Minister KTR | సంపద సృష్టే అసలైన రాజకీయం (గుడ్ ఎకనామిక్స్ ఈజ్ గుడ్ పాలిటిక్స్) అని ముఖ్యమంత్రి కేసీఆర్ బలంగా నమ్ముతారని, ఇప్పుడు తెలంగాణ అగ్రగామిగా ఎదగటానికి అదే కారణమని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధికి తెలంగాణ చిరునామా అని పునరుద్ఘాటించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్చార్డీలో జరిగిన ‘అభయ్ త్రిపాఠి స్మారక ఉపన్యాస’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘నూతన రాష్ట్రంగా ఎదుర్కొన్న సవాళ్లు’ అనే అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో తొమ్మిదేండ్లలోనే అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఎదిగిందని చెప్పారు. తెలంగాణను, హైదరాబాద్‌ను సొంత ప్రాంతంగా భావించి అభివృద్ధిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చినవారిని ‘వలసదారులు’ అని పిలవటం సరికాదని కేటీఆర్ అన్నారు. తన తండ్రి సీఎం కేసీఆర్ సైతం సిద్దిపేట నుంచి హైదరాబాద్‌కు వచ్చారని గుర్తు చేశారు. పక్కా హైదరాబాదీలు, బయటి ప్రాంతాల నుంచి వచ్చినవారిని పోల్చితే బయటి వాళ్లే ఎక్కువగా ఉంటారని అన్నారు. ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ర్టాల నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చినవారంతా హైదరాబాద్‌ను సొంత ప్రాంతంలాగే ప్రేమిస్తున్నారని చెప్పారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఏ ప్రాంతాన్ని చూసినా బయటివాళ్లే ఎక్కువగా ఉంటారని స్పష్టం చేశారు.
నార్త్ ఇండియా మీట్స్ సౌత్ ఇండియా , ఆపర్చునిటీ మీట్స్ టాలెంట్.. దోశ మీట్స్ పరాటా, డాటా సైన్సెస్ మీట్స్ లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ మీట్స్ బయాలజీ
– మంత్రి కేటీఆర్
‘గత రెండు, మూడు దశాబ్దాల్లో కొత్త రాష్ర్టాలు ఏర్పడిన పరిస్థితులు వేరు. జార్ఖండ్ కోసం ప్రజా ఉద్యమం జరిగింది. ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రాష్ర్టాలను పాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేశారు. తెలంగాణ మాత్రం దశాబ్దాల ఉద్యమం తర్వాత సాకారమైంది. 2001లో సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ను స్థాపించిన తర్వాత ఉద్యమం ఊపందుకున్నది. ‘బోధించు, సమీకరించు, పోరాడు’ అన్న అంబేద్కర్ నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాజకీయంగా, సామాజికంగా 14 ఏండ్లపాటు పోరాటాలు చేశారు. రాష్ట్రం కోసం అనేక మంది తెలంగాణ బిడ్డలు ప్రాణాలు అర్పించారు. యాదిరెడ్డి అనే ఉద్యమకారుడు ఢిల్లీకి వెళ్లి ఏకంగా పార్లమెంట్ ముందు ఆత్మహత్య చేసుకున్నారు. అందుకే తెలంగాణ ఏర్పాటు ఇతర రాష్ర్టాల కన్నా భిన్నంగా జరిగింది’ అని మంత్రి కేటీఆర్ తెలిపారు.
‘2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. ఎలా బాగుపడుతుందో అని కొందరు ఆసక్తిగా చూస్తే, ఎంతలా నాశనం అవుతుందోనని కొందరు ఎదురు చూశారు. స్వరాష్ట్రంలో ఏర్పడిన మొదటి ప్రభుత్వం కాబట్టి ప్రజలు కూడా ఆకాశమే హద్దుగా అంచనాలు పెట్టుకున్నారు’ అని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. దీంతో మౌలిక వసతులు కల్పించటం, సంపద సృష్టించటం, పెంచిన సంపదను అందరికీ సమానంగా పంచటం, చివరి వ్యక్తి వరకు సంక్షేమ ఫలాలు అందించటంపైనే సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాలకు కట్టుబడి పాలన సాగిస్తున్నామని అన్నారు. తొమ్మిదేండ్లలో సమాంతరంగా దేశవ్యాప్తంగా చాలా జరిగాయని గుర్తు చేశారు. కరెంటు, తాగు, సాగునీరు వంటి మౌలిక సమస్యలను వదిలేసి కొందరు హిజాబ్, హలాల్, యూనిఫాం సివిల్ కోడ్.. ఇలాంటి వాటివెంట పడ్డారని గుర్తుచేశారు. అలాంటి నాన్సెన్స్ను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదని, రాష్ట్రంలో జాతి, కులం, మతం, లింగ బేధం చూపలేదని వివరించారు.
