Sammakka Barrage | హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): ములుగు జిల్లాలోని సమ్మక్క సాగర్ బరాజ్ నుంచి గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టును చేపట్టేందుకు గల సాధ్యాసాధ్యాలపై కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నది. జూలై 9న నిర్వహించ తలపెట్టిన జనరల్ బాడీ సమావేశ ఎజెండాలో ఈ అంశాన్ని పొందుపర్చినట్టు నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ (ఎన్‌డబ్ల్యూడీఏ) రాష్ర్టాలకు సమాచారాన్ని అందించింది. గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టును ఇచ్చంపల్లి నుంచి చేపట్టాలని తొలుత ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. అక్కడ డ్యామ్‌ను ఎత్తును పెంచినట్టయితే ఎగువన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్‌కు నష్టం వాటిల్లుతుందని, దిగువన లోయర్ గోదావరిలో రాష్ట్ర వాటా జలాలను వినియోగించుకోలేమని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో ఆ ప్రతిపాదనపై కేంద్రం వెనకడుగు వేసి ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నట్టు తెలుస్తున్నది.
అందులో భాగంగా సమ్మక్క బరాజ్ నుంచి అనుసంధాన ప్రాజెక్టును చేపట్టేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నది. ఈ విషయమై ఎన్‌డబ్ల్యూడీఏ ఇప్పటికే తెలంగాణ అధికారులను సంప్రదించి సమ్మక్క బరాజ్ ఎగువన, దిగువన తెలంగాణ నీటి అవసరాల గురించి అడిగి తెలుసుకున్నది. అందుకు సంబంధించి ఇటీవల రాష్ట్ర అధికారులు ఇటీవల అందజేసిన నివేదికలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నది. ఇదే విషయాన్ని జూలై 9న ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన జనరల్‌బాడీ సమావేశ ఎజెండాలో చేర్చినట్టు ఎన్‌డబ్ల్యూడీఏ స్పష్టం చేసింది. ఆ సమావేశ ఎజెండా కాపీని అన్ని రాష్ర్టాలకు పంపింది. అయితే గోదావరి-కావేరి అనుసంధానం కోసం ఎన్‌డబ్ల్యూడీఏ చేసిన తాజా ప్రతిపాదనలపై తెలంగాణ సర్కారు ఏవిధంగా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.