హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ దవాఖానల్లో ఉన్న వసతులపై సమగ్ర నివేదిక సమర్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జిల్లా, తాలూకా, గ్రామ స్థాయిల్లోని దవాఖానలకు కేటాయించిన బడ్జెట్ వివరాలను అందజేయాలని కోరింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టీ వినోద్‌కుమార్ ధర్మాసనం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేసింది. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని ఎలపల్లికి చెందిన చారగొండ స్వర్ణ కాన్పు కోసం పదర మండలానికి వచ్చింది. నొప్పలు అధికం కావడంతో అకడి నుంచి 108 వాహనంలో వేర్వేరు దవాఖానలకు వెళ్లాల్సివచ్చింది. మొత్తంగా 124 కి.మీ. దూరం ప్రయాణించాక మహబూబ్‌నగర్ జిల్లా దవాఖానలో శిశువుకు జన్మనించ్చింది. ఆ తర్వాత ఫిట్స్ రావడంతో స్వర్ణ, కొద్ది సేపటికి శిశువు మృతి చెందారు. దీనిపై పత్రికల్లో వచ్చిన వార్తలను ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించిన హైకోర్టు బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.