ఒక్క మాటలో తెలంగాణ మాడల్‌ను వివరించాలంటే.. సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధికి చిరునామా అని కేటీఆర్ పేర్కొన్నారు. ‘జనాభాలో 3 శాతమే ఉన్నా, జీడీపీలో 5 శాతం వాటా కలిగి ఉన్నాం, జాతీయ స్థాయిలో అటు పంచాయతీ, ఇటు మున్సిపల్ అవార్డుల్లో 30 శాతం రాష్ర్టానికే వస్తున్నాయి. ఇవి సమగ్ర, సమ్మిళిత అభివృద్ధికి నిదర్శనం. రాష్ర్టానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో 7.7 శాతం పచ్చదనం, 5.13 లక్షల ఎకరాల అటవి విస్తీర్ణం పెరిగింది. ఇది సమతుల్య అభివృద్ధికి నిదర్శనం’ అని వివరించారు.
మోదీ గుజరాత్లో ఏదో చేశారని ప్రచారం చేసుకొని 2014లో ప్రధాని అయినప్పుడు.. దేశంలో కూడా మార్పు తెస్తారని ఆశించామని మంత్రి కేటీఆర్ తెలిపారు. అందుకే కొన్ని నిర్ణయాలకు మద్దతు ఇచ్చామన్నారు. నోట్ల రద్దుతో అవినీతి తగ్గుతుందని, డిజిటల్ వైపు మళ్లుతారని చెప్తే సమర్థించామని చెప్పారు. వన్ నేషన్ వన్ ట్యాక్స్, రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు గెలుపునకు సహకరించామన్నారు. అయినా మోదీ తెలంగాణకు మొండి చేయి చూపారని మండిపడ్డారు. కనీసం విభజన చట్టంలోని హామీలు అమలు చేయలేదని, నీతి ఆయోగ్ చెప్పినా రూ.24 వేల కోట్లు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ర్టాలన్నీ కలిసి పనిచేయాలంటూ మన్‌కీ బాత్‌లో చెప్తూ, కేంద్రాన్ని బతిమాలుకొనే పరిస్థితిని సృష్టిస్తారని ధ్వజమెత్తారు. కేంద్రంపై ఆశలు వదిలేసుకొని, సొంతంగా నిలబడి గెలిచామని కుండబద్ధలు కొట్టారు. దేశంలో గత ఏడాది కొత్తగా వచ్చిన ఐటీ ఉద్యోగాల్లో 33 శాతం హైదరాబాద్‌లోనే వచ్చాయని, ఈ ఏడాది 44 శాతానికి పెరిగిందని వివరించారు. దేశానికి తెలంగాణ రూపాయి ఇస్తే 46 పైసలు మాత్రమే తిరిగి వస్తున్నా మోదీ ప్రశంసించలేదన్నారు. ప్రపంచానికి భారత్ వ్యాక్సిన్ హబ్ అని చెప్పుకుంటారని, 900 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తున్న హైదరాబాద్‌ను అభినందించటానికి మనసు రాదని మండిపడ్డారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ రిచా శర్మ త్రిపాఠి, ఎంసీఆర్‌హెచ్చార్డీ డైరెక్టర్ జనరల్ శశాంక్ గోయల్, పలువురు ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు.
అప్పుల గురించి చాలా మంది తెలియక మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ‘అప్పు తెచ్చి మౌలిక వసతులు కల్పిస్తే తప్పేముంది? పెద్ద ఆర్థిక వ్యవస్థలుగా చెప్పుకునే అమెరికా, జపాన్ వంటి దేశాల జీడీపీతో పోల్చితే అప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ జీఎస్డీపీలో అప్పులు 25 శాతం మాత్రమే. తెచ్చిన అప్పుతో మౌలిక వసతులు కల్పిస్తే పరిశ్రమలు వచ్చాయి. మంచినీటి కోసం ఖర్చు పెడితే వ్యాధుల భయం తగ్గింది. ప్రజల జేబుల నుంచి ఖర్చు పెట్టడం తప్పింది. కాళేశ్వరం కడితే పంట విస్తీర్ణం పెరిగింది’ అని పేర్కొన్నారు.
ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, కేంద్రం వివక్ష చూపినా తెలంగాణ అభివృద్ధి పరుగులను సీఎం కేసీఆర్ ఎక్కడా ఆగనీయలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఫలితంగా ఇప్పుడు తెలంగాణ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఎదిగిందని చెప్పారు. 2014తో పోల్చితే ఇది స్పష్టం అవుతుందని వివరించారు. 100 శాతం ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలు తెలంగాణలోనే ఉన్నాయని, ఇంటింటికీ నీళ్లు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్, ధాన్యం ఉత్పత్తిలో అగ్రస్థానం, ఐటీ ఉద్యోగాల కల్పనలో టాప్, అతి ఎక్కువ గ్రీన్ కవర్ పెరుగుదల, బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ, దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్కు, వ్యాక్సిన్ హబ్, దేశంలోనే పునరుత్పాద శక్తిలో రెండో స్థానం, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రం ఇలా తెలంగాణకు ఎన్నో ఘనతలు ఉన్నాయని చెప్పారు. విద్య, వైద్యం, సామాజిక అభివృద్ధి తదితర ఏ రంగంలో చూసుకున్నా తెలంగాణ నంబర్ వన్ అని స్పష్టం చేశారు. దేశంలోని మిగతా 27 రాష్ర్టాలు కూడా తెలంగాణ మాదిరిగా కష్టపడితే 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఎప్పుడో సాకారం అయ్యేదని తెలిపారు.
‘కేటీఆర్.. మీరే తెలంగాణ బ్రాండ్. ఒక్క నిమిషమైనా, అరగంట అయినా.. గంట అయినా.. మీ ప్రసంగం వినేందుకు మాత్రమే వచ్చాను’ అంటూ ఓ మహిళా జర్నలిస్టు సంతోషం వ్యక్తంచేశారు. కేటీఆర్‌తో జరిగిన ముఖాముఖిలో పలువురు జర్నలిస్టులు మాట్లాడారు. ‘9 ఏండ్లలో తెలంగాణను దేశంలోనే అగ్రపథంలో నిలపటంలో మీరు కీలకపాత్ర పోషించారు’ అని మరో సీనియర్ జర్నలిస్టు కితాబిచ్చారు.
2014 కంటే ముందు మోదీ గుజరాత్‌కు సక్సెస్ఫుల్ సీఎం. ఆయన ప్రధానిగా ఫెయిల్ అయ్యారు. బీజేపీ లేని రాష్ర్టాల్లో గవర్నర్లతో రాజకీయం చేయిస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకులు అసెంబ్లీ సాక్షిగా చేస్తున్న బిల్లులను సైతం గవర్నర్ ఆమోదించటం లేదు. దీంతో ఎన్నో అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. ప్రధాని మోదీ సీఎంగా ఉన్నప్పుడు రాజకీయాలకు అతీతంగా సర్కారియా కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని చెప్పారు. మరి.. ప్రధాని కాగానే అవన్నీ ఏమయ్యాయి? బీజేపీ తమిళనాడు అధ్యక్షురాలిని తీసుకొచ్చి తెలంగాణ గవర్నర్‌గా నియమించారు. ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతుందో దేశమంతా చూస్తున్నది. రాజకీయాలు రాజ్‌భవన్‌కు చేరాయి. రాష్ర్టాలు బలపడితేనే దేశం బలపడుతుంది. అంతేతప్ప.. రాష్ర్టాలను అణగదొక్కేసి దేశాన్ని అభివృద్ధి చేస్తామంటే అదెప్పటికీ సాధ్యం కాదు. మణిపూర్‌లో అమానవీయ ఘటనలు అందరినీ కలచివేస్తున్నాయి. కేంద్రం మాత్రం సినిమా చూస్తున్నది. దేశం ఎటువైపు వెళ్తున్నది. ఐదేండ్లకోసారి వచ్చే ఎన్నికల గురించి ఆలోచించటం కాదు. మిగిలిన నాలుగేండ్లు ఎటువంటి పరిపాలన అందించామనేది ముఖ్యం.
రాష్ట్రం ఏర్పడిన వెంటనే తెలుగు చిత్రపరిశ్రమ వాళ్లు, ప్రొడ్యూస్ కౌన్సిల్ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. అప్పుడు సీఎం ఒక్కటే చెప్పారు. తెలంగాణలో స్వేచ్ఛ, సమానత్వం, శాంతిభద్రతలకు తొలి ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. సాధారణంగా ప్రభుత్వాలు మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలపైనే దృష్టి పెడతాయి. కానీ.. మ్యానిఫెస్టోతో సంబంధం లేని ఎన్నో నెరవేర్చాం. ప్రస్తుతం.. శాంతిభద్రతలు, స్వేచ్ఛలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా ఉన్నది. దేశంతోపాటు ప్రపంచంలోని అనేక ప్రాంతాల వారు నివాసానికి మొదటి ప్రాధాన్యంగా హైదరాబాద్‌ను ఎంచుకోవటమే దీనికి నిదర్శనం.
