హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): మిస్‌వరల్డ్ పోటీదారులకు చౌమహల్లా ప్యాలెస్‌లో వడ్డించిన భోజనం రేట్ల వివాదం మరువకముందే గ్లోబల్ సమ్మిట్‌లో (Global Summit) ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన మంచినీటి ధర ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే గ్లోబల్ సమ్మిట్‌కు హాజరైన సందర్శకులకు అందిస్తున్న అరలీటర్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ కోసం రూ.115 ఖర్చు చేస్తున్నట్టు తెలిసింది. ఇంపాక్ట్ వాటర్ బ్రాండ్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోగోతో ఉన్న ఈ ప్రీమియం కార్టన్-ప్యాకేజ్డ్ వాటర్… పేపర్ ఆధారిత ప్యాకేజింగ్‌తో ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గిస్తుందని, అదనపు మినరల్స్‌ను కలిగి ఉంటుందని పేర్కొన్నది. ముంబైలో తయారైన ఈ ప్యాక్‌లను సమ్మిట్ కోసం ప్రత్యేకంగా ఆర్డర్ చేశారు. 350 ఎంఎల్ గల 24 ప్యాక్‌ల ఒకో కార్టన్ ధర రూ.1,896గా ఉంది.
నగరమంతటా శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేసే హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డు (హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ) సిబ్బంది ఈ ప్రైవేట్‌గా తయారైన ప్యాకేజ్డ్ వాటర్‌ను సమ్మిట్ వేదిక వద్ద పంపిణీ చేయడం గమనార్హం. దీనిపై అధికారులను ప్రశ్నించగా, ఈ వాటర్ ప్యాక్‌లను గ్లోబల్ సమ్మిట్ కోసం ప్రత్యేకంగా ఆర్డర్ చేసినట్టు తెలిపారు. రెండురోజుల కార్యక్రమానికి క్యాటరింగ్ కాంట్రాక్ట్‌ను ఒక ప్రముఖ ఫైవ్‌స్టార్ హోటల్‌కు అప్పగించారని సమాచారం. ఒక అరలీటర్ నీటి ప్యాక్‌కే రూ.115 ఖర్చు అవుతుంటే.. ఈ సమ్మిట్‌లో ఒకో భోజన ప్లేట్ ఖర్చు ఎంత ఉంటుందో ఊహించడం కష్టమేనని అభిప్రాయం వ్యక్తమవుతున్నది. మే 15న కాంగ్రెస్ ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీదారుల కోసం చౌమహల్లా ప్యాలెస్‌లో విందు ఏర్పాటు చేసినప్పుడు కూడా ఖర్చుపై వివాదం చెలరేగింది. భారీ వ్యయంపై ప్రతిపక్షాలు ప్రశ్నించగా ‘ఒకో ప్లేట్‌కు కేవలం రూ.8,200 మాత్రమే ఖర్చు చేశాం’ అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది.
దేశవ్యాప్తంగా గ్లోబల్ సమ్మిట్ యాడ్స్
‘నా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు.. కావాలంటే నన్ను కోసుకొని తినండి. అలా కోసుకొని తిన్నా డబ్బులు లేవు’ అంటూ ప్రజావేదికలపై చెప్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గ్లోబల్ సమ్మిట్ ప్రచారం కోసమే కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ప్రచారయావలో కోట్ల రూపాయల ప్రజాధనం పక రాష్ట్రాల్లో దుర్వినియోగం చేస్తున్నారని ప్రతిపక్ష నేత లు అంటున్నారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కోసం ప్రముఖ జాతీయ, రాష్ట్ర పత్రికలకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాడ్స్ ఇచ్చారు. ఓ ప్రముఖ జాతీయ పత్రికకు కోయంబత్తూరు, విజయవాడ, విశాఖపట్నం, ముంబై, తిరువనంతపు రం, తిరుచిరాపల్లి, పాట్నా, మంగళూర్, మధురై, కొచ్చి, కోల్‌కతా, కోజికోడ్, లక్నో, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వంటి ప్రముఖ నగరాల్లో ఫ్రంట్ పేజ్ పేపర్ ప్రకటనలు ఇచ్చారు. కాగా, తెలంగాణలోని ‘నమస్తే తెలంగాణ’ ‘వెలుగు’ దినపత్రికలను మాత్రం వదిలేశారు.