Land Tax | ఆనాడు పటేల్.. పట్వారీ వ్యవస్థను తీసేసిన తర్వాత కూడా కొద్ది రోజుల దాకా రకం కట్టే వ్యవస్థ ఉండేది. దానివల్ల ఎవరి భూమి ఎవరి ఆధీనంలో ఉన్నదనే విషయం తెలిసేది. ఇప్పుడు భూముల సమస్య పరిష్కారం కోసం అలాంటి వ్యవస్థ తేవాల్సిన అవసరం ఉన్నది. ఆనాడు ఉన్నట్టు ఎకరానికి 100 అన్నట్టుగా కాకుండా.. నామమాత్రపు రకం (శిస్తు) కడితే ఇచ్చే రశీదుతో భూమిపై భద్రత కలుగుతది. ప్రభుత్వం ఇప్పుడు ఇదే పద్ధతిని ప్రవేశపెట్టి నామమాత్రపు భూమి శిస్తు వసూలు చేసే ఆలోచన చేస్తున్నది. దీనిపై అవసరమైతే అసెంబ్లీలో చర్చ పెట్టి ఎలాంటి పాలసీ తీసుకురావాలనేది నిర్ణయిస్తం.
– ఖమ్మం జిల్లా దమ్మపేటలో నిర్వహించిన సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
ఖమ్మం, జూన్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భూమి రకం.. నాలుగు దశాబ్దాల క్రితం తెలంగాణ రైతులకు నరకం చూపించిన శిస్తు ఇది. ఆరుగాలం కష్టపడి పంట పండించి అందరికీ అన్నం పెట్టే అన్నదాతల పాలిట శాపమై పీడించింది. ఎవుసం చేసుకొని బతికే రైతులు, పంట పడించుకొనేందుకు కూడా నాటి పాలకులకు పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఒకవేళ శిస్తు కట్టకుంటే రైతుల ఇంటి దర్వాజలు, ఇతర వ్యవసాయ పనిముట్లు, చివరికి ఎడ్లబండ్లను కూడా అధికారులు గుంజుకెళ్లిన ఉదంతాలు ఉన్నాయి.
పన్ను కట్టలేక రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి.. ‘దేవుడిచ్చిన భూమికి శిస్తు ఏల?’ అంటూ తాను అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే భూమి శిస్తును నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు రద్దు చేశారు. ఫ్యూడల్ విధానానికి ప్రతీకగా ఉన్న ఆనాటి గ్రామాధికార వ్యవస్థలో ఉన్న పటేల్, పట్వారీల వ్యవస్థను ఒక్క కలం పోటుతో 1984 జనవరి 6న రద్దు చేసిన సంగతి విదితమే. రైతులకు గుదిబండగా మారి, అధికారుల వేధింపులకు పరాకాష్ఠగా మారిన తీరును చూసి చలించిన ఎన్టీఆర్ తెలుగు రైతుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. నాడు ఎన్టీఆర్ రద్దు చేసిన భూమి శిస్తు(రకం)ను కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ తెరపైకి తెస్తున్నది.
రైతుల నుంచి శిస్తు వసూలు చేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తున్నట్టు స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇటీవలి ఖమ్మం పర్యటనలో బయటపెట్టడం రైతుల గుండెల్లో గుబులు రేపుతున్నది. అప్పట్లో రైతులు సాగు చేసుకుంటున్న భూములను తరి, కుష్కి భూములుగా విభజించి ఒక్కో భూమికి ఒక్కో రకంగా రకం వసూలు చేసేవారు. ఈ విధానంపై అప్పట్లో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. కమ్యూనిస్టు పార్టీలు సహా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ గ్రామస్థాయిలో పట్వారీల అరాచకాలపై నిరసన గళాలు వినిపించాయి. నాలుగు దశాబ్దాల తర్వాత రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ రకం వసూలు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల రైతుల నుంచి రకం వసూలు చేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు వెల్లడించడంతో మళ్లీ పాతరోజులు రానున్నాయా? అనే భయం రైతుల్లో వ్యక్తమవుతున్నది.
ఆరుగాలం శ్రమించినా అప్పట్లో పండిన పంటకు సరైన దిగుబడి రాక, దిగుబడి వచ్చిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు నరకయాతన అనుభవించిన సందర్భంలోనూ ప్రభుత్వానికి క్రమం తప్పకుండా భూమి శిస్తు చెల్లించాల్సిన పరిస్థితి ఉండేది. రెండు సంవత్సరాలు.. అంతకుమించి భూమి శిస్తు చెల్లించని రైతులపై ఆనాటి ప్రభుత్వంలోని రెవెన్యూ అధికారులు సిబ్బంది దౌర్జన్యం చేసేవారు. గ్రామాల్లో పేద, మధ్యతరగతి, పెద్ద రైతులతో సహా వారి పరువు తీయడమే లక్ష్యంగా గ్రామాల్లోకి వచ్చి జప్తులు చేసే పరిస్థితి ఇప్పటికీ నాటి రైతుల కండ్లల్లో కదలాడుతున్నది. ఈ సందర్భంలో మళ్లీ రకం తమ మెడకు చుట్టుకునే అవకాశం ఉండటంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. జప్తుల పేరిట రకం కట్టని రైతుల ఇండ్ల ముందుకు రెవెన్యూ అధికారులు వెళ్లి ఇంటిలో ఉన్న వంట పాత్రలు, గుమ్మం తలుపులను పీకేసి అగచాట్లకు గురిచేసిన తీరు నాటి ఫ్యూడల్ వ్యవస్థకు ప్రతిబింబంగా ఉండేదని అప్పటి రైతులు గతాన్ని తలుచుకొని ఆందోళన చెందుతున్నారు.
