హైదరాబాద్, జనవరి 29 ( నమస్తే తెలంగాణ ) : ‘అయితే జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి, లేదంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పాలన సాగుతున్నది. ఇదీ కాంగ్రెస్ మార్క్ ప్రజాపాలన’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు దుయ్యబట్టారు. పోలీసు పహారా మధ్య గ్రామసభలు.. పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రభుత్వ నిర్ణయాలా? అని ఆయన మండిపడ్డారు. ‘ప్రజాపాలన అంటివి, సీఎం క్యాంపు ఆఫీసులో ప్రజా దర్బార్ అంటివి. ప్రతిరోజూ ప్రజలను కలుస్త అంటివి. ఏడాది కాలంగా ముఖం చాటేస్తివి’ అని ఎద్దేవా చేశారు. సీఎం, మంత్రుల పేషీలు, అన్ని శాఖలు, విభాగాలు ఒకే దగ్గర ఉండేలా, సచివాలయం ఉండగా.. దాన్ని కాదని మంత్రులు, అధికారులను రేవంత్ జూబ్లీహిల్స్ ప్యాలెస్‌కు, కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు పరుగులు పెట్టిస్తున్నారని విమర్శించారు. సీఎం అధికారిక నివాసం రేవంత్ దర్పానికి సరిపోదని ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యమంటే ఇదేనా? అని ప్రశ్నించారు.
గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని గిరిజన విద్యార్థి సంఘం జాతీయ కమిటీ డిమాండ్ చేసిం ది. ఈ మేరకు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని తలపెట్టింది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు బుధవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాజునాయక్, ఇందల్ రాథోడ్, వెంకట్ బంజారా, రమేశ్‌నాయక్, రవీందర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.