హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): పదోతరగతి పరీక్ష ఫలితాల్లోనూ బాలికలే సత్తా చాటారు. బాలికలు 94.26 శాతంతో ప్రతిభ కనబరచగా, బాలురు 91.32% ఉత్తీర్ణులయ్యారు. ఈసారి పదో తరగతి ఫలితాల్లో మొత్తంగా 92.78% ఉత్తీర్ణత నమోదయ్యింది. నిరుడు 91.31% విద్యార్థులు ఉత్తీర్ణులవగా ఈ సారి 1.47% ఉత్తీర్ణత పెరిగింది. పదో తరగతి వార్షిక పరీక్ష ఫలితాలను బుధవారం రవీంద్రభారతిలో సీఎం రేవంత్రెడ్డి విడుదల చేశారు. మహబూబాబాద్ జిల్లా 99.29శాతంతో మొదటిస్థానంలో నిలిచింది. సంగారెడ్డి 99.09శాతంతో రెండోస్థానంలో, జనగామ 98.91శాతంతో మూడోస్థానంలో నిలిచింది. జిల్లా పరిషత్ స్కూళ్లల్లో 89.13%, ప్రభుత్వ పాఠశాలల్లో 84.83%, ఎయిడెడ్లో 90.65% విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేట్ బడుల్లో 94.21% ఉత్తీర్ణత నమోదయ్యింది. ఈసారి పదో తరగతి మెమోలపై మార్కులతోపాటు గ్రేడ్లను సైతం ముద్రించారు. ఇంటర్నల్ మార్కులు, థియరీ పరీక్షల్లో వచ్చిన మార్కులను కలిపి మొత్తం మార్కులు వేశారు. సీజీపీఏ గ్రేడ్లను సైతం కేటాయించారు. జూన్ 3 నుంచి 13 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులు ఈ నెల 16లోపు ప్రధానోపాధ్యాయులకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.
సీఎం జిల్లా లాస్ట్..
పదో తరగతి ఫలితాల్లో వికారాబాద్ జిల్లా అతి తక్కువ ఉత్తీర్ణతశాతంతో చివరిస్థానంలో నిలిచింది. సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం వికారాబాద్తోపాటు నారాయణపేట జిల్లాల కిందికి వస్తుంది. వికారాబాద్ 73.97% ఉత్తీర్ణతతో 33వ స్థానంలో నిలిచింది. నారాయణపేట జిల్లా 95.18% ఉత్తీర్ణతతో 19వ స్థానంలో నిలిచింది. మొత్తంగా దివ్యాంగులు 1,306 మంది పరీక్షలు రాయగా, 1,222 (93.57%) మంది ఉత్తీర్ణత సాధించారు. మిగతా పాఠశాలల కంటే గురుకులాలు ఉత్తమ ప్రదర్శన కనబరిచాయి. తెలంగాణ రెసిడెన్సియల్ 98.79%, బీసీ 97.79%, సోషల్ వెల్ఫేర్ 97.71%, గిరిజన 97.63%, మైనార్టీ 96.57% ఉత్తీర్ణత నమోదుచేశాయి. మొత్తంగా 11,554 పాఠశాలల నుంచి విద్యార్థులు పరీక్షలు రాయగా, 4,629 పాఠశాల్లో వందశాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. రెండు పాఠశాలల్లో జీరో ఉత్తీర్ణత నమోదుకాగా, ఈ రెండు ప్రైవేట్ స్కూళ్లే కావడం గమనార్హం.