హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): తన వారికి టికెట్లు ఇప్పించుకొనేందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ సర్వేలను ప్రభావితం చేశారని, పలుమార్లు ఎన్నికల్లో ఓడిన వారిని గొప్పవారిగా చూపిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు ఆరోపించా రు. రేవంత్ అందజేసిన సర్వే రిపోర్టులపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియాకు లేఖ రాశారు. రేవంత్‌రెడ్డి కారణంగా బడుగు, బలహీనవర్గాల నేతలు పార్టీకి దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
బడుగు, బలహీనవర్గాలకు చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని సూచించారు. తొలి జాబితాలో స్థానం దక్కిన వారిలో 12 మంది కొత్తవారేనని, వీరంతా రేవంత్ అనుచరులేనని తెలిపారు. తుమ్మల నాగేశ్వర్రావు ఇప్పటికే ఐదుసార్లు ఓడిపోయారని, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా కొత్తగా పార్టీలోకి వచ్చిన వారేనని తెలిపారు. అలాంటివారిని అధిష్ఠానం గొప్ప నేతలుగా చూడటం బాధాకరమని పేర్కొన్నారు. పార్టీ కోసం పనిచేస్తున్నవారికి రేవంత్‌రెడ్డి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.