యాచారం, జూన్ 26: ‘మా భూములు మాకే కావాలి. మాకు ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. హైకోర్టు ఆర్డర్‌ను వెంటనే అమలు చేయాలి’ అని ఫార్మా బాధిత రైతులు డిమాండ్ చేశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకపోతే మరో ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఫార్మా బాధిత గ్రామాలైన మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాలకు చెందిన రైతులు గురువారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. ఇబ్రహీంపట్నంలో ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఫార్మాసిటీ భూములను ఫ్యూచర్ సిటీకి ఉపయోగిస్తామనడంపై చర్చించేందుకు రైతులు సమావేశమయ్యారు.
రైతులకు భూములను తిరిగి ఇచ్చేది లేదని ఆయన చేసిన వ్యాఖ్యలను రైతులు తప్పుపట్టారు. ఫార్మాకు ఇవ్వని భూముల జోలికి రా కుండా ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని రైతులు మూకుమ్మడిగా ని నదించారు. గతంలో రైతుల వెంట ఉండి ఫార్మాసిటీకి వ్యతిరేకంగా ఉద్యమం చేసిన నాయకులు నేడు పదవులు రాగానే ఫార్మా రైతులకు అన్యాయం చేయాలని చూడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సమస్యలను పట్టించుకోకపోతే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు కవుల సరస్వతి, కానమోని గణేశ్, సామ నిరంజన్, కుందారపు సత్యనారాయణ, వినోద్‌కుమార్‌రెడ్డి, అచ్చిరెడ్డి, సందీప్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, పాపిరెడ్డి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.