GHMC | గుమ్మడిదల, ఫిబ్రవరి 12: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్యారానగర్ అటవీ ప్రాంతంలో జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డు నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. బుధవారం బర్రెలు, ఆవులతో గుమ్మడిదలలో ప్రధాన రహదారిపై వినూత్నంగా నిరసన చేపట్టారు. రైతు జేఏసీ కమిటీ అధ్యక్షుడు చిమ్ముల జైపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో గొల్లకుర్మలు గొర్రెలు, మేకలను తోలుకుని వచ్చి జాతీయ రహదారి-765డీపై వినూత్నంగా నిరసన తెలిపారు. డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా వారంరోజులుగా ఆందోళనలు, నిరసనలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేదని బాధిత గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తంచేశారు. గుమ్మడిదల, కొత్తపల్లి, నల్లవల్లి, ప్యారానగర్ గ్రామాల్లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం 8వ రోజుకు చేరుకున్నాయి. దీక్షకు మద్దతుగా బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి సంఘీభావం తెలిపారు.
బీఆర్ఎస్ నాయకులు చిమ్ముల గోవర్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొత్తపల్లి ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పుట్ట నర్సింగ్‌రావు, నరేందర్‌రెడ్డి తదితర నాయకులు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. డంపింగ్‌యార్డు నిర్మాణంతో తమ బతుకులు దెబ్బతింటాయని, పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. వెంటనే డంపింగ్ యార్డు నిర్మాణ పనులు నిలిపి వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డంపింగ్‌యార్డు పనులు తాత్కాలికంగా నిలిపివేసినట్టు తహసీల్దార్ గంగాభవాని తెలిపారు. కొంతమంది రైతులు ప్యారానగర్‌లోని తమ భూముల్లో డంపింగ్‌యార్డు పనులు కొనసాగుతున్నాయని హైకోర్టును ఆశ్రయించడంతో ఈనెల 13 నుంచి 19 వరకు సర్వే చేయనున్నట్టు పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు తాత్కాలికంగా పనులు నిలిపివేసినట్టు తెలిపారు. కాగా గుమ్మడిదలలో కొనసాగుతున్న రిలే దీక్షా శిబిరాన్ని తహసీల్దార్ సందర్శించి డంపింగ్‌యార్డుపై అవగాహన కల్పించడానికి ప్రయత్నించగా ఆందోళనకారులు అడ్డుకున్నారు. ప్రభుత్వం యార్డు అనుమతులు రద్దు చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని వారు తేల్చిచెప్పారు.
ప్యారానగర్ వ్యర్థ నిర్వహణ కేంద్రం పనులకు బ్రేక్ ;పనులు వెంటనే నిలిపేయాలని మధ్యంతర ఉత్వర్వులు జారీ
హైదరాబాద్, ఫిబ్రవరి 12(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్లో 152 ఎకరాల్లో వ్యర్థాల ప్రాసెసింగ్ యూనిట్ నిర్మించాలన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కా ర్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాదాపూర్‌కు చెందిన ఏ స్వర్ణలత దాఖలు చేసిన వ్యాజ్యాన్ని బుధవారం న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ విచారించారు. పిటిషనర్ న్యాయవాది కైలాశ్‌నాథ్ పీఎస్ఎస్ వాదించారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు, ప్యారానగర్లో వ్యర్థ పదార్థాల నిర్వహణ కేంద్రం నిర్మాణ పనులు నిలిపివేయాలని రాష్ట్రానికి మధ్యంతర ఉత్తర్వులను జారీచేసింది. రోడ్డునిర్మా ణం, సర్వే యథావిధిగా కొనసాగించేందుకు అనుమతిచ్చింది. తదుపరి విచారణ ఈ నెల 25కు వాయిదా వేసింది.