హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు రాను రానూ నిర్వీర్యమవుతున్నాయి. దశాబ్దాలుగా విద్యాజ్యోతులు వెలిగించిన కాలేజీలు ప్రభ కోల్పోతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన తర్వాత మరింత నిర్వీర్యమవుతున్నాయి. డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు గణనీయంగా తగ్గుతుండటమే ఇందుకు నిదర్శనం. ఈ మూడేండ్లల్లో ఆరు వేలకుపైగా అడ్మిషన్లు తగ్గాయి. రాష్ట్రంలో 119 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలుండగా, వీటిల్లో మొత్తంగా 89,010 సీట్లున్నాయి. ఈ విద్యాసంవత్సరంలో 26,713 సీట్లు మాత్రమే నిండాయి. 2023-24లో 33,029 మంది అడ్మిషన్లు పొందగా, మూడేండ్లల్లో 6,316 అడ్మిషన్లు తగ్గాయి. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకుల కొరత సమస్య పీడిస్తున్నది. 4,115 మంది బోధనా సిబ్బంది ఉండగా, ప్రస్తుతం కేవలం 1,526 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఏకంగా 2,589 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ట్రెండ్ చూస్తుంటే రాష్ట్రంలో అటానమస్ కాలేజీల జోరు పెరుగుతున్నది. కాలేజీల సంఖ్యతోపాటు అడ్మిషన్లు సైతం జోరందుకుంటున్నాయి. విద్యార్థులు సైతం అటానమస్ కాలేజీల్లోనే ఎక్కువగా చేరుతున్నారు. రాష్ట్రంలో రెండేండ్ల క్రితం ప్రభుత్వ అటానమస్ కాలేజీల సంఖ్య 15 మాత్రమే. 2025-26కు వచ్చేసరికి ఈ కాలేజీల సంఖ్య 34కు చేరింది. ఈ కాలేజీల్లో అడ్మిషన్లు రెండేండ్ల క్రితం 16,103 ఉంటే, ఈ విద్యాసంవత్సరం 32,094కు పెరిగాయి. అంటే 50% అడ్మిషన్లు పెరిగాయన్నమాట. ప్రైవేట్ అటానమస్ కాలేజీల్లో రెండేండ్ల క్రితం 2,540 మంది మాత్రమే చేరగా, ఈ విద్యాసంవత్సరంలో 6,222 మంది ప్రవేశాలు పొందారు. యూనివర్సిటీ అటానమస్ కాలేజీల్లో గతంలో 1,782 మంది చేరగా, ఈ ఏడాదిలో 2,218 మంది ప్రవేశాలు పొందారు.