Srinivas Yadadav | రాజనీతి శాస్త్రం తెలియని ఓ రౌడీ రాజకీయ నేత రేవంత్‌రెడ్డి అని, ఓ ప్రధాన రాజకీయ పార్టీకి అధ్యక్షుడు స్థాయిలో ఉన్న అని చెప్పుకుంటూ రాష్ట్రంలో ఓ యాదవ మంత్రిని ఆర్థిక, కుల అహంకారంతో దూషించిన దుష్టుడు, చరిత్ర హీనుడని గొల్లకురుమ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు గోసుల శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. 24 గంటల్లో గొల్ల, కురుమలకు క్షమాపణ చెప్పాలని, లేదంటే గాంధీభవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. యాదవులు శ్రీకృష్ణుని వారసులు, పశుపాలకులే కాకుండా పరిపాలకులు కూడా అని వివరించారు. కుల అహంకారంతో తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ని అహంకారంతో మాట్లాడడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండ పిసికి పెంట చేసి.. ఆ పెంట నుంచి పంట తీసే వ్యవసాయం చేసి ప్రపంచానికి అన్నం పెట్టేది యాదవులని, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, మాంసం ఉత్పత్తి చేయడంపాటు పశుపాల కులం పరిపాలకులం అన్నారు.
ఈ సమాజానికి పౌష్టిక ఆహారాన్ని అందించే ఉత్పత్తిదారులమని వెల్లడించారు. రాజకీయ చరిత్ర తెలియని రేవంత్ రెడ్డి ఆర్థిక, కుల అహంకారంతో యాదవ్ మంత్రిని నోటికి వచ్చినట్టు మాట్లాడడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. యాదవ సమాజాన్ని, యాదవ వృత్తిని అవమానించిన రేవంత్‌రెడ్డి ఖబడ్డార్ అంటూ హెచ్చరించారు. భేషరతుగా యాదవులకు క్షమాపణ చెప్పాలని, లేదంటే గొల్లకురుమ (యాదవ) హకుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టడమేకాదు, రాష్ట్రంలో రేవంత్ ఎకడ తిరిగినా దున్నపోతులు గొర్రె పొట్టేలతో తరలివచ్చి నిరసన తెలుపుతామని హెచ్చరించారు. గాంధీభవన్ ముట్టడిస్తామని ప్రకటనలో హెచ్చరించారు.