తొర్రూరు, మే 15 : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలెం గ్రామంలో గురువారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఆరుబయట నిద్రిస్తున్న మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఘటన గ్రామంలో కలకలం రేపింది. మొత్తం సుమారు ఎనిమిది తులాల బంగారం అపహరణకు గురైనట్లు సమాచారం. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి 12:30 గంటల సమయంలో నల్లటి దుస్తులు ధరించి, ముఖాలకు మాస్కులు కట్టుకొని, చేతులకు గ్లౌజులు వేసుకున్న ఇద్దరు దుండగులు గ్రామంలోకి చొరబడ్డారు.
గ్రామం చివర ఉన్న ఇండ్లను లక్ష్యంగా చేసుకొని ముందుగా తండా లింగమూర్తి ఇంటి వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో లింగమూర్తి ఇంటి బయట నిద్రిస్తుండగా దొంగలు ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అయితే ఇంటి వద్ద ఉన్న కుక్కలు మొరగడంతో లింగమూర్తి మేల్కొని దొంగలు అంటూ కేకలు వేయడంతో వారు పొలాల వైపు పారిపోయారు. అనంతరం రాత్రి ఒంటి గంట సమయంలో గ్రామ చివరలోని వెలికట్టె జమున ఇంటి వద్దకు చేరుకున్న దొంగలు, ఇంటి ముందు నిద్రిస్తున్న జమున మెడలోని నాలుగు తులాల బంగారు తాడును లాక్కునేందుకు యత్నించారు.
ఈ క్రమంలో బాధితురాలు ప్రతిఘటించడంతో గుంజులాట జరిగింది. దీంతో తాడు సగం తెగిపోగా, ఒక భాగం దొంగల చేతికి, మరో భాగం బాధితురాలి వద్ద మిగిలింది. అరగంట తర్వాత మరో ఇంటి వద్ద కొండ పార్వతమ్మ, ఆమె భర్త లింగయ్య వేర్వేరు మంచాలపై ఇంటి ముందు నిద్రిస్తుండగా, దొంగలు పార్వతమ్మ మెడలోని మూడున్నర తులాల పుస్తెలతాడు, మూడు తులాల నల్లపూసల గొలుసును కట్టింగ్ ప్లేయర్తో కత్తిరించి అపహరించారు.
పార్వతమ్మ కేకలు వేయడంతో మేల్కొన్న లింగయ్య దొంగలను వెంటాడినా, వారు చీకటిలో తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న తొర్రూరు సీఐ గణేష్, ఎస్ఐ గొల్లమూడి ఉపేందర్ ఘటనాస్థలానికి చేరుకొని బాధితుల నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.