ఆదిలాబాద్ : పత్తి ( Cotton ) కొనుగోలులో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( సీసీఐ ) అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర కాటన్ అసోసియేషన్ పిలుపు మేరకు జిన్నింగ్ వ్యాపారులు (Ginning mills ) ఆందోళన బాట పట్టారు. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా జిన్నింగ్ పరిశ్రమలు మూసివేసి ( Shut down ) నిరసన తెలిపారు.
సీసీఐ తమ పరిశ్రమలను లీజుకు తీసుకొని పత్తిని ఇవ్వకపోవడంతో నష్టపోతున్నామని జిన్నింగ్ వ్యాపారులు ఆరోపించారు. సీసీ అధికారులు ఎల్1, ఎల్2 నిబంధనలు పాటిస్తూ కొన్ని పరిశ్రమలకు మాత్రమే బేళ్లతయారీకి పత్తిని కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. వీనింగులకు సమానంగా పత్తిని కేటాయించాలని అధికారులను కోరినా ఫలితం లేకుండా పోయిందని జిన్నింగ్ వ్యాపారులు పేర్కొన్నారు.
పరిశ్రమలు మూతపడడంతో జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోలు నిలిచిపోయాయి. దీంతో కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుకింగ్ చేసుకుని పత్తిని విక్రయించడానికి సిద్ధమైన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైతే ప్రభుత్వం తేమ పేరిట పంట కొనుగోళ్లను తిరస్కరిస్తుండటంతో ప్రైవేట్ వ్యాపారులకు అమ్మి క్వింటాలుకు రూ.1,300 చొప్పున నష్టపోయామని తెలిపారు.
జిన్నింగ్ వ్యాపారుల సమ్మె వల్ల ఇబ్బందులు పడుతున్నట్లు రైతులు తెలిపారు. సీసీఐ రోజుకో నిబంధన విధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తుందని, పంట కొనుగోలు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.