తెలంగాణపై మరో పెను కుట్రకు తెర లేచింది.
గోదావరిపై మరో కుతంత్రానికి రంగం సిద్ధమైంది.
ఆరు దశాబ్దాలపాటు సాగునీరు అందక వలసల పాలైన తెలంగాణ.. స్వరాష్ట్రంలో కాస్త ఊపిరి పీల్చుకోకముందే మన నీటిని కబళించే మహా కుట్రకు పథకరచన మొదలైంది. పదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణపై కుట్రలకు విరామం ఇచ్చిన మస్తిష్కాలు మళ్లీ ఇప్పుడు కుతంత్రాలకు పదును పెడుతున్నాయి. గోదావరి జలాలనూ శాశ్వతంగా తెలంగాణకు దూరం చేసేందుకు గూడుపుఠాణీ చేస్తున్నాయి.
నాడు సమైక్యపాలకులు నీళ్లు తరలించుకుపోతుంటే గంగిరెద్దుల్లా తలాడించిన వాళ్లు.. తెలంగాణ ప్రాజెక్టులను దశాబ్దాలపాటు ఎండబెడుతుంటే గుడ్లప్పగించి చూసినవాళ్లు.. వలసవాదుల జలదోపిడీకి హారతులిచ్చి, తిలకం దిద్దినవాళ్లు.. తాబేదార్లుగా ఉన్నవాళ్లు, ప్రాంత ద్రోహులుగా మిగిలినవాళ్లు.. వేర్వేరు పార్టీల్లో చేరి ఇప్పుడు మళ్లా అవే కుట్రలకు మద్దతిస్తున్నారు.
తమిళనాట ఓట్ల పంట పండించేందుకు ఓ జాతీయపార్టీ వేసిన ఎత్తుగడకు తెలంగాణ బలి కాబోతున్నది. మన చేలకు పారాల్సిన గోదావరి జలాలు.. కావేరి కడుపు నింపనున్నాయి. తెలంగాణకు ఉరితాడు బిగించే గోదావరి-బనకచర్ల పథకానికి కేంద్రం రూ.3 వేలకోట్ల నిధులిచ్చేందుకు సిద్ధమైంది. అదే జరిగితే తెలంగాణ లైఫ్‌లైన్ అని కేంద్రమంత్రులే పొగిడిన కాళేశ్వరం కింద పదేండ్లు ఉప్పొంగిన గోదావరి జలసిరుల స్వర్ణయుగం ఇక ముగిసిపోనున్నది. మేడిగడ్డ బరాజ్‌లో ఒక్క పిల్లర్ కుంగడాన్ని ఆసరాగా చేసుకొని రాజకీయ దుర్నీతితో కాళేశ్వరాన్నే పడావు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. సొంత రాష్ట్రపు గొంతుకోతకు వంతపాడుతున్నది. శాశ్వతంగా బరాజ్‌ను వినియోగంలోకి రాకుండా చూసే క్రమంలో గోదావరి-కావేరి అనుసంధానానికి సాయపడుతూ తెలంగాణ సాగును శాశ్వత దుర్భిక్షంలోకి నెడుతున్నది.
ఇంతకీ పోరాడి తెలంగాణ తెచ్చుకున్నదెందుకు?
పస్తులుండి, పట్టుబట్టి ప్రాజెక్టులు కట్టుకున్నదెందుకు?
ఈ నేలను బీడు పెట్టి.. పొరుగుకు నీళ్లు పారిచ్చేందుకా?
రాజకీయ కుటిలనీతికి రైతును, రాష్ర్టాన్ని బలిపెట్టేందుకా?
తెలంగాణ సమాజం వేసుకోవాల్సిన ప్రశ్న ఇది!!
అనేక నిర్మాణాల సమాహారం. పలు పాత, కొత్త ప్రాజెక్టుల సమూహం. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం.. మూడు పెద్ద బరాజ్‌లు! మూడు నదీగర్భ జలాశయాలు, 16 భూ ఉపరితల రిజర్వాయర్లు, 21 పంప్‌హౌస్‌లు, 20 లిఫ్టులు, 203 కిలోమీటర్ల పొడవైన సొరంగాలు, 1,531 కిలోమీటర్ల పొడవైన కాలువలు, ప్రపంచమే కనీవినీ ఎరుగని బాహుబలి మోటర్ల పంపుహౌస్‌లు ఇన్ని కలిస్తే దాని పేరు కాళేశ్వరం. దీన్ని ఒక్క ప్రాజెక్టు అనొద్దు. అది మిషన్ కాళేశ్వరం!
