నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అన్నట్టుగా ఉన్నది రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు తీరు. అందుకే నిస్సిగ్గుగా అనర్హులకు ఉద్యోగాలను కట్టబెట్టింది. వారు అనర్హులని తేలాక కూడా ఉద్యోగాల నుంచి తొలగించకుండా వారికే రెడ్‌కార్పెట్ పరుస్తున్నది. అంతటితో అగకుండా రక్షణ కవచంలా వారిని కాపాడుతూ వస్తున్నది. అక్రమార్కులకు ఉద్యోగాలివ్వడంతో నష్టపోయిన బాధితులు న్యాయం కోరితే.. ‘పాతవారిని తొలగించం. కావాలంటే సూపర్ న్యూమరరీ ఉద్యోగాలిస్తాం’ అని కొత్త రాగం అందుకున్నది. ఇదంతా 2024లో జరిగిన స్పోర్ట్స్ కోటాలో ఉపాధ్యాయుల ఎంపిక గురించే..
హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 2024 అక్టోబర్ నెలలో స్పోర్ట్స్ కోటా టీచర్స్ రిక్రూట్మెంట్లో అనేక అక్రమాలు జరిగాయి. మొదట సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరపకుండానే ఉద్యోగాలను భర్తీచేశారు. ఈ వ్యవహారంపై రూ.15 లక్షలకు ఒక పోస్టు చొప్పున అమ్ముకున్నారని అభ్యర్థులు అప్పుడే పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా చేశారు. ఆ తర్వాత హైకోర్టుకు చేరడంతో మూడుసార్లు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేశారు. అర్హులను తేల్చే విషయంలో స్పోర్ట్స్ అథారిటీ, పాఠశాల విద్యాశాఖ మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఆఖరుకు కొంతకాలం క్రితం జీవో-74ను అనుసరించి ప్రాధాన్యతా జాబితాను రూపొందించి పాఠశాల విద్యాశాఖకు పంపించారు. బాధిత అభ్యర్థుల తెలిపిన వివరాల ప్రకారం.. జాతీయ క్రీడాకారులకు ఇవ్వాల్సిన ఉద్యోగాలను రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొన్న తక్కువ మెరిట్ గల వారితో భర్తీచేశారు.
ఈ విషయంలో జాతీయ క్రీడాకారులకు అన్యాయం జరిగింది. హైదరాబాద్, మంచిర్యాల, మెదక్, వికారాబాద్, హనుమకొండలో ఒక్కరు చొప్పున, కుమ్రం భీం ఆసిఫాబాద్‌లో ఇద్దరు చొప్పున తక్కువ మెరిట్ గల వారికి ఉద్యోగాలు ఇచ్చారు. అర్హులకు న్యాయం చేసేలా రెండు జాబితాలను రూపొందించారు. మొదటి జాబితాలో ఏడుగురు జాతీయ క్రీడాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలి. అనర్హులను తొలగించాలని సిఫారసు చేశారు. మరో జాబితాలో స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలకు అర్హులే లేరని, ఆయా ఉద్యోగాలను జనరల్ కోటాకు మార్చి ఉద్యోగాలు ఇచ్చారు. ఇలా చేయడం వల్ల 15 మంది క్రీడాకారులకు అన్యాయం జరిగింది. రెండు జాబితాలు ఇలా ఉంటే.. మరో ముగ్గురు దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాలను పొందారు. వారిని కూడా తొలగించాలని సిఫారసు చేశారు.
