హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): మెడికల్ పీజీ మేనేజ్మెంట్ కోటాలో 85 శాతం సీట్లను రాష్ట్ర విద్యార్థులకు కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టీ-జూడా రాష్ట్ర అధ్యక్షుడు ఐజాక్ న్యూటన్ హర్షం వ్యక్తంచేశారు. ఈ మేరకు మంగళవారం టీ-జూడా ప్రతినిధులు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ దవాఖానల్లో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ అజయ్‌కుమార్, చైర్పర్సన్ మదన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
క్యాట్‌కు 2.95 లక్షల దరఖాస్తులు
హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఎంబీఏ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయస్థాయిలో నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్(క్యాట్)కు ఈ సారి 2.95 లక్షల మంది దరఖాస్తు చేశారు. నిరుడు 2.93 లక్షల మంది దరఖాస్తు చేయగా, ఈ సారి 2 వేల మంది పెరిగారు. క్యాట్ పరీక్షను ఐఐఎం కొజికోడ్ ఈ నెల 30న మూడు సెషన్లలో నిర్వహించనున్నది. షెడ్యూల్ ప్రకారం బుధవారం అడ్మిట్‌కార్డులు విడుదల కావాల్సి ఉన్నది.