హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): మాజీ సర్పంచులపై ప్రభుత్వం దమనకాండకు దిగింది. మాజీ సర్పంచుల సంఘం రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు చలో అసెంబ్లీకి వస్తున్నవారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. సోమవారం తెల్లవారుజాము నుంచే వారిని రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో ఎక్కడికక్కడే నిర్బంధించారు. రహదారులపై చెక్‌పోస్ట్‌లు పెట్టి హైదరాబాద్‌కు వస్తున్న వారి వాహనాలను అడ్డుకొని పోలీస్స్టేషన్లకు తరలించారు. మూడు, నాలుగు గంటలపాటు అదుపులో ఉంచుకొని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు వినతిపత్రం అందజేసిన తర్వాత శాంతియుతంగా ర్యాలీగా అసెంబ్లీకి వెళ్తున్న తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని సౌత్ వెస్ట్‌జోన్ డీసీపీ సాయినాథ్గంజ్ బలవంతంగా వ్యాన్‌లో ఎక్కించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శాంతియుతంగా మంత్రులకు వినతిపత్రాలు అందించేందుకు వెళ్తున్నవారిపై జులుం ప్రదర్శించడమేమిటని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ ప్రశ్నించారు. బిల్లులు అడిగిన పాపానికి అరెస్ట్ చేయడం దుర్మార్గమని విమర్శించారు. నిర్బంధాలు, అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని హెచ్చరించారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే మాజీ సర్పంచుల పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే భార్యాబిడ్డలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. అరస్టు అయిన వారిలో సర్పంచుల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, ఉపాధ్యక్షుడు గంటి మధుసూదన్‌రెడ్డి, మాట్ల మధు, కేశోయిన మల్లయ్య, నెమలి సుభాష్, వేపూరి జయలక్ష్మి, బొల్లం శారద, ఇటుకల కుమారస్వామి తదితరులు ఉన్నారు.
పెండింగ్ బిల్లులు అడిగిన మాజీ సర్పంచులను అరెస్ట్ చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని వేడుకుంటున్న వారిని గోస పెట్టడం ఎంతవరకు సమంజసమని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. అప్పులు తెచ్చి, భార్య పుస్తెలమ్మి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన వారిపై కక్ష సాధించడం బాధాకరమని పేర్కొన్నారు. ఐదేండ్లు నిర్విరామంగా పనిచేసి పల్లెల రూపుమార్చిన మాజీ సర్పంచులకు ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. బడా కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్ధంగా పనులు కట్టబెట్టి మొబిలైజేషన్ బిల్లులు చెల్లించిన ప్రభుత్వం, మాజీ సర్పంచుల సమస్యలపై మొద్దునిద్ర నటిస్తున్నదని మండిపడ్డారు. ఇప్పటికైనా పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ సర్పంచుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు.
నమస్తే తెలంగాణ న్యూస్‌నెట్‌వర్క్, డిసెంబర్ 9 : పెండింగ్ బిల్లులు చెల్లించాల ని డిమాండ్ చేస్తూ సోమవారం తలపెట్టిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమానికి వెళ్లకుండా మాజీ సర్పంచ్‌లను పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేశారు. కొన్నిచోట్ల ముందస్తుగా అరెస్టు చేయగా, మరికొన్ని చోట్ల హైదరాబాద్‌కు బయల్దేరుతుండగా అడ్డుకొని సాయంత్రం వరకు నిర్బంధించారు. న్యాయమైన డిమాండ్‌ను నెరవేర్చుకునేందుకు ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని తలపెడితే పోలీసులు అడ్డుకోవడమేమిటని మం డిపడ్డారు. ఖమ్మం జిల్లా రఘునాథపల్లి, ముదిగొండలో హైదరాబాద్ వెళ్తున్న మాజీ సర్పంచ్‌లను మార్గమధ్యంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉమ్మడి వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో మాజీ సర్పంచులను పోలీసులు నిర్బంధించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచే గ్రామాల్లోకి వెళ్లి ప డుకున్న వారిని నిద్రలేపి మరీ అదుపులోకి తీసుకొన్నారు. ఉదయం నుంచి సాయం త్రం వరకూ ఠాణాల్లోనే ఉంచి తర్వాత వదిలిపెట్టారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లోని మాజీ సర్పంచులు తరలివెళ్లకుండా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్, లక్షెట్టిపేట, కోటపల్లి, కాసిపేట, హాజీపూర్, వేమనపల్లి, మందమర్రి, నిర్మల్ జిల్లాలో ఖానాపూర్, దస్తురాబాద్, పెంబి, నర్సాపూర్(జీ) మండలాల్లోని పలు గ్రామాల మాజీ సర్పంచ్‌లను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. కాగా మాజీ సర్పంచులు సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట రిలే దీక్షలు ప్రారంభించారు.
పెండింగ్ బిల్లులు చెల్లించాలని అడిగినందుకు మాజీ సర్పంచులను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం జైలుకు పంపిస్తున్నదని పల్లా రాజేశ్వర్‌రెడ్డి దుయ్యబట్టారు. మంత్రులు, వారి అనుచరులైన కాంట్రాక్టర్లకు రూ.వేల కోట్ల బిల్లులు వెంటనే విడుదల చేస్తున్న ప్రభుత్వం.. మాజీ సర్పంచులను మాత్రం గోస పెడుతున్నదని మండిపడ్డారు. ఆశా వర్కర్లు, మాజీ సర్పంచుల అరెస్టులతో హైదరాబాద్‌లోని పోలీస్స్టేషన్లన్నీ నిండిపోతున్నాయని పేర్కొన్నారు. మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.