హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): బడిబాట కార్యక్రమాన్ని ఈ నెల 6 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 6 నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ నెల 12న బడులు పున ః ప్రారంభమవుతాయని, విద్యార్థులకు ఒక యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలను అందిస్తామని చెప్పారు. ఆ రోజు రాష్ట్రంలోని ఎమ్మెల్యేలంతా విద్యార్థులకు యూనిఫారాలు, పుస్తకాలను పంపిణీ చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారని చెప్పారు. ఇక ప్రభుత్వ బడుల్లో చేరడంతో ఒనగూరే ప్రయోజనాలను తల్లిదండ్రులకు వివరిస్తామని పేర్కొన్నారు. సర్కారు బడుల్లో చేరడంతో ఫీజు లు మిగులుతాయని, యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందిస్తామన్నారు. ప్రభు త్వ బడుల్లో చదివిన వారికి ఇంజినీరింగ్ కోర్సు ల్లో ఫీజు రాయితీ లభిస్తుందని వెల్లడించారు.
విద్యావలంటీర్లు లేనట్టే
టీచర్ల కొరత సమస్యను అధిగమించేందుకు ఈ ఏడాది విద్యావలంటీర్లను నియమించే అవకాశాలు కనిపించడంలేదు. ఈ నెల 12 నుంచి తరగతులు ప్రారంభంకానున్న నేపథ్యంలో పలు బడుల్లో టీచర్ల కొరత ఉందని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. కానీ ప్రభుత్వ వర్గాలు మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే లక్షకు పైగా టీచర్లున్నారని, డీఎస్సీ ద్వారా మరో 11 వేల మందిని నియమించనున్నటూ చెప్తున్నాయి. ఇక డీఎస్సీ2008 వారికి ఉద్యోగాలు కల్పించడంలో భాగంగా మూడు, నాలుగు నెలల్లో 3 వేల మందికి పోస్టింగ్స్ ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో 19 లక్షల మంది విద్యార్థులుండగా విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి 10లోపే అవుతుందని ఇలాంటప్పుడు విద్యావలంటీర్ల అవసరం ఉండదని అధికారులు చెప్తున్నారు.