(గుండాల కృష్ణ – మ్యాకం రవికుమార్)
Godavari | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ) : ఆరు దశాబ్దాల పాటు తెలంగాణకు కృష్ణాజలాల్లో దుర్మార్గపు చిక్కుముళ్లు వేసిన కుతంత్రం.. ఇప్పుడు గోదావరి జలాలను శాశ్వతంగా దూరం చేసేందుకు గూడు పుఠాణీ చేస్తున్నది. కాళేశ్వరం పథకంలో భాగమైన మేడిగడ్డ బరాజ్‌లో ఒక్క పిల్లర్ కుంగడాన్ని ఆసరాగా చేసుకొని తెలంగాణపై ముప్పేట కుట్రలను ఉధృతం చేస్తున్నది. జాతీయ డ్యాం భద్రతా సంస్థ (ఎన్డీఎస్ఏ)ను తెరపై పెట్టి అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. మేడిగడ్డ పునరుద్ధరణ ఊసే లేకుండా శాశ్వతంగా బరాజ్‌ను వినియోగంలోకి రాకుండా చూసేందుకు ఇటు రాష్ట్రంలోని రేవంత్ సర్కార్ ఉమ్మడి ప్రణాళిక అమలు చేస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలోనే మోదీ ప్రభుత్వం గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మాణంతో తమిళనాడులోని కావేరికి గోదావరి జలాలను తన్నుకుపోయే గోదావరి-కావేరీ అనుసంధాన ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. దీని ద్వారా పార్లమెంటు ఎన్నికల్లో తమిళనాట రాజకీయ లబ్ధి పొందాలనుకున్నా.. కుట్రపై బీఆర్ఎస్ ఒక్కసారిగా ధిక్కార స్వరం వినిపించడంతో తెలంగాణలో ఓట్లకు గండిపడుతుందన్న భయంతో అనివార్యంగా వెనక్కి తగ్గింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సర్కారు వచ్చిందే తడవుగా మళ్లీ ఈ కుట్రకు ఉమ్మడిగా సాన బెట్టారు. అందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన వెంటనే ఏటా సముద్రంలోకి 4 వేల టీఎంసీల గోదావరి జలాలు పోతున్నాయంటూ చంద్రబాబు కొత్త పల్లవి అందుకున్నారు. ఆ తర్వాతే పోలవరం నుంచి రాయలసీమకు గోదావరి జలాలను తరలించేందుకు గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును చేపడుతున్నట్టు ప్రకటించారు.
ఇదే క్రమంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సైతం గోదావరి-కావేరీ అనుసంధాన ప్రాజెక్టు డిజైన్‌ను మార్చుకుంది. తెలంగాణ సమ్మతితో సంబంధం లేకుండానే దిగువన పోలవరం నుంచి కావేరీకి గోదావరి జలాలను తన్నుకుపోవాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ మేరకు చంద్రబాబు చేపట్టే గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును ముందుకు తీసుకుపోతే తమిళనాడుకు గోదావరి జలాల తరలింపునకు కూడా మార్గం సుగమమైనట్టే! అందుకే తాజాగా గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు రూ.3 వేల కోట్లు ఇచ్చేందుకు ప్రధాని మోదీ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టు తెలిసింది. ఇక బాబు ప్రాజెక్టు పట్టాలెక్కితే నాగార్జునసాగర్ కుడి కాల్వతో పాటు రాయలసీమలోని పెన్నా బేసిన్‌కు కూడా గోదారమ్మ పరుగులు పెడుతుంది. పనిలో పనిగా జలాలను కావేరీకి అనుసంధానం పేరిట తమిళనాడుకు తరలించనున్నారు. ఎగువన కేసీఆర్ నిర్మించిన మేడిగడ్డ బరాజ్‌ను కాలగర్భంలో కలిపితే ఎలాంటి అడ్డూ లేకుండా ఏడాది పొడవునా దిగువన పోలవరం వద్ద గోదావరి జలాల లభ్యత ఉంటుంది. అందుకే ఏడాదిన్నరగా రాష్ట్రంలోని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ‘కుక్కను చంపేముందు పిచ్చికుక్క అనే ముద్ర వేయాలి’ అన్నట్టు కాళేశ్వరం ప్రాజెక్టుపై కోడిగడ్డు మీద ఈకలు పీకే వైఖరిని ప్రదర్శిస్తున్నది. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపివేయాలనే రేవంత్ సంకల్పం దీని ద్వారా ఎంతవరకు నెరవేరుతుందో దేవుడెరుగు! కానీ కాళేశ్వరం ప్రాజెక్టును నమ్ముకొని ఉన్న 11 తెలంగాణ జిల్లాల్లో లక్షలాది ఎకరాలు మళ్లీ ఉమ్మడి రాష్ట్రంలో పడ్డట్టు పడావుగా మారుతాయనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతున్నది. మరో కీలక విషయం ఏమిటంటే చంద్రబాబు చేపట్టే గోదావరి-బనకచర్లకు, కేంద్రంలోని మోదీ సర్కారు ఉవ్విళ్లూరుతున్న కావేరీ అనుసంధాన ప్రాజెక్టుకు ప్రాణహిత జలాలే ఆధారం! ఆ జలాలను ఒడిసిపడుతున్నదే కాళేశ్వరంలోని మేడిగడ్డ బరాజ్! ఇది ఉంటే మాకు నీళ్లు కావాలని తెలంగాణ పట్టుబడతది. ఆ బరాజ్ అనేదే లేకపోతే ‘ప్రాణహిత జలాలు ఎట్ల వాడుకుంటరు? సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని తరలించుకుపోతే మీకేంది’ అని ఇటు బాబు, అటు మోదీ ఎదురు ప్రశ్నిస్తరు.
తెలంగాణ కాస్త ఊపిరి పీల్చుకుంటున్నదనే సమయానికి మొత్తానికే గొంతు పిసికే కుట్రల కత్తులు విచ్చుకోవడం పరిపాటిగా మారింది. నిజాం నుంచి బయటపడి స్వతంత్ర రాష్ట్రంగా వెలుగొందిన కొన్నాళ్లకే ఆంధ్రప్రదేశ్‌తో కలవాల్సి వచ్చింది. ఆపై దాదాపు ఆరు దశాబ్దాల పాటు ప్రధానంగా జల వనరుల్లో జరిగిన అన్యాయం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా కృష్ణాలో ఒక తరహా అన్యాయం జరిగితే.. గోదావరిలో మరో తరహా అన్యాయం జరిగింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన శ్రీరాంసాగర్, కడెం, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు.. ఇలా ఏవి తీసుకున్నా ప్రధాన గోదావరిపైనే ఉన్నాయి. ప్రాణహితపై చేపట్టిన ప్రాణహిత-చేవెళ్లను నీటి లభ్యత లేని చోట ప్రతిపాదించారు. ఇంద్రావతి కలిసిన తర్వాత చేపట్టిన దేవాదుల ప్రాజెక్టులో కనీసం చిన్న బరాజ్ కట్టకుండా ఒక గుంతలో (ఇన్‌టేక్ పాయింట్) మోటర్ల ద్వారా లిఫ్టు చేయాలన్నరు. అంటే దిగువన ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి ఎలాంటి అడ్డూ లేకుండా గోదావరి జలాలు పారాలనేది అప్పటి పాలకుల ఉద్దేశం. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఈ అన్యాయాన్నే సరిచేసింది. ప్రాణహిత మీద కాళేశ్వరం ప్రాజెక్టుకు, మేడిగడ్డ బరాజ్‌కు రూపకల్పన చేసింది. దిగువన ఇంద్రావతి జలాలను సైతం వాడుకునేందుకు దేవాదుల వద్ద తుపాకులగూడెం బరాజ్ (సమ్మక్క సారక్క)ను నిర్మించింది. కేసీఆర్ పదేండ్ల హయాంలో పొరుగున ఏపీలోని చంద్రబాబు, జగన్ ప్రభుత్వాలైనా! ఎగువన మోదీ సర్కారైనా! తెలంగాణ జల వనరులపై కన్నేసేందుకు సాహసించలేదు. ముఖ్యంగా తమిళనాడులో రాజకీయ లబ్ధి పొందేందుకు అక్కడికి గోదావరి జలాలను తరలించుకుపోవాలని బీజేపీ ఒక ఎజెండాగా పెట్టుకున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ ఏండ్ల తరబడి తండ్లాడినా కేసీఆర్ ప్రభుత్వం ఆ పాచిక పారనివ్వలేదు. ఎప్పుడైతే తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిందో గోదావరి-కావేరీ అనుసంధాన ప్రాజెక్టుపై బీజేపీ ప్రభుత్వం దూకుడు పెంచింది. ఇక పొరుగున చంద్రబాబు సర్కారు రెండోసారి కొలువుదీరిన తర్వాత ఆ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. వెతికే తీగ కాలికి తగిలినట్టుగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూడా కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ రైతాంగం నోట్లో మట్టి కొట్టేందుకూ వెనుకాడటం లేదు. దీంతో ఏడాదిన్నరగా ఈ మూడువైపుల నుంచి గోదావరి జలాల్లో మరోసారి తెలంగాణకు తీరని అన్యాయం చేసే పథక రచన ఒక్కో దశను దాటుకుంటూ ముందుకుపోతున్నది.
