హైదరాబాద్, జనవరి 22(నమస్తే తెలంగాణ): రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో మరో గోల్మాల్ వ్యవహారం బయటకొచ్చింది. ల్యాబ్ టె క్నీషియన్ల గ్రేడ్-2 పోస్టుల నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వెయిటేజీ నుంచి పోస్టిం గ్ ఆర్డర్ల వరకు ముడుపులు చెల్లించిన వారికే అందలం ఎక్కిస్తున్నారని చర్చ జరుగుతున్న ది. ఇటీవల వైద్యారోగ్య శాఖలో 1,257 ల్యా బ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టులకు సర్కారు నియామక పత్రాలు అందజేసింది. డీఎంఈ పరిధిలో 764, డీపీహెచ్ పరిధిలో 300, టీవీవీపీలో 180, ఎంఎన్జేలో 13 మందికి ప్రభు త్వం పోస్టింగ్ ఆర్డర్లను ఇచ్చింది.
ఈ పోస్టింగు ల్లో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలున్నాయి. ఆప్షన్ ఇచ్చుకున్న చోట కాకుండా మరోచోట పోస్టింగ్ ఇవ్వడంతో పలువురు అభ్యర్థులు షా క్కు గురయ్యారు. తొలుత మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు అభ్యర్థులకు పరీక్ష నిర్వహించగా.. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయ అధికారుల సమక్షంలో కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టా రు. మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూలకు పిలిచారు. ఖాళీల వివరాలను అధికారులు అభ్యర్థుల ముందుంచగా.. వారు ఎంచుకున్న స్థానాలను జాబితాల్లో గుర్తించారు. కౌన్సెలింగ్ తర్వాత వచ్చే అభ్యర్థులకు ఆయా స్థానాలు భర్తీ అయినట్టు అధికారులు తెలిపారు.
ప్రొసీడింగ్ ఆర్డర్లలోనే మతలబు
అభ్యర్థులు సైతం తాము కోరుకున్న చోట పోస్టింగ్ వస్తుందని ఆశగా ఎదురుచూశారు. తీరా ప్రొసీడింగ్ ఆర్డర్ చూసి షాక్‌కు గురయ్యారు. తామిచ్చిన ఆప్షన్ కాకుండా మరోచోట పోస్టింగ్ ఇవ్వడం ఏమిటి? అంటూ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ఇదే విషయమై అధికారులను సంప్రదించగా ఇచ్చిన స్థానాల్లో చేరాలంటూ హుకుం జారీ చేస్తున్నట్టు తెలిసింది. చివరి నిముషంలో అధికారులు కొందరు అభ్యర్థుల నుంచి పోస్ట్‌కు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు తీసుకుని వారు కోరుకున్న చోట పోస్టింగ్ ఇచ్చారనే ఆరోపణలు బయటకు పొక్కాయి. ఆమ్యామ్యాల కోసమే ఇలా జోన్ మార్పిడి చేసినట్టు పలువురు ఆరోపిస్తున్నారు.
జోన్-4, జోన్-5, జోన్-6లో పెద్ద మొత్తంలో ఈ అవకతవకలు జరిగినట్టు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరద్ధంగా పోస్టింగ్ ఆర్డర్లు ఎలా ఇస్తారని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. కొంతమంది పరస్పర ఒప్పందంతో అధికారులకు భారీగా డబ్బులు ముట్టజెప్పి జోన్లను మార్చుకున్నట్టు తెలుస్తున్నది. తాము ఎంపిక చేసుకున్న చోటకాకుండా మరో చోట ఎలా పని చేయాలని ఆయా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
అవకతవకలపై విచారణ జరుపాలి
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 వెయిటేజీ, పోస్టింగ్ ఆర్డర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని పలువురు అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరెవరికి ఎంతెంత ముడుపులు ముట్టాయో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో ఆరోగ్యశాఖ మంత్రి ప్రత్యేక చొరవ చూపాలని కోరుతున్నారు. గతంలో ఇవే పోస్టులకు వెయిటేజీ మార్కుల్లో అక్రమాలు జరిగాయని అభ్యర్థులు డీహెచ్ కార్యాయలం ఎదుట ఆందోళన చేపట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. వెయిటేజీ మార్కులను పరిగణనలోకి తీసుకోకుండానే ప్రభుత్వం నియామక ప్రక్రియలో ముందుకెళ్లడంపై పలువురు అభ్యర్థులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేశారు.