ముదిగంపల్లి లక్ష్మీరాజం.. ఈయనది జగిత్యాల జిల్లాలో ఓ నిరుపేద దళిత కుటుంబం. ఎన్నో కష్టాలు పడి ఉన్నత చదువులు చదివాడు. అందుకు తగ్గట్టే 14 ఏండ్ల పాటు వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో కొనసాగాడు. 2024లో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందుకొని స్కూల్ అసిస్టెంట్‌గా చేరాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. తొమ్మిది నెలల తర్వాత ‘మీరు సరైన సమయంలో సర్టిఫికెట్లు సమర్పించలేదు, అందుకే ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాం’ అని అధికారులు బాంబు పేల్చారు. ఈ ఉత్వర్వు కాపీ చూసి లక్ష్మీరాజం కంగుతిన్నాడు.
న్యాయం కోసం ఏడాది నుంచి జగిత్యాల, హైదరాబాద్‌లోని అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. వాళ్లెవరూ పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేలు, మంత్రితో పాటు ఆఖరుకు సీఎం పేషీకి వెళ్లి న్యాయం దక్కలేదు. సోమవారం జగిత్యాలలో ప్రజావాణిలో మరోసారి తన గోడు వెళ్లబోసుకున్నాడు. ‘సార్.. సీఎం ఇచ్చిన నియామక ఉత్తర్వులు నమ్మి ఉద్యోగంలో చేరాను. ఇప్పుడు ఆ కొలువు లేదు, పాత ఉద్యోగం ఇయ్యమంటున్నరు. రెండు సర్కార్ నౌకర్లు పోయి బతుకుదెరువు కోసం సెంట్రింగ్ పనికి పోవాల్సి దుస్థితి వచ్చింది. ఆ ఉద్యోగం కాకపోయినా ఇదివరకు చేసిన మున్సిపల్ ఉద్యోగమైనా ఇప్పించండి’ అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.
జగిత్యాల, ఏప్రిల్ 13(నమస్తే తెలంగాణ) : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చెప్యాల గ్రామానికి చెందిన ముదిగంపల్లి లక్ష్మీరాజం ఉస్మానియాలో ఎంఏ చదివాడు. ఆ తర్వాత తిరుపతి పద్మావతి వర్సి టీలో స్పెషల్ బీఎడ్(మానసిక విద్యార్థులకు బోధన శిక్షణ) చేశాడు. 2008లో సర్వశిక్షా అభియాన్‌లో మానసిక దివ్యాంగులకు బోధన చేసేందుకు ఎంపికయ్యాడు. వేములవాడలో, ఆ తర్వాత కాగజ్‌నగర్‌లోని భవిత కేంద్రాల్లో ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ టీచర్‌గా(అవుట్ సోర్సింగ్) పనిచేశాడు. 2012లో వీఆర్ఏ పోస్టుకు ఎంపికయ్యాడు. లక్ష్మీరాజానికి ఆయన స్వ గ్రామం చెప్యాలలోనే ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. 11ఏండ్ల పాటు అదే పోస్టులో కొనసాగారు. ఆ తర్వాత రెవెన్యూ సంస్కరణల్లో వీఆర్ఏ పోస్టులు రద్దు కావడం తో సర్దుబాటులో భాగంగా లక్ష్మీరాజం మున్సిపల్ శాఖలో వార్డు అధికారి పోస్టును ఎంపిక చేసుకోవడంతో ఆయన్ను 2023లో వేములవాడ మున్సిపాలిటీలో వార్డు అధికారిగా పంపారు.
