Telangana | పెద్దపల్లి, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ)/మంథని రూరల్: ఉమ్మడి రాష్ట్రంలో అనుభవించిన కష్టాలు, కన్నీళ్లు మళ్లీ పునరావృతమవుతున్నాయి. స్వరాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడి వలసలు వాపస్ వచ్చినా.. కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలోనే మళ్లీ వలసబాట పట్టాల్సిన దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. ఉపాధి లేక, కుటుంబాలను సాకలేక పల్లెలు బతుకుబాట పడుతున్నాయి. అందుకు పెద్దపల్లి జిల్లాలోని గోదావరి తీర గ్రామాలే నిదర్శనం. స్వరాష్ట్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి గోదావరిని నిండుకుండలా మార్చడంతో చేపల పెంపకంతో మత్స్యకారులకు మంచి రోజులు వచ్చాయి.
అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రోత్సాహం అందించడంతో ఉపాధి అవకాశాలు పెరిగాయి. దాంతో ఉమ్మడి రాష్ట్రంలో వలస పోయిన వారంతా తిరిగి స్వగ్రామాలకు చేరుకున్నారు. గోదావరి తీర గ్రామాల వాసులు బ్యారేజీల వద్ద చేపల వేట కొనసాగిస్తూ ఉన్న ఊరిలోనే కుటుంబాలతో సంతోషంగా గడిపారు. కానీ, కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో మళ్లీ పరిస్థితులు తారుమారయ్యాయి. కేసీఆర్‌పై కోపంతో బ్యారేజీ గేట్లను ఎత్తి నీళ్లను వదలడంతో గోదావరి ఎడారిలా మారింది. సమీప గ్రామాల్లో ఉపాధి దెబ్బతిన్నది. దీంతో తిరిగి బొంబాయి, దుబాయి, హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాలకు వలసబాట పడుతున్నారు.
ఖాళీ అవుతున్న బెస్తపల్లి..
మంథని మండలం బెస్తపల్లిని ఆనుకొని గోదావరి తీరం ఉంటుంది. ఈ గ్రామంలో 300 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ అందరూ మత్స్యకారులే. ఉమ్మడి రాష్ట్రంలో ఈ గ్రామం నుంచి ఎంతో మంది ఉపాధి కోసం బొంబాయి, దుబాయికి వలస వెళ్లారు. వీరంతా స్వరాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తిరిగి స్వగ్రామానికి వచ్చి చేపల వేట కొనసాగిస్తూ ఉన్న ఊరిలోనే ఆనందంగా జీవించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కక్షతో కాళేశ్వరం నీటిని కిందికి వదలడంతో ఇక్కడి మత్స్యకారుల నోట్లో మట్టి కొట్టినట్టయ్యింది. గోదావరిలో నీళ్లు లేకపోవడంతో ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయి. తిరిగి వలసబాట పట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికంగా ఉపాధి అవకాశాలు లేక కుటుంబాలను పోషించుకోలేక వలస వెళ్తున్నారు. ఇప్పటికే గ్రామం నుంచి 60 మంది వరకు వెళ్లగా, మరికొంత మంది వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కొందరు భార్యాపిల్లలను వదిలి వెళ్తే, మరికొందరు కుటుంబాలతో కలిసివెళ్లారు.
మళ్లీ బొంబాయి బాట..
ఈ ఫొటోలో కనిపిస్తున్న దంపతులు కూనారపు స్వప్న-వెంకటేశం. వీరిది బెస్తపల్లి గ్రామం. గతంలో గోదావరి నది ఎండిపోవడంతో ఉపాధి దొరక్క వీరు స్వగ్రామాన్ని వదిలి బొంబాయికి వెళ్లి అక్కడ బతికారు. స్వరాష్ట్రంలో గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిరిపురం బ్యారేజీని నిర్మించారు. దీంతో గోదావరి జీవం పోసుకొని నిండుగా మారింది. చేపల పెంపకంతో ఉన్న ఊరిలోనే సంతోషంగా బతకవచ్చని భావించి 2019 చివరలో తిరిగి స్వగ్రామానికి వచ్చారు. అప్పటి నుంచి వెంకటేశం సుందిళ్ల బ్యారేజీ వద్ద చేపలు పట్టి ఉపాధి పొందాడు. రోజుకు దాదాపుగా రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు సంపాదించాడు. అంతా సంతోషంగా గడిచిపోతున్న సమయంలో మళ్లీ గడ్డు పరిస్థితి ఎదురైంది.
