హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో దేవాదాయ శాఖలో 2014వ సంవత్సరం నుంచి పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు, అర్చకులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని దేవాదాయ అర్చక, ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ, డీవీఆర్ శర్మ పేర్కొన్నారు. ఇటీవల ఇచ్చిన మతపరమైన నోటిఫికేషన్‌ను రద్దు చేసి ఇప్పటికే దేవాలయాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నవారిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జీవో-121 రద్దుచేయాలని కోరుతూ బుధవారం సారస్వత పరిషత్‌లో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన అర్చక, ఉద్యోగ సభకు వివిధ జిల్లాల నుంచి అర్చక ఉద్యోగులు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ.. గతంలో కేసీఆర్ ప్రభుత్వం దేవాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, కన్సాలిడేటెడ్, దినసరి వేతనంతో పనిచేస్తున్న అర్చక సిబ్బందిని రెగ్యులరైజ్ చేస్తూ వారికి గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలు అందేలా ఇచ్చిన జీవో-577ను అమలుచేయడంలో అధికారులు విఫలమయ్యారని మండిపడ్డారు.
సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పినా.. ఉద్యోగుల విషయంలో దేవాదాయ ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కాంట్రాక్ట్ ఉద్యోగులకు నష్టంచేశారని ఆరోపించారు. ఇప్పటికైనా కాంట్రాక్ట్ బేసిక్, కారుణ్య నియామకాలు, ఔట్సోర్సింగ్, దినసరి వేతనంతో పనిచేసే వారిని వెంటనే పర్మినెంట్ చేసి ఆలయాల ఆదాయం నుంచే జీతం వచ్చేలా జీవో-577ను అమలుచేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల ఆదాయం రోజురోజుకూ పెరుగుతున్నా అక్కడ పనిచేస్తున్న తాత్కాలిక సిబ్బందికి రూ.రెండువేల నుంచి పదివేల వేతనం ఇస్తున్నారని, వారిని వెంటనే రెగ్యులరైజ్ చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు, ఇటీవల మతపరమైన ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చారని, దానిని రద్దుచేసి పాతవారినే నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమానికి హాజరైన టీఎన్జీవో సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఊరంతా తమ సమస్యల కోసం అర్చకుల దగ్గరికి వస్తే, అర్చకులు మాత్రం రాజకీయ నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి మంచిది కాదని, అర్చక ఉద్యోగుల సమస్యలను చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. సమావేశంలో జేఏసీ కన్వీనర్ రవీంద్రాచార్యులు, అర్చక అధ్యక్షుడు బద్రీనాధాచార్యులు, ఉద్యోగ అధ్యక్షుడు కాండూరి కృష్ణమాచార్యులు, ఆనంద్‌శర్మ, గట్టు శ్రీనివాసాచార్యులు, టీజీవో ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎంబీ కృష్ణాయాదవ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జేఏసీ ప్రతినిధులు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు కలిసి వినతిపత్రం ఇచ్చారు. త్వరలోనే ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అర్చక ఉద్యోగుల సమావేశం ఏర్పాటుచేస్తామని పీసీసీ చీఫ్ హామీ ఇచ్చారని జేఏసీ ప్రతినిధులు తెలిపారు.