తప్పు జరిగిందని ఏజీ నిర్ధారణ
స్పోర్ట్స్ కోటా టీచర్ పోస్టుల భర్తీపై విద్యాశాఖ అధికారులు.. అడ్వకేట్ జనరల్ (ఏజీ) అభిప్రాయం తీసుకున్నారు. విచారించిన అడ్వకేట్ జనరల్ కూడా అక్రమాలు జరిగినట్టు తేల్చారు. జీవోకు విరుద్ధంగా నియామకాలు జరిగాయని అధికారులకు తేల్చిచెప్పారు. దీంతో 25 మంది అనర్హులకు ఉద్యోగాలిచ్చారని అధికారులు గుర్తించారు. వీరిని తొలగించాలన్న నిర్ణయానికి వచ్చారు. అంతలోనే కొందరు ప్రభుత్వ పెద్దల ముందు కొత్త ప్రతిపాదనను ఉంచారు. ఇప్పటికే ఉద్యోగాలు పొందిన వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తే న్యాయపరమైన చిక్కులొస్తాయని, వారిని తొలగించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఉద్యోగాల్లో గల అనర్హులకు నోటీసులివ్వగానే వారు హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్తారని, స్టే తెచ్చుకుంటారని, ఇది కాలయాపనకు దారితీస్తుందని ప్రభుత్వ పెద్దలు, అధికారులకు చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం.
తప్పు బయటపడుతుందని..
లెక్కప్రకారం ఉద్యోగాలు పొందిన 25 మందిని విధుల నుంచి తొలగించాలి. వారిస్థానంలో అర్హులను గుర్తించి ఉద్యోగాలివ్వాలి. కానీ జరిగిన అక్రమాలు భయటపడతాయని ప్రభుత్వం అందుకు సముఖంగా లేదు. ఇలా చేస్తే నియామకాల్లో అక్రమాలు జరిగినట్టు ఒప్పుకోవాల్సి వస్తుందని.. ఇది స్థూలంగా ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుందని ప్రభుత్వం జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం. సాక్షాత్తు ముఖ్యమంత్రే విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. సీఎం శాఖలోనే ఇంత పెద్ద కుంభకోణం బయటపడిందంటే సీఎం పరువు ప్రతిష్ఠ దెబ్బతింటుందని కప్పిపుచ్చుతున్నారు. వీటన్నింటినీ సాకుగా చూపి మొత్తం ఫైల్‌ను పక్కనపెట్టి వక్రమార్గంలో ఉద్యోగాలు పొందిన వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టు ఆరోపణలొస్తున్నాయి.
తెరపైకి సూపర్ న్యూమరరీ పోస్టులు
స్పోర్ట్స్ కోటా టీచర్ రిక్రూట్మెంట్లో అక్రమాలపై నష్టపోయిన అభ్యర్థులు న్యాయం కోసం ఏడాదిగా పోరాడుతున్నారు. న్యాయపరంగా ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. ఎలాగైనా ఈ వ్యవహారానికి చెక్ పెట్టాలన్న ఆలోచనతో కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఉప్పటికే ఉద్యోగాలు పొందుతున్న వారిని తొలగించకుండా, నష్టపోయిన బాధితులకు సూపర్‌న్యూమరరీ ఉద్యోగాలిచ్చే ప్రతిపాదనను అధికారులు తెరపైకి తీసుకొచ్చారు. అనర్హులను తొలగించకుండా, నష్టపోయిన 25 మందికి స్పెషల్ కోటాలో ఉద్యోగాలిచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్టు విద్యాశాఖ వర్గాల ద్వారా తెలిసింది. ఇలా అయితే సులభంగా తప్పించుకోవచ్చని సలహాలిచ్చినట్టు తెలిసింది.
అధికారులపై చర్యలేవీ?
ఉపాధ్యాయుల ఎంపికలో అనేక తప్పిదాలు జరిగినట్టు రుజువైంది. నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఉద్యోగాలిచ్చిన కొందరిని ఆ తర్వాత తొలగించారు. స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీ వివాదాలకు కేంద్ర బిందువైంది. వీటికి బాధ్యులైన అధికారులపై ఇంతవరకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. అటు విద్యాశాఖ, ఇటు స్పోర్ట్స్ అథారిటీ అధికారులపై సర్కారు కనీసం విచారణ కూడా చేపట్టలేదు. ఒకవైపు అనర్హులను కాపాడుతూనే, మరోవైపు బాధ్యులైన అధికారులను కాపాడుతుండటం విమర్శలకు తావిస్తున్నది. ఇలా చేయడమంటే తప్పు చేసిన అధికారులకు వంతపాడటమే అవుతుందని నిరుద్యోగ జేఏసీ నేతలు మండిపడుతున్నారు.