తొలి ఆహ్వాన పత్రికలో గౌరవ అతిథుల జాబితాలో ఎమ్మెల్యేల పేర్లతో పాటు కేసీఆర్ పేరు ముద్రణ. విమర్శల తర్వాత కేసీఆర్ను విశిష్ట అతిథిగా పేర్కొంటూ మార్చిన ఇన్విటేషన్
హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): ప్రతిపక్ష నేతలకు ‘ప్రొటోకాల్’పై ప్రభుత్వం మరోసారి తన వైఖరిని బయటపెట్టుకున్నది. మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ను అవమానించాలని ప్రయత్నించింది. అయితే, విమర్శలు రావడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా మెదక్ జిల్లా కేంద్రంలో గురువారం జరిగే వేడుకలకు సంబంధించి ప్రభుత్వం
ఆహ్వాన పత్రిక సిద్ధం చేసింది. ఇందులో మాజీ సీఎం కేసీఆర్కు హోదాకు తగిన ప్రాధా న్యం దక్కలేదు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు పాల్గొంటున్నట్టు అందులో పేర్కొన్నారు. మంత్రులు కొం డా సురేఖ, దామోదర రాజనర్సింహను విశిష్ట అతిథులుగా ప్రస్తావించారు. ప్రతిపక్ష నేతగా, క్యాబినెట్ ర్యాంకుకు సమాన హోదా ఉన్న కేసీఆర్ పేరును ఆహ్వాన పత్రికల్లో సాధారణ ఎమ్మెల్యేల వరుసలో చేర్చారు. పైగా ‘గజ్వేల్ శాసన సభ్యులు’ అని మాత్రమే సబోధించారు.
ఈ నిర్ణయంపై అటు రాజకీయ పక్షాల నుంచి, ఇటు నిపుణుల నుంచి, సోషల్ మీడియాలో నెటిజన్లు నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ సలహాదారుకన్నా ప్రధాన ప్రతిపక్ష నేత హోదానే పెద్దదని గుర్తు చేశారు. పైగా మాజీ సీఎం, ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష నేత కాబట్టి మంత్రులతో సమానంగా హోదా కల్పించాలని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రొటోకాల్ నిబంధనలను పరిశీలించాలని సూచించారు. క్యాబినెట్ మినిస్టర్లకు సమాన స్థాయిలో మాజీ ప్రధానులు, రాజ్యసభ, లోక్సభలో ప్రతిపక్ష నేతలకు గౌరవం ఇవ్వాలని నిబంధనల్లో ఉన్నాయని గుర్తు చేశారు. సంబంధిత పత్రాల ను షేర్ చేశారు. ప్రభుత్వం యథేచ్ఛ గా, ఉద్దేశ పూర్వకంగానే నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్టు స్పష్టం అవుతున్నదని మండిపడ్డారు.
నాలుక కరుచుకున్న ప్రభుత్వం
కేసీఆర్కు గౌరవం దక్కకపోవడంపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకున్నది. ఆహ్వాన పత్రికల్లో మార్పులు చేసింది. కేసీఆర్ పేరును విశిష్ట అతిథుల జాబితాలో చేర్చింది. ముఖ్య అతిథిగా కేకేను పేర్కొంటూ.. ఆ తర్వాతి స్థానంలో కేసీఆర్ పేరును మార్చింది. ‘తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకులు’ అనే హోదాను కూడా చేర్చింది. అయితే, ముందుగా బయటకు వచ్చిన ఆహ్వాన పత్రిక అసలుది కాదని జిల్లా అధికారులు సర్దిచెప్పుకునే ప్రయత్నం చేశారు. దీంతో మొదట వచ్చింది అసలుది కాకపోతే.. డిజైన్, అక్షరాలు, రంగులు, పేర్లు, పరిమాణం అచ్చు గుద్దినట్టు ఎలా ఉన్నాయని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించి నవ్వులపాలు కావొద్దని సూచిస్తున్నారు.