Runa Mafi | హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): అరకొర రుణమాఫీ చేసిన ప్రభుత్వంపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. దీని నుంచి తప్పించుకునేందుకు, కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం తెలివిగా డైవర్షన్ పాలి‘ట్రిక్స్’ను ప్రయోగిస్తున్నది. ఇందులో భాగంగానే నిన్న మొన్నటి వరకు అక్రమ నిర్మాణాల కూల్చివేత అంటూ ‘హైడ్రా’ పేరుతో పెద్ద డ్రామానే రక్తికట్టించింది. ఈ నాటకాన్ని ప్రజలు నమ్మలేదు. దీంతో మరో కొత్త నాటకానికి ప్రభుత్వం తెరలేపింది. రుణమాఫీ కాని రైతులకు కుటుంబ నిర్ధారణ కోసం ప్రత్యేక సర్వే పేరుతో మరో డ్రామాను మొదలుపెట్టింది. ప్రత్యేక యాప్‌తో మంగళవారం నుంచి సర్వే చేస్తున్నది. ఈ నేపథ్యంలో సర్వేపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా రైతులను మళ్లీ మభ్యపెట్టేందుకు ప్రభుత్వ ఎత్తుగడ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రుణమాఫీని సాగదీయడానికో, తప్పించుకునేందుకో చేస్తున్న ప్రయత్నమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మొత్తం 42 లక్షల మంది రైతులకు గానూ 22 లక్షల మంది రైతులకు ప్రభుత్వం రుణమాఫీ చేసింది. ఇందులో పలు కారణాలతో 5.49 లక్షల మంది రైతులకు మాఫీ కాలేదని స్వయంగా మంత్రి తుమ్మల వెల్లడించారు. ఎంత మందికి రుణమాఫీ కాలేదో, వారికి ఎందుకు కాలేదో ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది. అలాంటప్పుడు ఆ సమాచారం ప్రకారం బ్యాంకుల నుంచి మళ్లీ వివరాలు తెప్పించుకొని, తప్పులను సరిచేసి గంటల వ్యవధిలో రుణమాఫీ కానటువంటి రైతులకు మాఫీ చేయొచ్చు. రుణమాఫీ కాని వారి నుంచి ఇప్పటికే ప్రభుత్వం ఫిర్యాదులను స్వీకరించింది. వీటి ఆధారంగా కూడా మాఫీ చేయ్చొ. కానీ ప్రభుత్వం ఈ రెండు పనులు చేయకుండా మళ్లీ కొత్తగా సర్వే చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే రైతుభరోసా పేరుతో ప్రత్యేక యాప్‌ను రూపొందించి ఆ యాప్‌తో రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి వివరాలు సేకరిస్తారట.
రుణమాఫీలో భాగంగా బ్యాంకుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా 22 లక్షల మందికి ప్రభుత్వం రుణమాఫీ చేసింది. మాఫీ అయినవారి నుంచి ఇంతకుముందు ఎలాంటి దరఖాస్తు తీసుకోనప్పుడు, కాని వారి కోసం ఇప్పుడు సర్వే ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వారికి చేసినట్టే తమకూ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సర్వేల పేరుతో రుణమాఫీలో కోత పెడితే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు.
