హైదరాబాద్, ఆగస్టు16(నమస్తే తెలంగాణ): దేశంలో ఎక్కడా యూరియా కొరత లేదని బీజేపీ, రాష్ట్రంలో ఫుల్ స్టాక్ ఉన్నదని కాంగ్రెస్ సర్కారు బొంకుతున్నాయి. మరి ఏ ఎరువుల కేంద్రం వద్ద చూసినా రైతుల బారులు ఎందుకు కనిపిస్తున్నయ్? తిండి తిప్పలు మాని తెల్లవారుజాము నుంచే అన్నదాతలు కిలోమీటర్ల కొద్దీ ఎందుకు లైను కట్టాల్సి వస్తున్నది? శనివారం జోరు వానలోనూ యారియా కోసం రైతులు యాతన పడ్డారు. కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ రాజీవ్ రాహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్నదాతలు ధర్నా చేశారు.
చెప్పులు పెట్టే.. లైన్ కట్టే
ఎక్కడ: మహబూబాబాద్ జిల్లా బయ్యారం
ఏం జరిగింది: మహబూబాబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని గ్రోమోర్ సెంటర్ వద్ద యూరియా కోసం రైతులు చెప్పులతో క్యూ కట్టారు. శనివారం ఉదయం వందలాది మంది రైతులు తరలివచ్చారు. కేవలం 10 మెట్రిక్ టన్నుల(220 బస్తాలు) యూరియా వచ్చింది. వర్షం వస్తున్నా గంటల తరబడి క్యూలో ఉండి, ఒకటి, రెండు బస్తాలు పట్టుకొని వెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తమ పరిస్థితి దయనీయంగా తయారైందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అయితే పంటలెలా పండించుకోవాలని, తమ కుటుం బాలు ఎలా బతకాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పరిస్థితి ఇంత దారుణంగా ఉ న్నా సీఎం, మం త్రులు స్పందించకపోవడమేంటని మండిపడ్డారు. గత పదేండ్లలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని, ఇప్పుడు మాత్రం క్యూలైన్లలోనే రోజంతా ఉండాల్సి వస్తున్నదని వాపోయారు.
సొసైటీకి లాక్.. పంపిణీకి బ్రేక్
ఎక్కడ: మహబూబ్‌బాద్ జిల్లా కేంద్రంలోని సొసైటీ కార్యాలయం
ఏం జరిగింది: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సొసైటీ కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు శనివారం తెల్లవారుజాము నుంచి పడిగాపులు కాశారు. లారీ లోడ్ వచ్చి సొసైటీలో దించుతున్నారని సమాచారం తెలుసుకున్న రైతులు భారీగా తరలివచ్చారు. యూరియా ఇవ్వాలని సొసైటీ అధికారులను రైతులు నిలదీశారు. టోకెన్ వారీగా గాకుండా ఇష్టానుసారంగా యూరియా బస్తాలను ఇస్తున్నారని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో యూరియా గోదామును మూసివేశారు. దీంతో సొసైటీ సీఈవో ప్రమోద్‌తో రైతులు వాగ్వాదానికి దిగారు. మళ్లీ లోడ్ వచ్చాకే యూరియా ఇస్తామని అధికారులు సిబ్బందితో గేటుకు తాళం వేయించి రైతులను పోలీసులతో వెళ్లగొట్టారు.
యూరియా కోసం అరిగోస పడుతున్నం
వారం రోజులుగా యూరియా కోసం సొసైటీకి వస్తూ అరిగోస పడుతున్నం. పొద్దుగాలే ఐదు గంటలకు వచ్చా. అప్పటి నుంచి లైన్లోనే నిలబడి ఉన్న. గతంలో యూరియాకు ఇంత ఇబ్బంది పడలే. ఈ ఏడాది రైతులమంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నం. ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బంది పెడుతున్నది. కొంత మందికి మాత్రమే యూరియాను అందించి బ్లాక్ చేస్తున్నది. ఇప్పటికైనా రైతులందరికీ సరిపడా యూరియా ఇవ్వాలి..
– రాయపాటి లక్ష్మి, నడివాడ
రైతులు వచ్చినా.. బస్తాలు వచ్చేనా?
ఏం జరిగింది: మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలోనూ రైతులు యూరియా కోసం నానా పాట్లుపడ్డారు. ధన్నసరి, కేసముద్రం సహకార సంఘాలకు యూరియా వస్తుందని తెలుసుకున్న రైతులు ఉదయాన్నే బారులు తీరారు. ఒకొక్కక్కరికి ఒకటి లేదా రెండు యూరియా బస్తాలు మాత్రమే ఇస్తారని తెలియడంతో కుటుంబ సమేతంగా వచ్చి క్యూలైన్లో నిలబడ్డారు. ధన్నసరి సహకార సంఘం వద్ద గంటల తరబడి క్యూలో నిలబడ లేక రైతులు చెప్పులను క్యూలైన్లో పెట్టారు. మధ్యాహ్నం వరకూ యూరియా రాలేదు. ఏవో వెంకన్న ధన్నసరి, కేసముద్రం సహకార సంఘాలకు చేరుకొని రైతులతో మాట్లాడారు. వర్షం కారణంగా యూరియా రాదని తెలుపడంతో నిరాశతో రైతులు వెళ్లిపోయారు.
