Telangana | హైదరాబాద్, నవంబర్ 9(నమస్తే తెలంగాణ): ‘ఊళ్లలో బెల్టు దుకాణలు పెంచండి. అప్పుడే జనం బాగా తాగుతారు. లేకుంటే టార్గెట్ రీచ్ కాలేం. మద్యం సేల్స్ పెంచని అధికారులను గుర్తించి మెమోలు ఇస్తాం. రెండోసారి మెమో వచ్చిందంటే వారిని నిర్దాక్షిణ్యంగా బదిలీ చేస్తాం. ఏడాది వరకు మళ్లీ పోస్టింగ్ ఉండదు. బెల్టు దుకాణల కోసం ఎమ్మెల్యేల సిఫారసు లేఖను, ఫోన్‌కాల్ అభ్యర్ధనలను గౌరవించండి’.. ఇవీ ఎక్సైజ్‌శాఖ కేంద్ర కార్యాలయం నుంచి దిగువ శ్రేణి అధికారులకు అందిన మౌఖిక ఆదేశాలు. ఏం చేసైనా సరే అమ్మకాలు పెంచాలనే ఆదేశాలతో ఉన్నతాధికారులు తమ కింది అధికారులను వేధిస్తున్నారు. గతంలో ఎక్కడైనా బెల్టుషాపు కనిపిస్తే చాలు దాడులు చేసి, కేసులు పెట్టిన ఎక్సైజ్ అధికారులే ఇప్పుడు బెల్టుషాపులను పెంచాలని చెప్తుండటంతో మద్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నది.
ఎందుకీ పరిస్థితి?
లిక్కర్ ఆదాయాన్ని భారీగా పెంచడంపై రాష్ట్ర సర్కారు దృష్టిపెట్టింది. గతంలో ఎక్సైజ్‌శాఖ ఆదాయ వనరుల సమీకరణపై ఏర్పడిన మంత్రివర్గం ఉపసంఘం నిధులు ఎలా పెంచాలనే విషయంపై సుదీర్ఘంగా చర్చించింది. ఆరు గ్యారంటీలకు సంబంధించిన నిధులు, ఉద్యోగుల జీతభత్యాలు కూడా మద్యం నుంచే రాబట్టాలని ఎక్సైజ్ అధికారులకు దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం 2,620 ఏ4 మద్యం దుకాణాలు, 1200 బార్లు, క్లబ్బులు ఉన్నాయి. వీటి ద్వారా మద్యం విక్రయాలు, అన్ని రకాల సుంకాలు కలుపుకొని 2023లో రూ.32 వేల కోట్లు ఆదాయం సమకూరింది.
ప్రభుత్వం ఈ లక్ష్యాన్ని రూ. 45 వేల కోట్లకు పెంచినట్టు తెలిసింది. దీంతో ఎక్సైజ్ అధికారులకు జిల్లాలవారీగా టార్గెట్లు కేటాయించారు. ఎక్సైజ్ స్టేషన్ స్వభావాన్ని, పరిధిని బట్టి 10 శాతం నుంచి 25 శాతం వరకు పెంచాలనే టార్గెట్ పెట్టారు. ఉదాహరణకు ఒకషాపులో నిరుడు నవంబర్ పదో తేదీ నాటికి ఒక ఏ గ్రేడ్ మద్యం దుకాణం రూ. 20 లక్షల సరుకు విక్రయిస్తే, ఈ ఏడాది నవంబర్ 10 నాటికి రూ. 25 లక్షల సరుకు అమ్మాలని ఉత్తర్వులు జారీచేశారు. దీంతో లిక్కర్ వ్యాపారులు ఎక్కడ పడితే అక్కడ బెల్టుషాపులను తెరుస్తున్నారు. కిరాణషాపుల్లోనూ మద్యం అమ్మే పరిస్థితి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 1.75 లక్షల బెల్టు దుకాణాలు వెలిశాయని, మరో రెండు నెలల కాలంలో ఈ సంఖ్య రెండు లక్షలకు చేరుకునే అవకాశం ఉన్నదని ఎక్సైజ్ సీనియర్ అధికారి ఒకరు ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు.
‘బెల్టు’ యాజమాన్యంతో ఒప్పంద పత్రాలు..!
ఏ4 మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ ధరకే మద్యం అమ్మాలని ఎక్సైజ్ అధికారులు గట్టి హెచ్చరికలు జారీచేశారు. దుకాణాల ముందు మద్యం ధరల పట్టిక కచ్చితంగా పెట్టాలని ఇటీవల ఎక్సైజ్ కమిషనర్ సర్క్యులర్ జారీచేశారు. ఈ నిబంధన గతంలోనే ఉన్నా, కమిషనర్ ఇటీవల మరోసారి జారీచేశారు. లైసెన్స్ కలిగిన దుకాణం బయట మాత్రం ఇటువంటి ఆంక్షలు ఏమీ లేవని చెప్తున్నారు. అయితే బెల్టు దుకాణల్లో పరిమిత ఎమ్మార్పీ ఉల్లంఘన అమలు చేయాలని ఎక్సైజ్ ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం క్వార్టర్ లిక్కర్‌పై రూ.10 నుంచి రూ.15 వరకు అదనంగా తీసుకుంటున్నారని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ గుర్తించింది. ఎక్కువ ధరకు విక్రయించడం వలన జనం తక్కువ తాగుతున్నారని, ఫలితంగా సేల్స్ తగ్గుతున్నదని ఆబ్కారీ అధికారులు విశ్లేషించారు. కాబట్టి పరిమిత ఎమ్మార్పీ ఉల్లంఘన ఉంటే మరింత ఎక్కువ మందికి తాగించవచ్చని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. అనుమతించిన ఎమ్మార్పీ ఉల్లంఘన మేరకే మద్యం అమ్మేలా బెల్టుషాపుల యాజమాన్యంతో ఒప్పంద పత్రాలు కూడా రాయించుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం.
యువర్ పెర్ఫార్మెన్స్ ఈజ్ నాట్ అప్ టు మార్క్
మద్యం విక్రయాల్లో టార్గెట్ అందుకోలేని అధికారులకు నేరుగా ఎక్సైజ్ కమిషనర్ మెమోలు ఇస్తున్నారు. గడిచిన రెండు నెలల కాలంలో 30 ఎక్సైజ్ సీఐలు మెమోలు అందుకున్నట్టు తెలిసింది. ‘యువర్ పెర్ఫార్మెన్స్ ఈజ్ నాట్ అప్ టు మార్క్’ అని మెమోలు జారీ చేస్తున్నారు. మొదటిసారి మెమో హెచ్చరికగా తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. రెండోసారి కూడా టార్గెట్ అందుకోలేకపోతే బదిలీ చేస్తామని, ఏడాది పాటు ఏ స్టేషన్లోనూ పోస్టింగ్ ఇవ్వమని గట్టి వార్నింగ్ ఇస్తున్నట్టు తెలిసింది. దీంతో ఎక్సైజ్ అధికారులు అడ్డదారుల్లో, అడ్డగోలుగా మద్యం విక్రయాలను ప్రోత్సహిస్తున్నారు. గత నెల చివరి వారంలో, ఈ నెల మొదటి వారంలో దాదాపు 18 జిల్లాల్లో విక్రయాలు వెనుకబడ్డాయని ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఆయా జిల్లాలోఎక్సైజ్ స్టేషన్ వారీగా లెక్కలు తీసి మైనస్ విక్రయాలు ఉన్న స్టేషన్ అధికారికి మెమోలు జారీ చేసినట్టు తెలిసింది.