హైదరాబాద్, ఆగస్టు29 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 పోస్టుల భర్తీ వ్యవహారంలో రిజర్వేషన్లను అమలు చేస్తున్న తీరును వివరించాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని గురువారం నోటీసులిచ్చింది. విచారణను సెప్టెంబరు 27కు వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ కే శరత్ ప్రకటించారు.
గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఉద్దేశించిన జీవో-55కు సవరణ తెచ్చి, తాజాగా జీవో-29 జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ ఎం హనుమాన్ సహా నలుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరి తరఫు న్యాయవాది వాదిస్తూ.. గ్రూప్-1 మెయిన్‌కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసే క్రమంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను అమలు చేయలేదని చెప్పారు.
563 పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. జనరల్ పోస్టులు 200, ఈడబ్ల్యూఎస్ 49, బీసీ(ఏ) 44, బీసీ (బీ)37, బీసీ(సీ) 13, బీసీ(డీ) 22, బీసీ(ఈ) 16, ఎస్సీ 93, ఎస్టీ 52, క్రీడాకారులు 4, దివ్యాంగులు 24 పోస్టులు చొప్పున ఉన్నాయని వివరించారు. అన్ని క్యాటగిరీలకు 1:50 నిష్పత్తి ఎంపికలో సర్వీస్ కమిషన్ విఫలమైందని, రిజర్వేషన్ క్యాటగిరీ అభ్యర్థులకు నష్టం జరుగుతున్నదని పేర్కొన్నారు.