హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ) : ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి చేసేందుకు ఏడు రోజుల్లోగా 83 వేల టన్నుల బియ్యాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లను ఆదేశించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ జిల్లాలవారీగా అలాంట్మెంట్ ఇస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిలిప్పీన్స్‌కు 2022-23 యాసంగి టెండర్ ధాన్యం నుంచే లక్ష టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇప్పటికే మిల్లర్ల నుంచి 17 వేల టన్నుల బియ్యాన్ని తీసుకున్న ప్రభుత్వం.. అందులో ఇటీవల 12,500 టన్నులు ఎగుమతి చేసిన విషయం తెలిసిందే. మిగిలిన 83 వేల టన్నుల బియ్యం ఎగుమతి కోసం వెంటనే ధాన్యం మిల్లింగ్‌ను ప్రారంభించాలని తాజాగా పౌరసరఫరాల శాఖ ఆదేశించింది. 2022-23 యాసంగి సీజన్‌కు సంబంధించిన 35 లక్షల టన్నుల ధాన్యాన్ని నిరుడు ప్రభుత్వం వేలం ద్వారా విక్రయించింది. అందులో మిల్లర్లు ఇంకా 14.58 లక్షల టన్నుల ధాన్యాన్ని ఎత్తలేదని ప్రభుత్వం ఒప్పుకున్నది. ఆ ధాన్యం నుంచే లక్ష టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నట్టు పేర్కొన్నది. ధాన్యాన్ని ఎత్తేందుకు ఇటీవల మరో 3 నెలల గడువు పొడగించిన ప్రభుత్వం.. ఆ ధాన్యాన్ని బిడ్డర్లకు వదిలేయకుండా బియ్యం ఎగుమతి చేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.