రుణమాఫీలో భాగంగా రూ. 2 లక్షలకు పైనున్న రుణాలపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. రూ. 2 లక్షలకు పైనున్న రుణాన్ని రైతులు చెల్లిస్తే మిగతా సొమ్మును తాము చెల్లిస్తామని పేర్కొన్నది. ఈ షరతుపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. చెప్పినట్టుగా ప్రభుత్వం రూ. 2 లక్షలు మాఫీ చేస్తే పైనున్న రుణాన్ని రైతులే తమ వద్ద డబ్బులున్నప్పుడు కట్టుకుంటారని చెప్తున్నారు. రైతుల నుంచి రుణం వసూలు చేసుకునే బాధ్యత రైతులదేనని అంటున్నారు. అలాంటప్పుడు ఈ కండిషన్ ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెడపై కత్తిపెట్టి పైనున్న రుణం చెల్లించాలనడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రుణమాఫీ కాని రైతుల నుంచి జిల్లాల్లో ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం ఫిర్యాదులు స్వీకరించింది. లక్షకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు తెలిసింది. కొందరు రైతులు ఏఈవోల వద్ద కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా బ్యాంకుల నుంచి రైతుల వివరాలు తీసుకొని వాళ్లకు రుణమాఫీ చేయొచ్చు. కానీ ప్రభుత్వం ఈ సులువైన మార్గాలను పక్కనపెట్టి సర్వేకే మొగ్గు చూపుతున్నది. ఈ నేపథ్యంలో లక్షల్లో స్వీకరించిన దరఖాస్తులన్నీ బుట్టదాఖలైనట్లేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 9న ప్రతి రైతుకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక మాట తప్పారు. బీఆర్ఎస్ పోరాటం, హరీశ్‌రావు సవాల్‌తో దిగొచ్చిన ప్రభుత్వం ఆగస్టు 15 నాటికి ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఎదురుపడ్డ దేవుళ్లపై ఒట్టుపెట్టారు. కానీ ఆ మాటను కూడా నిలబెట్టుకోలేకపోయారు. ఆగస్టు 15 నాటికి రుణమాఫీ పూర్తి కాలేదని స్వయంగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అంగీకరించారు. రేవంత్‌రెడ్డి కూడా రుణమాఫీ కాలేదని ఒప్పుకొన్నారు. దీంతో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఈ నేపథ్యంలో రైతులను మభ్య పెట్టేందుకు ప్రభుత్వం మళ్లీ కొత్త కథను తెరపైకి తీసుకొచ్చింది. సర్వే పేరుతో సాగదీతకు మరో ప్రణాళిక రూపొందించింది.
రూ. 2 లక్షలుకు పైనున్న రుణాన్ని రైతులు చెల్లిస్తే రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్తున్నది. అయితే, ప్రభుత్వం చెప్పినట్టుగా అప్పోసప్పో చేసి చెల్లించాక ప్రభుత్వం రుణమాఫీ కాకపోతే పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు రైతుల నుంచి వస్తున్నాయి. మాఫీ అవుతుందన్న గ్యారెంటీ ఏంటని నిలదీస్తున్నారు.
1. రుణమాఫీకి అసలు సర్వే చేయాల్సిన అవసరం ఏమిటి? రైతులు స్వీయ ధ్రువీకరణ ఎందుకు ఇవ్వాలి? దరఖాస్తు ఎందుకు చేయాలి? ఇప్పటికే ప్రభుత్వం కొందరికి రుణమాఫీ చేసింది. వారు ఏ దరఖాస్తు చేశారని మాఫీ చేసింది? ఎలాంటి సర్వే లేకుండానే వాళ్లకు రుణమాఫీ చేసినప్పుడు ఇప్పుడు ఈ రైతులకు దరఖాస్తు తీసుకోవాల్సిన అవసరం ఏమిటి? సర్వే చేయాల్సిన అవసరం ఏమిటి? ఇప్పటికే రుణమాఫీ అయిన రైతుల మాదిరిగానే వీళ్లకు కూడా రుణమాఫీ చేయొచ్చు కదా?
2. ఓ రైతుకు బ్యాంకు రుణం ఇచ్చిందంటే అతడికి సంబంధించిన పూర్తి వివరాలు బ్యాంకు వద్ద ఉంటాయి. ఈ డాటా ఆధారంగానే ప్రభుత్వం రుణమాఫీ చేసిం ది. అలాంటప్పుడు ఇప్పుడు రుణమాఫీ కాని రైతుల నుంచి వివరాల సేకరించాల్సిన అవసరం ఏమిగొ? అంటే వీరి వివరాలు బ్యాంకుల వద్ద లేవా? వివరాలు లేకుండానే బ్యాంకులు రైతుకు రుణాలిచ్చాయా? లేదంటే ప్రభుత్వం రుణమాఫీని సాగదీసేందుకు, ఇవ్వకుండా తప్పించుకునేందుకు ఈ డ్రామాను తెరపైకి తీసుకొచ్చిందా?
