హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): కులగణనలో పాల్గొనని 3,56,323 కుటుంబాలకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. నేటి నుంచి ఈ నెల 28 వరకు వివరాలు నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇందుకోసం టోల్‌ఫ్రీ నంబర్ 040-21111111ను అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు. ఈ నంబర్‌కు ఫోన్ చేస్తే ఎన్యుమరేటర్లు వారి ఇండ్లకు వెళ్లి వివరాలు సేకరించనున్నట్టు తెలిపారు. మండల పరిషత్ కార్యాలయాల్లోనూ కుటుంబసభ్యుల వివరాలు చెప్పవచ్చని వెల్లడించారు. seeepcsurvey. cgg. gov.in వెబ్సైట్ నుంచి సర్వే ఫామ్‌ను డౌన్లోడ్ చేసుకొని వివరాలు నమోదు చేసి ఆయా గ్రామాల ప్రజాపాలన కేంద్రాల్లోనూ ఇవ్వవచ్చని సూచించారు.
సర్కారు చెప్పిందొకటి.. చేసేదొకటి
రాష్ట్రంలో కులగణనలో పాల్గొనని వారి వివరాల నమోదుకు రీసర్వే నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఎన్యుమరేటర్ల ద్వారా ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తామని ఈ నెల 12న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఈ నెల 16 నుంచి 28 వరకు రీసర్వే చేస్తామని వెల్లడించారు. కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్చేస్తేనే ఎన్యుమరేటర్లు వారి ఇండ్లకు వెళ్లి కుటుంబ వివరాలు సేకరిస్తారని, లేదంటే మండల పరిషత్ కార్యాలయాలకు వెళ్లి నమోదు చేసుకోవాలని మెలికపెట్టింది. ప్రభుత్వ వైఖరిని బీసీ సంఘాల నాయకులు తప్పుబడుతున్నారు. ప్రభుత్వం పునరాలోచించి ఎన్యుమరేటర్ల ద్వారా తిరిగి సర్వే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.