కేంద్రం నిధులు ఇవ్వటం రాజ్యాంగం కల్పించిన హక్కు. కేంద్రం ఆ హక్కులను కాలరాస్తున్నది. రాష్ర్టాలకు రావాల్సిన నిధులను తనవైపు మళ్లించుకుంటున్నది. రాష్ర్టాలకు రావాల్సిన నిధులను సెస్‌ల రూపంతో గండి కొడుతున్నది. 2014లో క్రూడాయిల్ 100 డాలర్లు ఉండేది. అప్పట్లో సుమారుగా పెట్రోల్ రూ.70, డీజిల్ రూ.60 ఉండేది. ఇప్పుడు క్రూడాయిల్ ధర 60 డాలర్లు. కానీ, డీజిల్, పెట్రోల్ ధరలు ఎంతయ్యాయో అందరం చూస్తున్నాం. కేంద్రంలో ఏం జరుగుతున్నట్టు? పైగా.. రాష్ర్టాలు ఎప్పటి నుంచే విధించే పన్నులను తగ్గించుకోవాలని ఉచిత సలహా ఇస్తున్నారు. ఇప్పటి వరకు కేంద్రం తెలంగాణకు రూ.35 వేల కోట్లు ఇవ్వాలి. హైదరాబాద్ మెట్రో నిర్మాణానికి రూపాయి సహాయం కూడా చేయలేదు. రోడ్లు, విద్యుత్తు, ఎయిర్‌పోర్టులు అన్ని ఉన్నప్పుడే కదా అభివృద్ధి జరుగుతుంది. ఆ మాత్రం సోయి కేంద్రానికి లేకపోతే ఏం చేస్తాం. భద్రాచలం.. తెలంగాణకు సరిహద్దు ప్రాంతం. అక్కడ వరదలు వస్తే కేంద్రం తనకు సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నది. వరదసాయం ఇవ్వదు. మోదీ.. కేవలం గుజరాత్, ఉత్తరప్రదేశ్‌కు నిధులిచ్చే పనిలోనే ఉన్నారు. ఓటు రాజకీయాలే తప్ప, ప్రజల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోవటం లేదు.
తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్) ఆధ్వర్యంలో యువతకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. దాని ద్వారా అనేకమందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాం. జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాం. విద్యార్థి దశలోనే జనరల్ నాలెడ్జ్‌ను పెంచటంపై దృష్టి సారిస్తున్నాం. రాష్ట్రంలో కొత్తగా అనేక విద్యాలయాలు నిర్మించాం.
దేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో మంచి జరిగితే దాన్ని దేశంతోపాటు మిగిలిన రాష్ర్టాలు స్వీకరించాలి. ప్రపంచంలోని అనేక దేశాల్లో, దేశంలోని అనేక రాష్ర్టాల్లో తెలంగాణ ప్రతినిధులు పర్యటిస్తున్నారు. అక్కడ అధ్యయనం చేసి ఉపయోగపడే అంశాలను స్వీకరిస్తున్నాం. కానీ.. దేశంలో అది జరగటం లేదు. తెలంగాణకు నిర్మాలా సీతారామన్ వచ్చి ఏదేదో చెప్తున్నారు. కేంద్రం నుంచి సాయం మాత్రం చేయరు. నీతిఆయోగ్, ప్లానింగ్ కమిషన్ వంటి సమావేశాలకు రాష్ర్టాలను పిలుస్తున్నారు.
కానీ ఎవరు చెప్పిన వాటిని పరిగణనలోకి తీసుకోరు. చివరికి వారికి నచ్చినదే చేస్తున్నారు. అటువంటప్పుడు రాష్ర్టాలను పిలవటం ఎందుకు. రాష్ర్టాలు వెళ్లటమెందుకు?
ఆంధ్రప్రదేశ్ మా సిస్టర్ సిటీ. వీలైనంత త్వరగా అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలని మేమెప్పుడూ కోరుకుంటాం. ఏపీలో అభివృద్ధి చేయటానికి పుష్కలంగా వనరులు ఉన్నాయి. ఓడరేవుల సౌకర్యం ఉన్నది. రాజమండ్రి, తిరుపతి, కర్నూలు, కడప, విజయవాడ, విశాఖపట్నం.. ఇలా అనేక పట్టణాలు ఉన్నాయి. కానీ అక్కడ ఆ స్థాయిలో అభివృద్ధి, సంక్షేమం చేయలేదు. ఇక.. హైదరాబాద్ అనేది కేవలం తెలంగాణ ప్రజలకే నిలయం కాదు. ఇది ఇండియా సిటీ. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల ప్రజలు జీవించే సిటీ. మేం తెలంగాణ ఏర్పడిన వెంటనే ఒకటే చెప్పాం. రాష్ర్టాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసే ఉంటామని. ప్రస్తుతం అందరం కలిసే ఉంటున్నాం.