హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని వ్యవసాయ కనెక్షన్లు, గృహజ్యోతి కింద అందజేసే సబ్సిడీ కాన్సెంట్ లేఖను ఈఆర్సీకి ఇవ్వడంలో సర్కారు జాప్యం చేసింది. దీని ప్రభావం ఈఆర్సీ ఆర్డర్లపై పడింది. ఈ లేఖ అందిన తర్వాత ఎట్టకేలకు ఈఆర్సీ తన నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రభుత్వం 2024 -25 సంవత్సరంలో రూ. 11,499. 52 కోట్లను సబ్సిడీ కింద డిస్కంలకు చెల్లిస్తామని హామీనిచ్చింది. ఎలక్ట్రిసిటీ యాక్ట్ 65 ప్రకారం సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం భరించేందుకు ఈఆర్సీ అనుమతినిస్తుంది. అయితే ఈ మొత్తాన్ని అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్ (ఏఆర్ఆర్)లో డిస్కంలు క్లెయిమ్ చేసుకుంటాయి. ఇందుకు ఈఆర్సీ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అయితే సోమవారం సాయంత్రం 6 గంటల వరకు ప్రభుత్వం హామీపత్రాన్ని ఈఆర్సీకి సమర్పించలేదు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆమోదం కోసం ఆర్థికశాఖ అధికారులు పంపగా, ఎట్టకేలకు సాయంత్రం 6 గంటల తర్వాత ఆయన ఆమోదం తెలిపారు. ఆయా వివరాలను ఈఆర్సీకి అందజేశారు. గృహజ్యోతి కింద రూ. 1,699. 45 కోట్లు, ఉచిత విద్యుత్తు కింద రూ.9,800.07 కోట్లను సబ్సిడీగా పేర్కొంది.