‘ఏటా సముద్రంలోకి 4 వేల టీఎంసీల గోదావరి జలాలు వృథాగా పోతున్నాయి. ఆ జలాలను వినియోగించేందుకే పోలవరం నుంచి సాగర్ మీదుగా బనకచర్లకు గోదావరి జలాలను తరలించే గోదావరి-కృష్ణా-పెన్నా అనుసంధాన ప్రాజెక్టు చేపడుతున్నం’ అని కొన్ని నెలల కిందట ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ సాంకేతికంగా చూస్తే ఇదంతా ఓ బూచి అని స్పష్టమవుతున్నది.
గోదావరి నుంచి ఏటా సముద్రంలో కలిసే 4 వేల టీఎంసీల్లో కేవలం ఒకట్రెండు నెలల్లోనే 80 శాతానికి పైగా వరద ఉంటుంది. అంటే గోదావరిలో వరద అనేది కొన్నిరోజుల పాటు ఉవ్వెత్తున వస్తుంది. మిగిలిన 8-10 నెలల పాటు మోస్తరుగానే ఉంటుంది. పైగా వరద భారీగా ఉన్నప్పుడు ఇతర ప్రాజెక్టులకూ వరద ఉండటంతో పాటు వర్షాలు పడి తాగు, సాగునీటి వినియోగానికి ఈ జలాల అవసరం ఉండదు. అందుకే వర్షాకాలం పంటలకు కాకుండా యాసంగికి సాగునీరు అనేది అత్యంత కీలకమైనది. మేడిగడ్డ వద్ద దాదాపు ఏడాది పొడవునా ఇన్‌ఫ్లోలు ఉంటున్నందునే కేసీఆర్ కాళేశ్వరంలో భాగంగా మేడిగడ్డ బరాజ్‌ను అక్కడ నిర్మించారు. తద్వారా వర్షాకాలం ముగిసి భారీ వరదలు తగ్గగానే కాళేశ్వరం ద్వారా జలాలను ఎత్తిపోసుకుని యాసంగికి కూడా పుష్కలమైన సాగునీరు ఇచ్చారు. మరి మేడిగడ్డ పునరుద్ధరణ జరిగి అందులో నీటిని నిల్వ చేసి ఎత్తిపోసుకుంటే సంవత్సరంలో దాదాపు ఏడెనిమిది నెలలు ప్రాణహిత నుంచి దిగువకు గోదావరి జలాల ప్రవాహం చాలా తగ్గుతుంది. దీంతో పోలవరం నుంచి అదనంగా బనకచర్లకు గాని తమిళనాడులోని కావేరీకి గాని గోదావరి జలాలను తరలించేందుకు నీటి లభ్యత ఉండదు. అందుకే మేడిగడ్డ బరాజ్ అడ్డు తొలగితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగా ప్రాణహిత జలాలు నేరుగా దిగువన పోలవరం వైపు పోతాయి.
‘రోగి కోరింది అదే.. వైద్యుడు ఇచ్చింది అదే’ అన్నట్టు అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి మేడిగడ్డను పునరుద్ధరించే ఉద్దేశం లేదు. మేడిగడ్డ అడ్డుగా ఉంటే దిగువన పోలవరం నుంచి కావేరీకి గోదావరి జలాలను తరలించడం కష్టం! దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏది కోరుకున్నదో కేంద్రంలోని బీజేపీకీ అదే కావాల్సి వచ్చింది.