గొడుగు పట్టినా గోస తప్పలే..
ఎక్కడ: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి
ఏం జరిగింది: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి పీఏసీఎస్‌కు 225 బ్యాగులు, ఐకేపీ సెంటర్‌కు 225 బ్యాగులు రాగా, వందల సంఖ్యలో రైతులు వచ్చారు. వర్షంలోనూ గొడుగులు పట్టుకొని బారులు తీరారు. అయితే అందరికీ అందకపోవడంతో కొందరు నిరాశతో వెనుదిరిగారు.
రైతు వేదిక.. లైన్ తప్పదిక
ఎక్కడ: వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట
ఏం జరిగింది: వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేటలోని సొసైటీ కార్యాలయం వద్ద శనివారం రైతులు యూరియా కోసం బారులు తీరారు. సొసైటీ ఎరువుల గోదాముకు 888 బస్తాల యూరియా రావడంతో అధికారులు రైతువేదిక వద్ద రైతులకు టోకెన్లు ఇచ్చారు. వర్షం కురుస్తున్నా యూరియా కోసం గోదాం వద్ద నిలబెట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నడూ క్యూలైన్లలో నిలబడి యూరియా కొనుగోలు చేసింది లేదని, ప్రస్తుతం కాంగ్రె స్ ప్రభుత్వంలో నానా ఇబ్బందులు పడుతున్నామని రైతులు తెలిపారు.
నిరీక్షించి.. నీరసించి
ఎక్కడ: కరీంనగర్ జిల్లా సైదాపూర్
ఏం జరిగింది: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలోని వెన్కేపల్లి-సైదాపూర్ సహకార సంఘానికి శనివారం 450 బ్యాగుల యూరియా రాగా, రైతులు వర్షంలోనూ తరలివచ్చారు. సహకారసిబ్బంది టోకెన్లు అందించగా, ఉదయం నుంచి నిరీక్షించారు. ఎన్ని ఎకరాలున్నా రైతుకు 2 బ్యాగులే ఇచ్చారు. సుమారు 300 మందిలో 225 మందికే ఇవ్వగా, మిగతా రైతులు ఉత్తచేతులతోనే వెనుదిరిగారు. సర్కారు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులెక్కువ.. బస్తాలు తక్కువ
ఎక్కడ: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కాచాపూర్‌లో
ఏం జరిగింది: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాక పీఏసీఎస్ పరిధిలోని కాచాపూ ర్లో ఉన్న గోదాం వద్దకు రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే క్యూలైన్లో ఉన్నారు. బ్యాగులు తక్కువగా ఉండటం, రైతులు వందల సంఖ్యలో రావడంతో అందరికీ రావని పంపిణీ నిలిపివేశారు. ఆదివారం మరో లోడ్ వస్తుందని సిబ్బంది నచ్చజె ప్పారు. దీంతో రైతులు చేసేదేమీలేక వెనుదిరిగారు.
గ్రోమోర్.. యూరియా ‘నో మోర్’
ఎక్కడ: మెదక్ జిల్లా చేగుంట
ఏం జరిగింది: మెదక్ జిల్లా చేగుంటలోని ఎరువుల దుకాణం వద్ద శనివారం ఉదయం నుంచే రైతులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా యూరియా కోసం క్యూలో బారులు తీరారు. శనివారం రెండు వందల బస్తాల యూరియా రాగా, సుమారు 500 మంది రైతులు ఉదయమే షాప్ వద్దకు చేరుకున్నారు. సగం మంది రైతులకూ యూరియా లభించకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. సుమారు 300 మందికి బస్తాలు అందకపోవడంతో సర్కారు తీరుపై సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే తమను ఇలా ఇబ్బందులు పెడుతున్నదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి మళ్లీ వస్తుందని తాము ఎన్నడూ ఊహించలేదని వాపోయారు.
ఇది ఓట్లేసే క్యూ కాదు.. నాట్లకు యూరియా కోసం..
ఇక్కడ కనిపిస్తున్నది ఎన్నికల్లో ఓట్లేసేందుకు కట్టిన క్యూ కాదు.. శ్రావణ శనివారం సందర్భంగా దైవదర్శనం కోసం కట్టిన లైన్ అసలే కాదు.. ఒక్క బస్తా యూరియా కోసం తిండితిప్పలు మాని, వానకు తడుస్తూ రోడ్డుపొడవునా రైతుల నిరీక్షణ!భారీ వర్షం పడుతున్నా మహబూబాబాద్ జిల్లా గూడూరులో ఎరువుల కోసం సొసైటీ కార్యాలయం ముందు శనివారం తెల్లవారుజామున 3 గంటల నుంచే అన్నదాతలు ఇలా బారులు తీరారు. – కమటం సంతోష్ , గూడూరు