హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పెట్టుబడులకు రెడ్ కార్పెట్ పరుస్తామని, పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలిస్తామని ఊదరగొట్టిన కాంగ్రెస్ సర్కారు ఆ రెండు విషయాల్లో దారుణంగా విఫలమైంది. ప్రైవేట్ రంగంలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు నిరభ్యంతర పత్రాల (ఎన్వోసీ) జారీని నిలిపివేయడమే ఇందుకు నిదర్శనం. గత ఏడాదిగా కనీసం ఒక్కరికి కూడా ఎన్వోసీ జారీచేయలేదు. రేవంత్‌రెడ్డి ప్రభు త్వం ఈ ఏడాది జనవరిలో అట్టహాసంగా ‘క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ -2025 పాలసీని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలో భాగం గా సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు టీజీ రెడ్కో దరఖాస్తులను ఆహ్వానించడంతో 200 మందికిపైగా ఔత్సాహికులు దరఖాస్తులు సమర్పించారు.
మెగావాట్‌కు రూ.25 వేలతోపాటు 18% జీఎస్టీని టీజీ రెడ్కోకు చెల్లించారు. కానీ, ఏడాది కాలంగా ఒక్కరికి కూడా ఎన్వోసీ జారీచేయలేదు. దరఖాస్తుదారుల్లో అత్యధికులు తెలంగాణ పారిశ్రామికవేత్తలే ఉన్నారు. ప్రస్తుతం వారంతా సోలార్ డెవలపర్స్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తున్నది. క్యాప్టివ్ పవర్‌కు రాష్ట్ర క్యాబినెట్ ఇటీవలే పచ్చజెండా ఊపింది. ఈ విధానంలో పరిశ్రమలు డిస్కంతో సంబంధం లేకుండా సొంత గా ప్లాంట్ ఏర్పాటు చేసుకుని, అందులో ఉత్పత్తయ్యే విద్యుత్తును పొందవచ్చు. పరిశ్రమల నుంచి డిస్కంలు అధిక చార్జీలు వసూ లు చేస్తుండటంతో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని సొంతగా విద్యుత్తును ఉత్పత్తి చేసుకునేందుకు పారిశ్రామికవేత్తలు మొగ్గుచూపుతున్నారు. కానీ, రెడ్కో అధికారులు మాత్రం ఎన్వోసీలు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారు. ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తున్నది.
గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం.. 2034-35 నాటికి 25 వేల మెగావాట్ల సోలార్ ప్లాంట్లు పెట్టాలని ప్రణాళికలను సిద్ధం చేసింది. కానీ, గత ఏడాదిగా ఒక్క ఎన్వోసీ కూడా జారీచేయకపోవడంతో ఆ లక్ష్యాన్ని ఎలా సాధిస్తారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.