Telangana University | డిచ్పల్లి, మార్చి 13: తెలంగాణ విశ్వవిద్యాలయానికి కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి గీతారెడ్డి తల్లి ఈశ్వరీబాయి పేరు పెట్టేందుకు ఉన్నత విద్యామండలి ప్రయత్నించడంతో వివాదం రాజుకుంది. తెలంగాణ విశ్వవిద్యాలయం పేరు మార్చాలనుకున్న సర్వత్రా ఆగ్రహం వెల్లువెత్తడంతో సీఎం సూచనల మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి పేరు మార్పు అంశాన్ని పక్కన పెట్టేసింది. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి భంగం కలిగించే సర్కారు చర్యలపై ‘నమస్తే తెలంగాణ’ ఎత్తి చూపింది.
‘తెలంగాణ’ పేరు మారిస్తే పోరాటమే శీర్షికన గురువారం నమస్తే ప్రధాన సంచికలో ప్రచురించడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. పేరు మార్పుపై వెల్లువెత్తుతున్న ఆగ్రహాన్ని గమనించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఈ అంశాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే నిర్ణయం తీసుకోకపోతే వ్యతిరేకత మరింత పెరిగే ప్రమాదముందని గ్రహించిన రేవంత్రెడ్డి.. టీయూ పేరు మార్పు విషయంలో ఎలాంటి కార్యాచరణ చేపట్టవద్దని ఉన్నత విద్యామండలికి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే పేరు మార్పుపై ఎలాంటి నివేదిక అవసరం లేదని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నుంచి వర్సిటీకి సమాచారమందింది.