హైదరాబాద్, ఏప్రిల్ 28(నమస్తే తెలంగాణ) : జొన్న రైతుల కష్టాలపై కాంగ్రెస్ సర్కార్ పట్టింపులేనితనం ప్రదర్శిస్తున్నది. ప్రభుత్వం జొన్నలు కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర గోస పడుతున్నారు. ‘జొన్నలు కొనుగోలు చేయండి మహాప్రభో..’ అంటూ రైతులు వేడుకొంటుంటే… ప్రభుత్వం మాత్రం క్యాబినెట్‌కు లింకు పెట్టింది. క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాతే జొన్నల కొనుగోళ్లు ప్రారంభించాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. వాస్తవానికి, జొన్నల కొనుగోళ్లకు సంబంధించి అనుమతి కోసం మార్క్‌ఫెడ్ ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. సుమారు మూడు లక్షల టన్నుల జొన్నల కొనుగోళ్లకుగాను రూ.1,109 కోట్లు అవసరమని, ఇందుకోసం బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలని ప్రతిపాదన పంపించింది.
ఈ ఫైల్ వారం రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి చేరగా, ఆయన ఈ నెల 24వ తేదీన ఫైల్‌పై సంతకం చేశారని తెలిసింది. సీఎం సంతకం చేయడంతో జొన్నల కొనుగోళ్లకు గ్రీన్‌సిగ్నల్ వచ్చినైట్టెంది. అయితే, దీనిపై వ్యవసాయ శాఖ మెలిక పెట్టిందని విశ్వసనీయంగా తెలిసింది. సీఎం సంతకం పెట్టినప్పటికీ, క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాతే జొన్నల కొనుగోళ్లు ప్రారంభించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించినట్టు తెలిసింది. మే 4వ తేదీన క్యాబినెట్ సమావేశం జరిగే అవకాశం ఉన్నది. ఈ సమావేశంలో ఆమోదం పొందితే ఆ తర్వాత కొనుగోళ్లు ప్రారంభించాలని నిర్ణయించారని తెలిసింది. ఒకవేళ, ఆమోదించకపోతే జొన్న రైతుల కష్టాలు మళ్లీ మొదటికి వచ్చినట్టననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ క్యాబినెట్ సమావేశం ఏమైనా కారణాల వల్ల వాయిదా పడితే, ఇక అంతే సంగతనే అభిప్రాయాలున్నాయి. వ్యవసాయ శాఖ నిర్ణయంపై జొన్న రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
జొన్నలకు మద్దతు ధర రూ.3,699 ఉండగా బహిరంగ మార్కెట్లో రూ.1,800 నుంచి రూ.2వేలు మాత్రమే పలుకుతున్నది. రైతులు ఒక్కో క్వింటాల్‌పై దాదాపు రూ.1,800పైగా నష్టపోవాల్సి వస్తున్నది. దీంతో రైతులు సర్కార్ కొనుగోలు కేంద్రాల కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, గద్వాల జిల్లాల్లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రంలో నాలుగు లక్షల ఎకరాల్లో జొన్న పంట సాగైంది. రైతులు పంటలు కోత పూర్తి చేసి కొనుగోలు కోసం ఎదురుచూస్తున్నారు. కల్లాల్లో పోసి ఆరబెడుతున్నారు. అయితే, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సర్కార్ నిర్లక్ష్యం తమకు ఎక్కడ శాపంగా మారుతుందోనని, పంటలు ఎక్కడ వర్షానికి తడిసిపోయి నష్టపోతామోనని ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. క్యాబినెట్ ఆమోదం పేరిట జాప్యం చేయకుండా వెంటనే జొన్న కేంద్రాలను ప్రారంభించి.. కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
నిర్మల్ జిల్లావ్యాప్తంగా 40 వేల ఎకరాల్లో జొన్న సాగైంది. జొన్న కోతలు పూర్తయినా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. పంట ఉత్పత్తులు కల్లాల్లోనే పోసి ఎండలోనే పడిగాపులు కాస్తున్నారు.

ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.3,699 ఉం డగా.. ప్రైవేట్ వ్యాపారులు రూ.2 వేలకు కొనుగోలు చేస్తామంటున్నారు. జొన్న కొనుగోలుకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని మార్క్‌ఫెడ్ డీఎం మహేశ్ తెలిపారు.