Revanth Reddy | హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పాలన ‘అయితే జూబ్లీహిల్స్ నివాసం.. లేదంటే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్’ కేంద్రంగా సాగుతున్నది. ముఖ్యమైన సమీక్షలు, ప్రధానమైన నిర్ణయాలన్నీ అకడి నుంచే జరిగిపోతున్నాయి. మంత్రులు, అధికారులాంతా జూబ్లీహిల్స్ వైపు పరుగులు తీయాల్సి వస్తున్నది. ‘సచివాలయానికి రోజూ వెళ్తున్నా.. ఎంతమంది వస్తే అంతమందిని కలుస్తున్నా. ప్రతి ఒకరిని కలిసిన తర్వాతే ఇంటికి వెళ్తున్నా’ అని సీఎం రేవంత్‌రెడ్డి పదేపదే చెప్తున్నా వాస్తవంలో మాత్రం ప్రజాపాలన సచివాలయానికి దూరంగా సాగుతున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తనను కలవాలని వచ్చేవారికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖం చాటేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. పోలీసు పహారా మధ్య గ్రామసభలు.. అదే పోలీసుల కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రభుత్వ నిర్ణయాలు ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గతంలో కొత్త సచివాల నిర్మాణం కోసం పాత సచివాలయాన్ని కూల్చిన తర్వాత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమైన సమీక్షలన్నీ సీఎం క్యాంప్ ఆఫీసులో నిర్వహించేవారు. బీఆర్కే భవన్లో సచివాలయం కొనసాగినా అందులో సీఎం సమీక్షలు నిర్వహించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో క్యాంప్ ఆఫీస్‌లో సమీక్షలు చేసేవారు. అప్పుడప్పుడు తన ఎర్రవెల్లిలోని నివాసానికి పిలిపించుకునేవారు. దీనిపై నాడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేసేవారు. కానీ వందల మందితో సమీక్షలు నిర్వహించగలిగే స్థాయిలో సచివాలయంలో వసతులున్నా ఇప్పుడు సీఎం మాత్రం జూబ్లీహిల్స్‌లోని తన ఇంటి నుంచి లేదా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే అంతా నడుపుతున్నారు. దీంతో రేవంత్ రెడ్డిది ‘ప్యాలెస్ నుంచి పాలన’ అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
అధికారంలోకి వచ్చిన కొత్తలో సీఎం రేవంత్‌రెడ్డి రోజూ సచివాలయానికి వచ్చేవారు. కొన్నాళ్ల తర్వాత సచివాలయానికి రావడం తగ్గించారు. ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికల తర్వాత సచివాలయానికి దూరంగా ఉంటున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు రాకపోవడం, పాలనా వైఫల్యాల నేపథ్యంలో సచివాలయం వాస్తు మార్పులపై దృష్టి పెట్టారు. మొదట్లో సచివాలయంలోని ఆరో అంతస్తులో ఉన్న సీఎం కార్యాలయంలో వాస్తు మార్పులు చేశారని వార్తలు వచ్చాయి. తన చాంబర్‌ను ఆరో అంతస్తు నుంచి 9వ అంతస్తులోకి మార్చేందుకు సీఎం ప్రయత్నించారని సచివాలయ వర్గాల్లో చర్చ జరిగింది. సచివాలయంలోకి వచ్చేందుకు వెనుక వైపు ఉన్న మార్గాన్ని ఉపయోగించడం మొదలుపెట్టారు. అయినా మార్పు కనిపించకపోవడంతో సీఎం సచివాలయానికి రావడానికే ఆసక్తి చూపడం లేదన్న విమర్శలు ఉన్నాయి. చివరి ప్రయత్నంగా సచివాలయం ముందు ప్రధాన ద్వారాన్ని మూసేశారు. కొత్త ద్వారాన్ని నిర్మించారు. దీంతోపాటు సచివాలయం ముందు భాగంలో కొత్తగా రోడ్డు ఏర్పాటు చేశారు. దీంతో ఇక వాస్తు మార్పులన్నీ పూర్తయ్యాయని సీఎం తరచూ సచివాలయానికి వస్తారని అంతా భావించారు . కానీ సీఎం వ్యవహార శైలి మారలేదని, ఇప్పుడు పాలన అంతా కమాండ్ కంట్రోల్ సెంటర్ లేదా జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచే నడుస్తున్నదని విమర్శిస్తున్నారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రభుత్వ నిర్ణయాలు: హరీశ్‌రావు
‘అయితే జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి, లేదంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పాలన సాగుతున్నది. ఇదీ కాంగ్రెస్ మార్క్ ప్రజాపాలన’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు దుయ్యబట్టారు. పోలీసు పహారా మధ్య గ్రామసభలు.. పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రభుత్వ నిర్ణయాలా? అని ఆయన మండిపడ్డారు. ‘ప్రజాపాలన అంటివి, సీఎం క్యాంపు ఆఫీసులో ప్రజా దర్బార్ అంటివి. ప్రతిరోజూ ప్రజలను కలుస్త అంటివి. ఏడాది కాలంగా ముఖం చాటేస్తివి’ అని ఎద్దేవా చేశారు. సీఎం, మంత్రుల పేషీలు, అన్ని శాఖలు, విభాగాలు ఒకే దగ్గర ఉండేలా, సచివాలయం ఉండగా.. దాన్ని కాదని మంత్రులు, అధికారులను రేవంత్ జూబ్లీహిల్స్ ప్యాలెస్‌కు, కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు పరుగులు పెట్టిస్తున్నారని విమర్శించారు. సీఎం అధికారిక నివాసం రేవంత్ దర్పానికి సరిపోదని ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యమంటే ఇదేనా? అని ప్రశ్నించారు.
డిచ్పల్లి, జనవరి 29: విధి నిర్వహణలో తీవ్ర ఒత్తిడికి లోనై మానసికంగా కృంగిపోయిన నీటిపారుదల శాఖ ఉద్యోగి పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం నడిపల్లి శివారులో చోటు చేసుకున్నది. డిచ్పల్లి ఎస్సై షరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా ఖానాపూర్‌కు చెందిన కత్తులపురం సాయిచరణ్(30) ధర్పల్లిలో ఏఈఈగా విధులు నిర్వహిస్తున్నాడు. పనిచేసే చోట తీవ్ర ఒత్తిడికి లోనై ఈ నెల 28న డిచ్పల్లి శివారులో పురుగులమందు తాగాడు. వెంటనే హైదరాబాద్ యశోద దవాఖానకు తరలించగా బుధవారం మృతి చెందారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.