హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు మందగించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) లోని తొలి 4 నెలల్లో (ఏప్రిల్-జూలై) జీఎస్టీ వసూళ్లు కేవలం రూ.14,561 కోట్లకు చేరాయి. నిరుడు వసూలైన రూ.14,203 కోట్లతో పోలిస్తే 3% మాత్రమే అధి కం. దీంతో జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ 13వ స్థానంలో నిలిచింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 4 నెలల్లో దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు 4% పెరిగాయి. ఏకంగా 21% వృద్ధి రేటుతో సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్ అగ్రస్థానంలో నిలువగా.. పంజాబ్, హర్యానాలో 15%, మహారాష్ట్రలో 12%, గుజరాత్, జార్ఖండ్, లడఖ్‌లో 9%, ఉత్తరాఖండ్‌లో 8%, బీహార్‌లో 7%, రాజస్థాన్‌లో 5%, కర్ణాటకలో 3% వృద్ధి నమోదైంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ద్వారా మొత్తం రూ.59,704.59 కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్లో అంచనా వేయగా.. జూలై వరకు రూ.14,561 కోట్లు (24.38%) మాత్రమే రాబట్టగలిగింది. ప్రభుత్వ అం చనా నెరవేరాలంటే నెలనెలా కనీసం 8-10% వృద్ధిరేటు నమోదు కావాలి. కానీ, రాష్ట్రంలో కీలక రంగాలన్నీ కుదేలవడంతో జీఎస్టీ వసూళ్లు పెద్దగా పెరగడం లేదు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 50,942.66 కోట్ల జీఎస్టీ వసూలవుతుందని అంచనా వేయగా చివరికి రూ.46,500.43 కోట్లు (91.28%), నిరుడు రూ.58,594.91 కోట్లకుగానూ రూ.50,343.46 కోట్లు (85.92 %) మాత్రమే వసూలయ్యాయి.