3. ఇక రూ. 2 లక్షల రుణమాఫీ కావాలంటే ఆపై రుణం చెల్లించాలని ప్రభుత్వం చెబుతున్నది. అసలు రుణమాఫీకి ఈ కండిషన్ ఎందుకు? ప్రభుత్వం చేస్తానన్న రుణమాఫీ చేయాలి. అంతేకానీ రైతులను రుణం చెల్లించాలని చెప్పే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిది? ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తే పైన ఉన్న రుణం రైతుకు ఇష్టమున్నప్పుడు చెల్లించుకుంటాడు. ఒక విధంగా చెప్పాలంటే రుణం వసూలు చేసుకునే బాధ్యత బ్యాంకులది. దీనితో ప్రభుత్వానికేం సంబంధం. ఈ కండిషన్ రుణమాఫీ ఎగ్గేట్టొందుకేనా?
4. రుణమాఫీ కానటువంటి రైతుల నుంచి ఇప్పటికే ప్రభుత్వం ఫిర్యాదులు స్వీకరించింది. వీటి ఆధారంగా రైతుల వివరాలను బ్యాంకుల నుంచి తెప్పించుకొని మాఫీ చేయొచ్చు. ప్రభుత్వం ఆ పని చేయకుండా మళ్లీ కొత్తగా సర్వే చేసేందుకు నిర్ణయించింది. అంటే మొన్నటి వరకు రైతుల నుంచి తీసుకున్న ఫిర్యాదులు ఉత్తుత్తివేనా. లక్షల ఫిర్యాదులను చెత్త బుట్టలో వేసినట్లేనా?
హనుమకొండ సబర్బన్, ఆగస్టు 26: ఆసియా ఖండంలోనే అతిపెద్దదిగా ప్రసిద్దికెక్కిన సహకార సంఘమిది.జిల్లాలోనే ఎక్కువగా సభ్యులు కలిగిన ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి సంఘంలోని రైతులకు రుణమాఫీలో అన్యాయం జరిగింది. సొసైటీ పరిధిలో 14 పాత గ్రామపంచాయతీలు, పది కొత్త గ్రామపంచాయతీలతో కలిపి మొత్తం 24 గ్రామాల పరిధిలో 7641మంది రైతు సభ్యులున్నారు. ఇందులో ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు 6662మంది రుణమాఫీకోసం అర్హులుగా గుర్తించిన సొసైటీ ప్రభుత్వానికి జాబితాను పంపించింది. ఇదీగాకుండా మండలంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఎస్బీఐ శాఖలు కూడా కొనసాగుతున్నాయి. అయితే మండలంలో మెజార్టీ రైతులు ముల్కనూరు సొసైటీ నుంచే రుణాలు తీసుకున్నారు. ఇందులో లక్షలోపు రుణం అర్హులు 3526 మంది ఉండగా 3022మందికి మాఫీ లభించింది. రెండవ విడుతలో లక్షయాభైవేయిలు లోపు వారిలో 1533మంది రైతులు ఉండగా 1142మందికి మాఫీ వచ్చింది. ఇక రెండు లక్షల లోపు రుణమాఫీ అయిన మూడవ విడుతలో 985మంది అర్హులుగా ఉండగా కేవలం 577మందికే రుణమాఫీ అయినట్లుగా అధికారులు చెబుతున్నారు. సొసైటీ పంపించిన ప్రతిపాదనల ప్రకారం రూ.70.23కోట్లు రైతులకు రుణమాఫీ రావాల్సి ఉండగా కేవలం రూ.42.40 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇంకా రూ. 27.65 కోట్లు రైతులకు రావాల్సి ఉన్నది.
ఆర్మూర్‌టౌన్, ఆగస్టు 26: కాలయాపన కోసమే ప్రభుత్వం రైతుభరోసా యాప్ తీసుకొచ్చిందని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ రైతు ఐక్యకార్యాచరణ కమిటీ సభ్యుడు ఇట్టడి లింగారెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన ఆర్మూర్‌లో మీడియాతో మాట్లాడారు. యాప్‌లో రైతులు స్వీయ ధ్రువీకరణ ఇవ్వాలనడం దారుణమని అన్నారు. సిద్దులగుట్ట సాక్షిగా 2 లక్షలలోపు రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి న సీఎం రేవంత్‌రెడ్డి ఆ తరువాత రైతులను దారుణంగా మోసం చేశారని ధ్వజమెత్తారు. అర్హులందరి రుణాల ను మాఫీ చేయాలని కోరారు. సెప్టెంబర్ 15లోగా రుణ సంకెళ్లు తెంచకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జేఏసీ సభ్యులు ప్రభాకర్, యాదగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.