ఇటీవల ఖమ్మం జిల్లాలో జరిగిన పలు సభల్లో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రైతుల నుంచి నామమాత్రపు రకం వసూలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు వెల్లడించారు. రైతులకు సాగు చేసుకుంటున్న భూములపై చట్టపరమైన హక్కులు కల్పించేందుకు రకం ద్వారా లభించే రశీదు ఒక ఆధారంగా పరిగణించే అవకాశం ఉన్నందున రైతుల భూములకు చట్టపరమైన రక్షణ కోసం ఈ విధానాన్ని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టు వెల్లడించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు, రైతు సంఘాల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. రైతులకు భూపరంగా చట్టబద్ధమైన హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నంలో అనేక ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉన్నదని వారిలో ఆందోళన వ్యక్తమవుతున్నది. పట్టాదారు పాసుపుస్తకాల్లో భూ విస్తీర్ణం కలిగి ఉండి భూమి తమ ఆధీనంలో లేని రైతులకు రకం ఏవిధంగా వర్తింపజేస్తారనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.
1984కు ముందు అప్పటి ప్రభుత్వాలు చెరువులు, కుంటలు ప్రాజెక్టుల కింద సాగుచేసే వరి వంటి పంటలకు ఎకరానికి రూ.50 నుంచి రూ.100 వరకు వసూలు చేసేవారు. అలాగే వర్షాధారంతో మెట్ట భూముల్లో పండే పంటలకు స్వల్ప మొత్తంలో రకం వసూలు చేసే పరిస్థితి ఉండేది. చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల కింద సాగుచేసే రైతులకు నీటి తీరువా(రకం) విధించేవారు. మొట్ట భూములకు స్వల్ప మొత్తంలో రకం వసూలు చేసేవారు. ఈ విధానం భూముల రక్షణకు కవచంగా ఉంటుందని మంత్రి చెప్పడంపై రైతుల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రైతుల నుంచి ఏదో ఒక రూపంలో పన్ను వసూలు చేసి ఖజానా నింపుకోవాలన్న యోచన తప్ప రైతులకు దీనిద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతర రైతుల భూ హక్కులను కాపాడటానికి త్వరలో ఒక కమిటీ వేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు వెల్లడించిన మంత్రి పొంగులేటి, దీంతోపాటు రకం వసూలును సైతం ప్రవేశపెట్టే యోచనలో ఉన్నామని చెప్పి బాంబు పేల్చడం వ్యవసాయదారులను అలజడికి గురిచేస్తున్నది.
ఎన్నో ఏండ్లుగా వ్యవసాయమే జీవనాధారంగా రైతులు బతుకుతున్నరు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు తమ భూములకు రికార్డులు లేకుండా ఉన్నరు. వీరికి రికార్డులు, పట్టాదారు పాసుబుక్కులు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. భూముల రికార్డులను సరి చేయకుండా రైతుల నుంచి శిస్తు వసూలు చేయాలనే ఆలోచన సరికాదు. సమగ్ర భూ సర్వే, ఎంజాయ్మెంట్ సర్వే చేసి సాగు చేసుకుంటున్న రైతుల భూములకు పట్టాలివ్వాలి. అసలు రికార్డులు లేని రైతుల నుంచి శిస్తు ఎలా వసూలు చేస్తరు? రికార్డుల సమస్య పరిష్కారం చేయకుండా శిస్తు వసూలు చేయాలనే ఆలోచన చేయడం రైతులకు అన్యాయం చేయడమే అవుతది. రాష్ట్రంలో తహసీల్దార్ కార్యాలయాలు అవినీతి అడ్డాలుగా మారినయ్. రైతులు రికార్డులు సరి చేయాలని కార్యాలయాలకు వెళ్తే లక్షల్లో వసూలు చేస్తున్నారు.
-బొంతు రాంబాబు, ఖమ్మం జిల్లా రైతు సంఘం నాయకుడు
కాంగ్రెస్ ప్రభుత్వం తన ఖజానా నింపుకొనేందుకు రైతులపై భారం మోపాలనే ఆలోచన చేయడం సరికాదు. ఇలాంటి నిర్ణయాలపై ప్రభుత్వం రైతులు, రైతు సంఘాల అభిప్రాయాలు తీసుకోవాలి. ఇప్పటికే కాంగ్రెస్ పాలనలో పంటలు పండించడం నుంచి వాటిని అమ్ముకొనేదాకా రైతులు అరిగోస పడుతున్నరు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఇప్పుడు రైతుల నుంచి భూమి శిస్తు వసూలు చేయాలని చూడటం దుర్మార్గం.
-గుత్తా రవి, రైతు, రఘునాథపాలెం మండలం, ఖమ్మం జిల్లా