ఏడాదిన్నర కిందట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం నీళ్లను కిందకి వదిలింది. దీంతో వారి కుటుంబంపై పిడుగుపడినట్టయింది. ఏడాదిన్నరగా గోదావరి ఎండిపోయి చేపలు పట్టే పరిస్థితి లేకపోయింది. దీంతో ఆ కుటుంబం పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. దీంతో వెంకటేశం మళ్లీ వలసబాట పట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. ఉన్న ఊరును, భార్యాపిల్లలను వదిలి బొంబాయి వెళ్లాడు. అక్కడ డ్రైవర్‌గా, బౌన్సర్‌గా పనిచేస్తూ పిల్లలను చదివించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల ఇంటికి వచ్చిన ఆయనను ‘నమస్తే తెలంగాణ’ పలుకరించగా.. తన ఆవేదనను వెల్లగక్కాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గోదావరిని ఎండబెట్టి మా పొట్ట కొట్టిందని వాపోయాడు. ప్రభుత్వం తమను గుర్తించి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపించాలని వేడుకుంటున్నాడు.
ఉపాధి కరువై బతుకు భారం..
ఈ ఫొటోలో కనిపిస్తున్నది కూనారపు లింగమ్మ. ఆమెది బెస్తపల్లి గ్రామం. ఊళ్లో ఉపాధి దొరకక ఆమె, ఆమె భర్త ఎల్లయ్య బొంబాయి కి వెళ్లి బతికేది. అక్కడ భార్యాభర్తలిద్దరూ చెరోపని చేసుకునేది. అలా వీరు కూడా వెళ్లి అక్కడ బతికారు. కొన్నేండ్ల తర్వాత వాళ్లు తిరిగి స్వగ్రామానికి వచ్చారు. ఆ తర్వాత వారి ముగ్గురు కొడుకులు సైతం పెరిగి పెద్దయ్యాక వాళ్లకూ ఉపాధి దొరక్క బొంబాయికి వెళ్లడంతో తల్లి లింగమ్మ మాత్రం ఇంటి వద్ద ఉండేది. ఈ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడంతో గోదావరి నిండుకుండలా మారింది. ముగ్గురు కొడుకులు తిరిగి బెస్తపల్లికి చేరుకున్నారు. చేపలు పడుతూ సంతోషంగా జీవనం సాగించారు. ముగ్గురు కొడుకులు, కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లతో లింగమ్మ కూడా ఆనందంగా గడిపింది. కానీ, కాంగ్రెస్ సర్కార్ వచ్చాక సుందిళ్ల గేట్లను ఎత్తి నీళ్లను కిందికి వదలడంతో ఉపాధి కరువై బతుకు భారమైంది. దీంతో ఇంటి పట్టున ఉండాల్సిన ముగ్గురు కొడుకుల్లో ఇద్దరు కొడుకులు మళ్లీ బొంబాయికి వెళ్లారు.
