పెద్ద వంగర, జూలై 19 : మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే, ఆ కుటుంబం, దేశం బాగుపడుతుందని, అందుకే సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మహిళల ఆర్థికాభివృద్ధి పాటుపడుతున్నామని పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలంలో మంత్రి ఎర్రబెల్లి శనివారం సుడిగాలి పర్యటన చేశారు. పెద్ద వంగర మండల కేంద్రంలో నిర్వహిస్తున్న కుట్టు శిక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. శిక్షణ పొందుతున్న మహిళలతో మాట్లాడారు.
అనంతరం పార్టీ కార్యాలయంలో మండల పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై జరుగుతున్న అభివృద్ది పనులపై చర్చించారు. అభివృద్ధి పనుల వేగం పెంచాలని సూచించారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలన్నారు. అలాగే ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళాను సందర్శించారు. యువతతో మాట్లాడారు. డ్రైవింగ్ మేళా కు స్పందన ఎలా ఉందంటూ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.
ఆయా చోట్ల వేర్వేరుగా మంత్రి మాట్లాడుతూ సహజంగానే మహిళల్లో పొదుపు, నిర్వహణ అద్భుతంగా ఉంటాయని చెప్పారు. పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా, స్త్రీ నిధి సంస్థ ద్వారా డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీ, వడ్డీలేని, బ్యాంకు లింకేజీ రుణాలు అందచేస్తున్నామన్నారు. అలాగే రాష్ట్రంలోనే మొదటిసారిగా పైలెట్ ప్రాజెక్టుగా పాలకుర్తి నియోజకవర్గంలో చేపట్టిన ఉచిత కుట్టు శిక్షణ, ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు.
రూ.5 కోట్ల నిధులతో 3 వేల మందికి ఈ శిక్షణ ఇస్తున్నామని, ఈ విడత పూర్తి కాగానే, మిగతా 7 వేల మందికి ఎర్రబెల్లి ట్రస్టు ద్వారా శిక్షణ ఇస్తామని, మిషన్లు కూడా పంపిణీ చేస్తామని చెప్పారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి వరంగల్ టెక్స్ టైల్ పార్క్ లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇక ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళాను యువత, అందరూ ఉపయోగించుకోవాలని కోరారు.