హైదరాబాద్, డిసెంబర్ 4(నమస్తే తెలంగాణ): ఇంటర్నెట్ సర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్..హైదరాబాద్‌లో సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్(జీఎస్ఈసీ)ని నెలకొల్పడానికి ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో అధికారిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. దేశంలో తొలి సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ కాగా, అలాగే ప్రపంచంలోనే ఐదోది కావడం విశేషం. ఈ జీఎస్ఈసీ ఏర్పాటునకు సంబంధించి గూగుల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రాయల్ హాన్సెన్..రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం హాన్సెన్ మాట్లాడుతూ..డిజిటల్ స్కిల్ డెవలప్మెంట్లో రాష్ట్రం ముందంజలో ఉన్నదని, ప్రపంచవ్యాప్తంగా ఐటీ, ఐటీ ఇంజినీరింగ్ సర్వీసెస్ అభివృద్ధికి హైదరాబాద్ కేంద్రంగా ఉన్నదన్నారు. ఈ నూతన సేఫ్టీ సెంటర్ ద్వారా సైబర్ సేఫ్టీ సమస్యలను వేగవంతంగా పరిష్కరించడానికి వీలు పడనున్నదన్నారు. అలాగే ఈ సెంటర్‌తో వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ఆన్లైన్ భద్రతా ఉత్పత్తులకు కిక్కు
జీఎస్ఈసీ ప్రత్యేకమైన అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ హబ్. ఇది అధునాతన భద్రత, ఆన్లైన్ భద్రతా ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించనున్నది. ఏఐ ఆధారిత భద్రత, సైబర్ సెక్యూరిటీ నిపుణులు, పరిశోధకులకు ఈ సేఫ్టీ సెంటర్ సహకారం అందించనున్నది. ఇదిలావుంటే దేశంలో నైపుణ్యాభివృద్ధిని, సైబర్ సెక్యూరిటీ సామర్థ్యాలు పెంపొందించే లక్ష్యంగా ఈ సెంటర్ పని చేయనున్నది.