హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : నాడు దేశ భవిష్యత్తు కోసం కొత్త రా జ్యాంగం ద్వారా రోడ్‌మ్యాప్ వేస్తే నేడు తెలంగాణ భవిష్యత్తు కోసం తాము గ్లోబల్ సమ్మిట్‌తో రోడ్‌మ్యాప్ వేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. పదేండ్లలో దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకే సమ్మిట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. రెండురోజుల పాటు నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ ను సోమవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించగా, సదస్సులో నోబెల్ బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినీనటుడు నాగార్జున, ప్రముఖ వ్యాపారవేత్త గౌత మ్ అదానీ కుమారుడు కర ణ్ అదాని, ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్వైడర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో అ పార వ్యాపార అవకాశాలున్నాయని.. చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ దేశాల నుంచి తామెంతో ప్రేరణ పొందామని, ఇప్పుడు తాము ఆ దేశాలతో పోటీ పడాలనుకుంటున్నామని వెల్లడించారు. 2034 నాటికి ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యం తో పనిచేస్తున్నట్టు తెలిపారు.
వచ్చే పదేండ్లలో లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్టు ట్రంప్ మీడియా టెక్నాలజీస్ డైరెక్టర్ ఎరిక్ స్వైడర్ ప్రకటించారు. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ ఎండీ కరణ్ అదానీ మాట్లాడు తూ.. ఇప్పటికే రూ.10వేల కోట్ల పెట్టుబడులు పెట్టామని, భవిష్యత్‌లోనూ కొనసాగిస్తామని చెప్పారు. ఇందులో భాగంగానే రూ.25వేల కోట్లతో 48 మెగావాట్ల గ్రీన్ డాటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.
భవిష్యత్తు కోసం ఎదురుచూడకుండా.. దా నిని తామే నిర్మించాలన్నది తమ ప్రభుత్వ సంకల్పమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చె ప్పారు. తాము వేసే ప్రతి అడుగు.. చేసే ఆలోచన భావితరాల ఆశయాలు, అవసరాలకు అ నుగుణంగా ఉంటుందని తెలిపారు.
బెంగళూరు, హైదరాబాద్‌ను పోటీ నగరాలుగా చూడటం కన్నా రెండూ కలిసి పనిచేస్తే బాగుంటుందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సూచించారు. అభివృద్ధి, పెట్టుబడుల విషయంలో హైదరాబాద్ బెంగళూర్‌తో పోటీ పడుతున్నదన్నారు. తెలంగాణ బెంగళూరుతో పోటీపడటం కాదు, గ్లోబల్ స్థాయి సహకారంతో ముందుకుసాగుతున్నదని చెప్పారు.
మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు విజన్ డాక్యుమెంట్ తెలంగాణ రైజింగ్-2047ను విడుదల చేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు వివిధ అంశాలపై ప్యానల్ చర్చలు నిర్వహించనున్నారు. వివిధ కంపెనీలతో పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉన్నది.
హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తొలిరోజైన సోమవారం సుమారు రూ.2.43 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరినట్టు ప్రభుత్వం వెల్లడించింది. 35 ఎంవోయూలపై సంతకాలు జరిగినట్టు పేర్కొన్నది. సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో తొలి రోజు డీప్‌టెక్, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ రంగాల్లో పలు పెట్టుబడుల ఒప్పందాలపై సంతకాలు చేశారు.
ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ సంస్థ రాష్ట్రంలో వన్యప్రాణి సంరక్షణ, జంతు సంక్షేమ కేంద్రం వంతరాను ఏర్పాటు చేయనున్నది. హైదరాబాద్‌లో విశ్వవిద్యాలయం, వైద్య విద్య, పరిశోధనా కేంద్రం నిర్మాణానికి అపోలో గ్రూప్ రూ. 800 కోట్లు పెట్టుబడి పెట్టనున్నది. మోటార్ స్పోర్ట్స్ సంస్థ సూపర్‌క్రాస్ ఇండియా తెలంగాణలో రేసింగ్ ట్రాక్, శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనున్నది. యూనివర్సిటీ ఆఫ్ లండన్ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో నైపుణ్య అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నది.
