Basara | ఎగువన భారీ వర్షాతో బాసర (Basara) వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. వరద పెరడంతో బాసర పట్టణం జలదిగ్బంధమైంది. సరస్వతి ఆలయం వరకు ప్రధాన రహదారి జలమయమైంది. వ్యాస మహర్షి గుడి, ఆలయ ఆవరణలోని టీటీడీ గృహాల వరకు వరద చేరింది. ఆలయం వద్ద దుకాణాలు, ప్రైవేటు లాడ్జ్‌లు, సత్రాలు, పుష్కరఘాట్ నుంచి అమ్మవారి ఆలయానికి వెళ్లే దారి నీటమునిగాయి. గోదావరిపై వంతెనను తాకుతూ వరద ప్రవహిస్తుండటంతో గంగాదేవి, సూర్యేశ్వర శివాలయం, అక్షర కాలనీ, ఎస్బీఐ, యూనియన్ బ్యాంకు, వైశ్య సత్రం వరకు బ్యాక్ వాటర్ చేరాయి.
అక్షర కాలనీలో వరద నీటిలో చిక్కుకున్న వారిని అధికారులు ట్రాక్టర్ల సహాయంతో తరలించారు. వరద చుట్టుముట్టడంతో నాగభూషణ్ విద్యాలయంలో 30 మంది విద్యార్థులు, ఆరుగురు టీచర్లు చిక్కుకున్నారు. దీంతో వారంతా భవనంపై అంతస్తుకు వెళ్లారు. దీంతో వారిని బయటకు తీసుకొచ్చేందుకు వెళ్లిన 8 మంది కూడా వరద నీటిలో చిక్కుకుపోయారు. కాగా, మరికొన్ని గంటల్లో వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనావేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.