చీరలకు రూ.400 కోట్లు ఖర్చైనట్టు ప్రచారం చేస్తున్నది. అసంపూర్తి రైతు రుణమాఫీకి రూ.20 వేల కోట్లు.. ఇలా అన్ని ప్రధాన సంక్షేమ పథకాలు కలిపినా రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.49.28 వేల కోట్లు మాత్రమే. మద్యం వ్యాపారం ద్వారా వచ్చిన రూ.1.30 లక్షల కోట్ల ఆదాయంతో పోల్చితే కనీసం సగం కూడా సంక్షేమానికి ఖర్చు చేయలేదని స్పష్టం అవుతున్నది. 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండేండ్ల కాలంలో అరకొర పథకాలనే అమలుచేసింది. ఈ లెక్కన ఎవరి డబ్బుతో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయో, రేవంత్‌రెడ్డి విమానాల్లో ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు ఎలా చేయగలుగుతున్నారో, మంత్రులు వంద కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్లలో ఎలా షికార్లు చేయగలుగుతున్నారో అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
రేవంత్ పాలనలో మద్యపుటేరులు
రేవంత్‌రెడ్డి అధికారంలో ఉన్న 723 రోజుల్లో.. రాష్ట్రంలో 724 లక్షల కేసుల లిక్కర్, 960 లక్షల కేసుల బీరు విక్రయించారు. ఈ లెక్కన రోజుకు 1 లక్ష కేసుల మద్యం, 1.10 లక్షల కేసుల బీరు చొప్పున వ్యాపారం జరిగింది. రాష్ట్రంలో 2620 మద్యం దుకాణాలు, 1200 బార్లు, క్లబ్బులు ఉన్నాయి. మద్యం దుకాణం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అంటే 12 గంటల పాటు మద్యం విక్రయాలకు అనుమతి ఉన్నది. బార్లకైతే 13 గంటల పాటు మద్యం అమ్ముకోవచ్చు. ఆయా దుకాణాలు, బార్ల ద్వారా ప్రతి 2 నిమిషాలకూ ఒక మద్యం సీసా, ప్రతి నిమిషానికీ ఒక బీరు సీసా విక్రయించినా..బీరు, మద్యం కలిపి రోజుకు 45 వేల కేసులకు మించి మద్యం వినియోగదారునికి ఇవ్వటం కష్టం. కానీ రాష్ట్రంలో రోజుకు ఏకంగా 2.10 లక్షల కేసుల మద్యం, బీరు ఏరులై పారుతున్నదంటే దానికి కారణం బెల్టు దుకాణాలేనని ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. 25 శాతం అధికారిక దుకాణాల నుంచి అమ్ముతుండగా..75 శాతం బెల్టు దుకాణాల్లోనే విక్రయాలు జరుగుతున్నాయని చెప్తున్నారు.
బెల్టు దుకాణాలతో మరింతగా..
గతంలో ఎన్నడూ లేనంతగా గ్రామాల్లో బెల్టు దుకాణాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. పాతవి, కొత్తవి కలిపి రాష్ట్రవ్యాప్తంగా బెల్టు దుకాణాల సంఖ్య 1.45 లక్షలకు పెరుగుతుందని అంచనా. కేవలం బెల్టు దుకాణాల ద్వారా రూ.2,500 కోట్ల మద్యం వ్యాపారం చేయాలని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తున్నట్టు సమాచారం. 2023-24 తెలంగాణలో ఒకో వ్యక్తి సగటున మద్యం కోసం రూ.897 చొప్పున ఖర్చు చేసేవారని, గత ఏడాది సగటు రూ.1,623కు పెరిగిందని, ఈ ఏడాది సగటు రూ.2,156కు పెరిగినట్టుగా అంచనా వేస్తున్నారు.
ఇండ్ల మధ్య మద్యం దుకాణాలా?

జనావాసాల మధ్య మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం ఖమ్మం పట్టణం లోని ముస్తఫానగర్‌లో కొత్తగా అనుమతించిన వైన్‌షాపు ఎదుట ఆందోళనకు దిగిన స్థానికులు
మద్యం దుకాణాలు ఇలాగే పెరుగుతూపోతే తెలంగాణ రాష్ర్టానికి కొత్త పేరు పెట్టుకోక తప్పదేమో
-జనావాసాల మధ్య మద్యం దుకాణాలపై విచారణ సందర్భంగా ఇటీవల హైకోర్టు వ్యాఖ్య.