తెలంగాణ గడ్డపై ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మించి తమిళనాడుకు గోదావరి జలాలను తరలిస్తే అనేక సమస్యలున్నట్టు తెలిసింది. మేడిగడ్డ-తుపాకులగూడెం బరాజ్‌ల మధ్య మరో బరాజ్ నిర్మించడం సాంకేతికంగా సవాల్ లాంటిదని నిపుణులు చెప్తున్నారు. మరోవైపు మేడిగడ్డను కాలగర్భంలో కలిపి సమీపంలోనే ఇంకో బరాజ్‌కు సహకరించడం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి ఇరకాటంగా మారుతుంది. పైగా తెలంగాణ గడ్డ మీద నుంచి గోదావరి జలాలను తరలించుకుపోతుంటే ఎలా ఊరుకుంటారు? అని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్, ప్రజల నుంచి ఒత్తిడి వస్తుంది. అందుకే మేడిగడ్డను పునరుద్ధరించకపోవడం వరకు బాధ్యతను నెరవేరిస్తే దిగువకు గోదావరి జలాలు పోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిధిలో నుంచి వాటిని తన్నుకుపోవాలని కేంద్రం స్కె చ్ వేసింది. దీనికి తోడు చంద్రబాబు పనిలో పనిగా ఇందులో తన ప్రయోజనాన్ని కూడా చూసుకున్నారు. పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ద్వారా కృ ష్ణా, పెన్నా బేసిన్లకు గోదావరి జలాలను తరలించుకుపోవచ్చు. ఆపై కేంద్రం పెన్నా బేసిన్ నుంచి నేరుగా త మిళనాడులోని కావేరీకి గోదావరిని తన్నుకుపోతుంది.
ఏపీలో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాగానే గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టును శరవేగంగా ముందుకు తీసుకురావడం ఈ పథకంలో భాగంగానే అర్థమవుతున్నది. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులతో పాటు కృష్ణాజలాల న్యాయమైన వాటాను దాదాపు పుష్కర కాలం పాటు సాగదీస్తున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చంద్రబాబు తెరపైకి తెచ్చిన గోదావరి-కృష్ణ-పెన్నా అంతర్రాష్ట్ర రివర్ లింక్ ప్రాజెక్టును మాత్రం వేగంగా ముందుకు తీసుకుపోతున్నది. గోదావరి నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున 200 టీఎంసీలను పోలవరం నుంచి బనకచర్ల మీదుగా పెన్నా బేసిన్‌కు తరలించేందుకు ఈ ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వం జలహారతి పేరిట స్పెషల్ పర్పస్ వెహికిల్ కార్పొరేషన్‌ను కూడా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వాలని చంద్రబాబు మీడియా సమావేశంలోనే కోరారు. అనంతరం చంద్రబాబు స్వయంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు నిరుడు నవంబర్ 26న వినతిపత్రం కూడా ఇచ్చారు. దీంతో కేంద్రం ఈ ప్రాజెక్టుపై అధ్యయనానికి చర్యలు చేపట్టింది. కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాల మేరకు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి లేఖలు రాసింది. చంద్రబాబు ప్రతిపాదించిన ప్రాజెక్టుపై తదుపరి చర్యలు చేపట్టాలని అందులో ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు రూ.3 వేల కోట్లు సమకూర్చేందుకు ప్రధాని మోదీ సైతం సూత్రప్రాయంగా అంగీకరించినట్టు సమాచారం. ఇందుకుగాను ప్రాజెక్టుకు ఆమోదం కూడా తెలిపేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. త్వరలోనే దీనిపై ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్టు ఇరిగేషన్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రధాని సూత్రప్రాయ అంగీకారంతో ప్రాజెక్టు పనులను ఈ ఏడాదే పట్టాలు ఎక్కించేందుకు ఏపీ సర్కారు సిద్ధమవుతున్నట్టు ఇరిగేషన్ వర్గాల్లో జోరుగా చర్చ కొనసాగుతున్నది.
సాగునీటి ప్రాజెక్టులో లోపాలు తలెత్తడం సహజం. పొరుగున ఉన్న ఏపీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కడుతున్న పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది. అది కేంద్ర జల సంఘమే డిజైన్ చేసింది. అయినా ఆ అవాంతరాలను తొలగించుకొని ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకుపోతున్నారు. కాళేశ్వరంలో ఒక చిన్న భాగమైన మేడిగడ్డ బరాజ్‌లో కేవలం ఒకే ఒక్క పిల్లర్ కుంగిపోయింది. దానిని సరిచేసుకొని ప్రాణహిత జలాలను ఎత్తిపోసుకోవచ్చు.
పునరుద్ధరణ జరిగే వరకు కూడా నీటిని ఎత్తిపోసుకునేందుకు ప్రత్యామ్నాయ సాంకేతిక విధానాలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. కానీ మేడిగడ్డ బరాజ్ నుంచి నీటిని ఎత్తిపోస్తే అందులో రైతులకు కేసీఆర్ కనిపిస్తాడనే భయమో? తెలంగాణలో అసలు ప్రాణహిత జలాలకు అడ్డుగా ఏ ఒక్క నిర్మాణం కూడా ఉండొద్దనే సంకల్పమో? గాని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే రెండు సీజన్లు మేడిగడ్డను ఎండబెట్టింది. యాసంగిలో పంటలు ఎండినా పట్టించుకోకుండా ఏడాదిన్నర నుంచి రాజకీయంగా వాడుకునేందుకే ప్రయత్నిస్తున్నది. 2023, డిసెంబరులో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాళేశ్వరంపై దాడికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్నివిధాలా రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి తోడ్పాటును అందిస్తూనే ఉన్నదనేది బహిరంగ రహస్యం.
పార్లమెంటు ఎన్నికల ముందు తమిళనాడుకు గోదావరి జలాలను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది. గోదావరి-కావేరీ ప్రాజెక్టు డీపీఆర్‌ను రూపొందించి రెండు రాష్ర్టాలకు పంపింది. మేడిగడ్డ-తుపాకుల గూడెం మధ్య ఇచ్చంపల్లి దగ్గర బరాజ్ నిర్మించి గోదావరి జలాలను తమిళనాడుకు తరలించుకుపోతామని, నెల రోజుల్లోనే సమాధానమివ్వాలని లేకపోతే అంగీకరించినట్టుగానే (డీమ్డ్టు యాక్సెప్ట్) పరిగణిస్తామంటూ మెడ మీద కత్తి పెట్టింది.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దీనిపై నోరు మెదపలేదు. కానీ బీఆర్ఎస్ అప్పట్లో కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. అసలు గోదావరిలో మిగులుజలాలు ఉన్నాయా? లేవా? ఇవేవీ తేల్చకుండా ఎలాంటి శాస్త్రీయ అధ్యయనం చేపట్టకుండా ఏకపక్షంగా ప్రాజెక్టును ఎలా చేపడుతారంటూ గళం విప్పింది. అసలే పార్లమెంటు ఎన్నికలు కావడంతో తమిళనాడులో రాజకీయ ప్రయోజనం దేవుడెరుగు.. తెలంగాణలో నష్టం వాటిల్లుతున్నదనే భయంతో కేంద్రం వెనక్కి తగ్గింది. అయితే పార్లమెంటు ఎన్నికల తర్వాత అదే సమయంలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి చంద్రబాబు అధికారంలోకి రావడంతో బీజేపీకి అస్త్రం దొరికినట్టయింది. తాజాగా చంద్రబాబు రూపంలో గోదావరి-కావేరీ అనుసంధాన ప్రాజెక్టును మరో రూపంలో చేపట్టేందుకు పథకం రచించింది.
తెలంగాణపై జరుగుతున్న ఈ కుట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉండి పరోక్షంగా సహకారం అందిస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన వ్యక్తి కూడా ఇందుకు అంతర్గతంగా మంతనాలు చేస్తుండటం మరో విషాదం.
కేంద్ర జల శక్తిశాఖ మాజీ సలహాదారుగా, ఎన్‌డబ్ల్యూడీఏ రివర్ లింక్ ప్రాజెక్టుల టాస్ ఫోర్స్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరించిన వెదిరె శ్రీరాం ఏడాదిన్నరలో పలుమార్లు సీఎం రేవంత్‌రెడ్డిని నేరుగా కలవడం వెనక ప్రధాన కారణం ఇదేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆ క్రమంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో కాళేశ్వరం ప్రాజెక్టును కొనియాడిన వెదిరె శ్రీరాం ఆ తర్వాత ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ల ద్వారా కాళేశ్వరం మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. ఆయన పదే పదే సీఎం రేవంత్‌రెడ్డిని సెక్రటేరియట్, కమాండ్ కంట్రోల్ సెంటర్లో కలుస్తూ రహస్యంగా ఈ అంశంపై సంప్రదింపులు సాగిస్తున్నారనే సమాచారం ఉన్నది. తాజాగా ఎన్డీఎస్ఏ నివేదిక సమర్పించిన అనంతరం కూడా సీఎం, వెదిరె భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నది.