న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ, సెప్టెంబర్ 12: కృష్ణ, గోదావరి నదుల్లో వరద ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. కృష్ణలో ప్రవాహం నిలకడగా ఉండగా.. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఇటీవలి వర్షాలకు ఉధృతి పెరిగింది. జూరాల ప్రాజెక్టుకు సోమవారం సాయంత్రానికి 2.27 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు 41 గేట్లు ఎత్తి 2,29,274 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. సోమవారం ఇన్‌ఫ్లో 48,370 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 47,900 క్యూసెక్కులు నమోదైంది.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతున్నది. ఇన్‌ఫ్లో 48,539 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 33,203 క్యూసెక్కులు ఉన్నది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి సోమవారం 2,95,843 క్యూసెక్కుల నీరు చేరింది. డ్యాం తొమ్మిది గేట్లను 10 అడుగుల ఎత్తులో తెరిచి 2,51,847 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు 3,14,135 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో డ్యామ్ 10 క్రస్ట్ గేట్ల ద్వారా 2,06,570 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఎగువ మహారాష్ట్రతోపాటు తెలంగాణలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలోకి భారీగా వరద వస్తున్నది. సోమవారం బాసర వద్ద స్నానఘాట్తోపాటు నిత్యహారతి ఘాట్ల వద్ద శివలింగాలు మునిగాయి. గోదావరి నదీతల్లికి వేదభారతి పీఠం విద్యార్థులు శాంతిపూజలు నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్‌పల్లిలోని లక్ష్మీబరాజ్‌కు సోమవారం 9,89,630 క్యూసెక్కులకు ప్రవాహం పెరిగింది. బరాజ్ మొత్తం 85 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. కాళేశ్వరం పుష్కర ఘాట్ వద్ద 12.15 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవాహిస్తుండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
ములుగు జిల్లా వాజేడు మండలంలో గోదావరి వరద ఉధృతి పెరిగింది. టేకులగూడెం వద్ద హైదరాబాద్-భూపాలపట్నం 163 జాతీయ రహదారిపై వరద నీరు చేరడంతో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలంలోని కల్యాణ కట్ట వద్ద సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు 43 అడుగులకు ప్రవాహం చేరుకోగా భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాత్రి 8 గంటలకు 46.10 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తున్నది. ప్రవాహం 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.
ఎగువన విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతున్నదని, పరీవాహక జిల్లాల కలెక్టర్లు, అధికారులను వెంటనే అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎస్ సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. తక్షణమే సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వరద పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు. వరద ప్రస్తుతం 9 లక్షల క్యూసెక్కులు దాటుతున్నదని..భద్రాద్రికొత్తగూడెం, ములుగు సహా గోదావరి పరీవాహక జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు జాగ్రత్త చర్యలు చేపట్టేలా చూడాలని చెప్పారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొని తక్షణ సహాయ చర్యలు అందించడానికి అధికార యంత్రాంగమంతా సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు.