భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాతోపాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు (Kaleshwaram project) వరద (Floods) పోటెత్తింది. దీంతో ప్రాజెక్టులోని లక్ష్మీ బ్యారేజీ 85 గేట్లను అధికారులు ఎత్తివేశారు. ఈ నేపథ్యంలో మేడిగడ్డ బ్యారేజీకి 8.21 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిచేరుతున్నది. అన్నారం బ్యారేజీకి గోదావరి నుంచి 7.61 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. ఇక మానేరు నుంచి అన్నారం బ్యారేజీకి 5.33 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చిచేరుతున్నది. దీంతో అధికారులు బ్యారేజీకి ఉన్న మొత్తం 66 గేట్లను ఎత్తివేసి 12.95 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
పెద్దపల్లి జిల్లాలోని పార్వతి బ్యారేజీకి వరద పోటెత్తడంతో 74 గేట్లు ఎత్తి నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీలోకి 9,23,508 క్యూసెక్కుల వరద వస్తుండగా, అంతేమొత్తంలో నీరు దిగువకు వెళ్తున్నది. పార్వతి బ్యారేజీ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 8.83 టీఎంసీలు.
కాళేశ్వరం వద్ద గోదావరి మహోగ్రరూపం దాల్చింది. పుష్కరఘాట్ల పైనుంచి వరద నీరు ప్రవహిస్తున్నది. త్రివేణీ సంగమం వద్ద ఉభయ నదులు 13.880 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నాయి. దీంతో కాళేశ్వరం వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. నదిలో వరద ఉధృతికి రోడ్డు, ఒడ్డుపై ఉన్న దుకాణాల్లో నీరు చేరింది.