హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): కాపు, తెలగ, బలిజ సామాజిక వర్గాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకునేందుకు హైదరాబాద్లో ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని ఆయా సామాజిక వర్గాలకు చెందిన పలువురు రిటైర్డ్ అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరారు. బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు, విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ తోట చంద్రశేఖర్ నేతృత్వంలో కాపు సామాజిక వర్గానికి చెందిన పలువురు విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఉన్నతాధికారులు, పారిశ్రామికవేత్తల బృందం సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసి, వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని, కాపు భవన నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. హైదరాబాద్లో స్థిరపడ్డ ఆంధ్రప్రాంత వాసులు సీఎం కేసీఆర్ నాయకత్వానికి మద్దతుగా నిలుస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రిని కలిసినవారిలో విశ్రాంత ఐఏఎస్ అధికారులు రామ్మోహన్, లక్ష్మీకాంతం, గోపాలకృష్ణ, విశ్రాంత ఐపీఎస్ అధికారి తోట మురళీకృష్ణ, విశ్రాంత ఐఆర్ఎస్ అధికారులు పీవీ రావు, రంగిశెట్టి మంగబాబు, చింతల పార్థసారధి, పారిశ్రామికవేత్త, మెగాస్టార్ చిరంజీవి తోడల్లుడు డాక్టర్ వెంకటేశ్వరరావు, టీసీ అశోక్, ఆలివ్ మిఠాయి అధినేత దొరరాజు, ఎంహెచ్రావు, శ్రీహరి, చంద్రశేఖర్, కాపు సామాజిక వర్గానికి చెందిన పలువురు ప్రముఖులు ఉన్నారు.