నాలుగేండ్లకే తాళం
ఈ ఫొటోలో కనిపిస్తున్నది బోరె మల్లేశ్ ఇల్లు. ఎంతో ప్రేమతో ఈ బిల్డింగ్ కట్టుకున్నాడు. కానీ, నాలుగేండ్లు కూడా అందులో ఉండని పరిస్థితి. తెలంగాణ రాక ముందు బొంబాయికి వలసపోయిన ఆయన, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత స్వగ్రామం బెస్తపల్లికి వచ్చాడు. చేపల వేటతో ఉపాధి పొందాడు. సొంతంగా ఇల్లు కూడా కట్టుకున్నాడు. అందులోనే సంతోషంగా జీవించాడు. కానీ, ఇప్పుడు గోదావరి నీళ్లు లేక ఎడారిలా మారడంతో ఉపాధి దెబ్బతిన్నది. ఈ పరిస్థితుల్లో ప్రేమతో కట్టుకున్న ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా బొంబాయి వెళ్లిపోయాడు.
పిల్లల చదువులు భారమై దుబాయి పోయిండు
మా ఊళ్లె ఏ పని దొ రక్క ఎన్కటి నుంచి మా ఆయన తిమ్మయ్య దు బాయి మస్కట్ల పనిచేసేది. కాళేశ్వరం నీళ్లచ్చినంక పానం చల్లబడ్డది. ఇక్కడనే బతుకొచ్చు అని మా ఆయన దుబాయి నుంచి వచ్చిండు. చాపలు పట్టి బతికెటోళ్లం. రోజుకు రూ.వెయ్యి నుంచి 2 వేల దాకా వచ్చేది. నాలుగేండ్లు సంతోషంగా గడిచింది. ఇప్పుడు నీళ్లు వదిలిపెట్టి మాకు కన్నీళ్లు మిగిల్చిన్రు. మాకు ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయి బీటెక్, చిన్నమ్మాయి 8వ తరగతి చదువుతున్నది. కుటుంబానికి, పిల్లల చదువులకు ఎల్లట్లేదు. ఇక్కడ పని కరువై మళ్లీ మా ఆయన దుబాయికి పోయిండు.
– అరిపెల్లి లక్ష్మి, వలసబాధితుడు తిమ్మయ్య భార్య, బెస్తపల్లి
మళ్లీ వలస పోయిండు..
మా ఆయన లక్ష్మణ్ బొంబాయిల ఉండేది. అక్కడ పనిచేసి జీతం పంపేది. నేను ఇక్కడ పిల్లలను చదివించుకుంట ఉండేది. నేను కూలికి పోయేది. కానీ, కాళేశ్వరం నీళ్లు అచ్చినంక మా ఆయన ఊరికచ్చిండు. ఇక్కడ్నే ఆయన చాపలకు పోతే, నేను కూలికి పోయేది. పిల్లలతోటి సంతోషంగా ఉండేది. గంగల నీళ్లు ఎత్తినంక ఇక్కడ మాకు రూపాయి దొరక్కుంట అయ్యింది. పెద్ద కష్టం వచ్చి పడ్డది. ఇగ తప్పదని మళ్లీ నా భర్త బొంబాయికి పోయిండు. పిల్లలు ఒకరు 8, ఇంకొకరు 6 చదువుతున్నరు. మేమిక్కడ, ఆయన అక్కడ.. ఒక్కోసారి చానా బాధైతది. డ్యామ్‌ల నీళ్లు నింపాలె. మళ్లీ మేము చాపలు పట్టుకునేటట్టు చెయ్యాలె.
-తోకల విజయ, బెస్తపల్లి
డ్రైవర్‌గా పనిచేస్తున్నడు
నాలుగేండ్లు మాకు ఏ కష్టం రాలేదు. మా ఆయన ఇంటికాడ చాపలు పట్టుకుంట ఉంటే నేను, నా ఇద్దరు పిల్లలం సంతోషంగా బతికేది. కానీ, గంగల నీళ్లుపోయినంక మాకు కష్టాలు వచ్చినై. ఏ పని దొరకలేదు. ఏం చెయ్యాల్నో తెల్వక మా ఆయన ధర్మాజి సంపత్ బొంబాయికి పోయిండు. అక్కడ డ్రైవర్‌గా పనిచేస్తున్నడు. ఇక్కడ నేను ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి బతుకుతున్నా.
-ధర్మాజి మౌనిక, బెస్తపల్లి