హైదరాబాద్, జనవరి 9 (నమస్తేతెలంగాణ): ‘రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా అనేక మంది భూములను చెరబట్టిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కేటీఆర్‌పై అవాకులు చెవాకులు పేలడం విడ్డూరం’ అని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఫైర్ అయ్యారు. ‘ఆయన పేరు బీర్ల ఐలయ్య కాదు..భూదందాల ఐలయ్య’ అంటూ ధ్వజమెత్తారు. అలాంటి వ్యక్తి హైదరాబాద్‌కు ఫార్ములా ఈ-రేస్ తెచ్చి రాష్ట్ర ఖ్యాతిని పెంచిన కేటీఆర్‌పై విమర్శలు చేయడం విడ్డూరమని విరుచుకుపడ్డారు. గురువారం తెలంగాణ భవన్లో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఐలయ్య రాత్రికిరాత్రే పేదల భూములను పెద్దల పేరిట రిజిస్ట్రేషన్లు చేయించారని విమర్శించారు.
కొలనుపాకలో 7.22 ఎకరాల భూమిని 154 మంది పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించారని చెప్పారు. ఆయన చేసిన భూ దందాలు, అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, ఈడీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తనను ప్రశ్నిస్తున్నారే నెపంతో ఎలాంటి ఆధారాలు లేకున్నా కేటీఆర్, పట్నం నరేందర్‌రెడ్డి, లగచర్ల రైతులపై కేసులు పెట్టిన రేవంత్‌రెడ్డి..అన్ని ఆధారాలున్నా సొంత పార్టీ ఎమ్మెల్యే దురాగతాలు, భూ దందాలపై ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని నిలదీశారు.