Train Derailed | పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్‌లో అర్ధరాత్రి గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కర్ణాటకలోని బల్లారి నుంచి యూపీలోని ఘజియాబాద్‌కు స్టీల్‌లోడ్‌తో వెళ్తున్న గూడ్స్ రైలులో 11 బోగీలు అదుపు తప్పి బోల్తా పడ్డాయి. రాఘవాపూర్ సమీపంలోని కన్నాల రైల్వే గేటుకు కొద్ది దూరంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో లోలో పైలట్, గార్డు సురక్షితంగా బయటపడ్డారు. 44 బోగీలతో వెళ్తున్న ఈ గూడ్స్ రైలు అధిక లోడ్ వల్లే పట్టాలు తప్పినట్లు అధికారులు భావిస్తున్నారు.
ఈ ప్రమాదం వల్ల మూడు ట్రాక్‌లు దెబ్బతిన్నాయి. దీంతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు ఖాజీపేట – బల్లార్షా మార్గంలో వెళ్లాల్సిన పలు రైళ్లను ఆయా స్టేషన్ల వద్ద నిలిపివేశారు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే పెద్దపల్లి స్టేషన్లో సంపర్క్ క్రాంతి, భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌లను నిలిపివేశారు. అలాగే బిజిగిరి షరీఫ్ దగ్గర నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌ను ఆపివేశారు.అనంతరం ఘటనాస్థలి వద్ద మరమ్మతు పనులు మొదలు పెట్టారు. రైలు పట్టాల పునరుద్ధరణ, బోల్తా పడిన బోగీలను తొలగించి రైళ్ల రాకపోకలను ప్రారంభించేందుకు 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది.
గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో 31 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. 10కి పైగా రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. నర్సాపూర్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-నాగ్‌పుర్, హైదరాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్, సికింద్రాబాద్-కాగజ్‌నగర్, కాజీపేట-సిర్పూర్ టౌన్, సిర్పూర్ టౌన్-కరీంనగర్, కరీంనగర్-బోధన్, సిర్పూర్ టౌన్-భద్రాచలం రోడ్, భద్రాచలం రోడ్-బల్లార్షా, బల్లార్షా-కాజీపేట, యశ్వంత్‌పూర్-ముజఫర్‌పూర్, కాచిగూడ-నాగర్సోల్, కాచిగూడ-కరీంనగర్, సికింద్రాబాద్-రామేశ్వరం, సికింద్రాబాద్-తిరుపతి, ఆదిలాబాద్-పర్లి, అకోలా-పూర్ణ, ఆదిలాబాద్-నాందేడ్, నిజామాబాద్-కాచిగూడ, గుంతకల్లు-బోధన్ రైళ్లను రద్దు చేసింది.
రైలు ప్రమాదం గురించి తెలిసిన వెంటనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. రైల్వే అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తక్షణమే ట్రాక్‌ను పునరుద్ధరించాలని కోరారు. అలాగే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.
Train Derailed3