అక్కడ పనిచేస్తుండగానే రేవంత్ ప్రభుత్వం 2024లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వేసింది. జగిత్యాల జిల్లా పరిధి లో స్పెషల్ బీఎడ్ చదివిన వారికి ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నట్టు, ఒకటి ఎస్సీకి రిజర్వ్ చేసినట్టు నోటిఫై చేశారు. లక్ష్మీరాజం దరఖాస్తు చేసుకొని పరీక్ష రాశా డు. 2024 అక్టోబర్ 5 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసుకోవాలని అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. స్పెషల్ బీఎడ్‌కు ప్రతి ఏడేండ్ల ఒకసారి రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఢిల్లీ కేంద్రంగా) నుంచి కోర్సు సర్టిఫికెట్ రెన్యువల్ చే యించుకోవాల్సి ఉంటుంది. లక్ష్మీరాజం డీఎస్సీ రాసేకంటే 12 ఏండ్ల ముందునుంచి మరో ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నందున రెన్యువల్ చేసుకోలేదు. వెరిఫికేషన్ కోసం ఆదేశాలు రావడంతో లక్ష్మీరాజం 2024 సెప్టెంబర్ 30న ఆన్లైన్లో స్పెషల్ బీఎడ్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేశాడు. నిబంధనల ప్రకారం సంబంధిత సర్టిఫికెట్ పొందేందుకు 90రోజుల గడువు ఉండటం, లక్ష్మీరాజం 2007లోనే బీఎడ్ పూర్తిచేసిన సర్టిఫికెట్లు, అంతకుముందు రిహాబిలిటేషన్ సర్టిఫికెట్లు ఉండటంతో అధికారులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేశారు.
అక్టోబర్ 7న సర్టిఫికెట్ జారీ అయ్యింది. అక్టోబర్ 9న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో లక్ష్మీరాజం సీఎం రేవంత్ చేతుల మీదుగా స్కూల్ అసిస్టెంట్ పోస్టు నియామక ఉత్తర్వులు అందుకున్నా డు. అక్టోబర్ 10న విద్యాశాఖ కార్యాలయంలో రిపోర్ట్ చేసిన లక్ష్మీరాజం.. అదే నెల 15 నుంచి కొడిమ్యాల జడ్పీ హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్‌గా విధు లు నిర్వర్తిస్తూ వచ్చాడు. 2025 మార్చిలో డీఈవో.. లక్ష్మీరాజానికి షోకాజ్ నోటీస్ జారీ చేశాడు. అక్టోబర్ 5లోగా సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకాలేదని, 7న సర్టిఫికెట్ సబ్మిషన్ జరిగిందని, ఎందుకు విధుల్లో నుంచి తొలగించరాదో తెలుపాలని షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. దీనికి లక్ష్మీరాజం సైతం అక్టోబర్ 7న తుది ఫలితాల ప్రకటన కంటే ముందే రెన్యువల్ సర్టిఫికెట్ అందజేశానని వివరణ ఇచ్చారు. సంతృప్తి చెందని అధికారులు 2025 మే 8న లక్ష్మీరాజాన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. డీఈవోను వివరణ కోరగా, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉత్తర్వుల మేరకు లక్ష్మీరాజంను విధుల నుంచి తొలగించామని చెప్పారు. డీఎస్సీలో లక్ష్మీరాజం తర్వాత మార్కులు పొందిన వ్యక్తి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ చివరి తేదీ నాటికి లక్ష్మీరాజం సర్టిఫికెట్ కలిగి లేడని, 7న సర్టిఫికెట్‌ను సబ్మిట్ చేశాడని న్యాయస్థానాన్ని ఆశ్రయించాడని తెలిపారు.
లక్ష్మీరాజం వ్యవహారంలో సర్కార్ నిర్లక్ష్యమే కారణమని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నా యి. 2024లో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ గైడ్‌లై న్స్, అర్హతల ప్రకటన, సర్టిఫికెట్ల పరిశీలన సరిగా లేకపోవడం వల్లే లక్ష్మీరాజం వంటి వ్యక్తులు నష్టపోతున్నారంటున్నారు. స్పెషల్ బీఎడ్ కోర్సులో, బీఎడ్ సర్టిఫికెట్ కంటే రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండి యా రెన్యువల్ సర్టిఫికెట్ ముఖ్యమని అధికారులు పేర్కొంటున్నారు. అంటే స్పెషల్ బీఎడ్‌లో దరఖా స్తు చేసుకునేందుకు ఈ సర్టిఫికెట్‌నే ప్రామాణికంగా తీసుకుంటే, డీఎస్సీ దరఖాస్తు నాటికి సర్టిఫికెట్ రె న్యువల్ లేని లక్ష్మీరాజం డీఎస్సీ రాసేందుకు అర్హత లభించేది కాదని చెబుతున్నారు. డీఎస్సీ రాసేందుకు అర్హత లభించకపోతే మున్సిపల్‌లోనే కొనసాగేవాడని, అతడి ఉద్యోగం అతడికి ఉండేదంటున్నారు.