బొంరాస్పేట, మే 5: పారిశ్రామికవాడ ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసి భూములను సేకరిస్తున్నది. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం దుద్యాల, లగచెర్ల, హకీంపేట, పోలెపల్లి, రోటిబండ తండా, పులిచెర్లకుంట తండాల్లో భూసేకరణ కొనసాగుతున్నది. ఇందులో భాగంగా తహసీల్దార్ కిషన్ ఆధ్వర్యంలో సోమవారం రోటిబండతండాలో భారీ పోలీసు పహారా నడుమ అధికారులు సర్వే కొనసాగించారు. రోటిబండతండాలోని సర్వే నంబర్ 9లో మొత్తంగా 99 ఎకరాల 27 గుంటలకు సంబంధించి సర్వే పూర్తి చేసినట్టు తెలిపారు. తమకు సమాచారం ఇవ్వకుండానే అధికారులు సర్వే చేపట్టడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సర్వే చేపడుతున్న క్రమంలో సమాచారం అందుకొన్న రైతులు తమ భూముల వద్దకు చేరుకున్నారు. గతంలో భూ సేకరణలో భాగంగా లగచర్ల ఘటన తలెత్తడంతో అధికారులు ముందస్తు చర్యగా పోలీసులను మోహరించి సర్వే నిర్వహిస్తున్నారు. భూ సర్వేను డీఎస్పీ శ్రీనివాస్ పర్యవేక్షించారు.