పాలకుర్తి, జూన్ 26: ప్రపంచ స్థాయికి సోమనాథుడి కీర్తిని చాటిచెప్పాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమనాథ కళాపీఠం సాహిత్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయ కల్యాణ మండపంలో ఆదివారం పురస్కారాల ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. కళాపీఠం అధ్యక్షుడు రాపోలు సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పురస్కార గ్రహీతలకు మంత్రి అవార్డులు, జ్ఞాపికలు అందజేశారు. అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ప్రాచీన భాషల్లో తెలుగుకు ఎంతో ప్రాధాన్యత ఉన్నదని, అలాంటి భాషాభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. తద్వారా సాహిత్య నేలకు ఘనకీర్తి లభించిందన్నారు. సోమనాథుడి సాహిత్యాన్ని, భావజాలాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ఏటా పీఠం తరఫున పురస్కారాలు ఇవ్వడానికి చేయూతనిస్తామని మంత్రి పేర్కొన్నారు. సోమనాథుడి స్ఫూర్తితో ఎందరో గొప్ప కవులు, కళాకారులు, రచయితలు వారసత్వాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. బమ్మెర పోతన, పాలకుర్తి సోమన్న, వల్మిడి ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు.