హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : జీవో 46 బాధితులకు కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ‘మొండి చేయి’ చూపించింది. బాధిత అభ్యర్థులు ఆందోళనలు చేయకుండా ప్రభుత్వ పెద్దలు వేసిన కొత్త ఎత్తుగడ ఫలించింది. ‘ఉద్యోగాలు ఇద్దాం అని నేనంటా.. ఇవ్వడం కుదరదని నువ్ చెప్పు’ అన్న చందంగా జీవో 46 బాధితుల ప్రతినిధులతో సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం సాగినట్ట్లు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే జీవో 46 బాధితులు ఇటీవల గాంధీ భవన్‌ను ముట్టడించిన సందర్భంగా అక్కడికి వచ్చిన మంత్రి శ్రీధర్‌బాబును ఘెరావ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన శనివారం సచివాలయంలో సీఎస్, రిక్రూట్మెంట్ బోర్డు అధికారులతో మాట్లాడిస్తానని హామీ ఇచ్చారు.
ఆ ప్రకారమే సచివాలయంలో శనివారం సమావేశం నిర్వహించగా.. జీవో 46 బాధితుల నుంచి సీనియర్ కౌన్సెలర్ జీ విద్యాసాగర్‌తో కలిపి ఐదుగురు ప్రతినిధులు హాజరయ్యారు. అధికార పక్షంగా మంత్రి శ్రీధర్‌బాబు, సీఎస్ శాంతికుమారి, హోంశాఖ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా, తెలంగాణ లెవల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు, వైస్ చైర్మన్, స్టాండింగ్ కౌన్సెల్ మెంబర్, కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్‌రెడ్డి, ఇతర అధికారులు, ముఖ్య కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాధితుల వేదన వినకపోగా వారిపైనే ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలిసింది. వారు ఏం చెప్పినా తిరకాసు ప్రశ్నలతో 8 మంది అధికారులు ఐదుగురు బాధితులకు ఉక్కిరిబిక్కిరి చేశారు. శ్రీధర్‌బాబు కూడా ఏం చేసేది లేక అధికారుల వైపు మొగ్గు చూపారు. ఒకానొక దశలో బాధితులు చెప్పే వెర్షన్ వినే సహనం లేక అధికారులు సైతం ఈసడించుకున్నట్లు తెలిసింది.
లిస్టు తెప్పించుకొని చూద్దాంలే
ఈ సమావేశం ఎంతకూ ఒడవకపోవడంతో ఆఖరికి మంత్రి శ్రీధర్‌బాబు కలుగజేసుకొని ‘ఈ జీవో 46 బాధితులు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉంటారో తెలియదు కాబట్టి ముందుగా జిల్లాల వారీగా లిస్టు తెప్పించుకుంటాం. ఆ లిస్టు వచ్చిన తర్వాత మాట్లాడతాం’ అని హామీ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో తమ 16 నెలల పోరాటాన్ని కాంగ్రెస్ నేతలు నీరుగార్చారని బాధితులు వాపోయారు.